మత్స్యకారులను వేధించిన జగన్
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:32 AM
గత ప్రభుత్వంలో జాలర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా వేధించిన జగన్‌రెడ్డి.. మత్స్యకారుల సమస్యలను రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
చనిపోయినవారి కుటుంబాలకు మేమే పరిహారం ఇచ్చాం
డీజిల్ సబ్సిడీ బకాయులూ చెల్లించాం: అచ్చెన్న
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో జాలర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా వేధించిన జగన్‌రెడ్డి.. మత్స్యకారుల సమస్యలను రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 2014-19 మధ్య ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 63 మత్స్యకార కుటుంబాలకు పరిహారం చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.3.15కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీజిల్ సబ్సిడీ రూ.9.90కోట్లను సీఎం చంద్రబాబు విడుదల చేశారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండేళ్లలో వచ్చిన క్లైములను పరిష్కరించామన్నారు. మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామన్నారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ప్రభుత్వం విస్తృత గాలింపు చర్యలు చేపట్టిందని, ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మందిని సురక్షితంగా ఇళ్లకు చేర్చామని చెప్పారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్.. మత్స్యకారులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని మండిపడ్డారు.