ఎరువుల పంపిణీపై విజిలెన్స్
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:10 AM
ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఏపీఏఐఎంఎస్ 2.0) యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానంలో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు: మంత్రి అచ్చెన్న
అమరావతి, జూన్ 7(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఏపీఏఐఎంఎస్ 2.0) యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానంలో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో ‘ఏపీఏఐఎంఎస్ 2.0’ యాప్ అమలుపై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ ఎరువుల పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణతో జిల్లా, క్షేత్రస్థాయి విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్త విధానంలో కౌలురైతులకు ఎలాం టి ఇబ్బందులు రాకుండా చూడాలని, ఎరువుల పంపిణీకి ఆటంకం కలిగించేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనిని స్పష్టం చేశారు. ఎరువులపై రైతు సమస్యల పరిష్కారానికి రియల్‌టైమ్ గ్రీవెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కార్యదర్శి రాజమౌళి జిల్లా అధికారులకు సూచించారు. అన్ని రైతుసేవా కేంద్రాలకు ఏపీఎయిమ్స్ 2.0 లాగిన్ వివరాలు అందించామని, అలాగే ఖరీఫ్-2025 ఈ-క్రా్‌పలో నమోదైన రైతుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సూచించారు.