వాకిలి దాటిన ‘వాంగ్మూలం’!
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:43 AM
అగ్నిమాపక శాఖలో నిధుల దుర్వినియోగం కేసులో ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం కోర్టు మెట్లెక్కలేదు. పైగా అప్పట్లో జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు, ఐపీఎస్ అధికారి సంజయ్ చేతికి చేరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అగ్నిమాపక శాఖలో నిధుల దుర్వినియోగం కేసు .. నిందితుడి వాంగ్మూలం నమోదు చేసిన ఏసీబీ
దాన్ని కోర్టులో సమర్పించకముందే...జైల్లో ఉన్న సంజయ్ చేతికి ఫొటోస్టాట్ కాపీ
ఏసీబీ అధికారుల తీరుపై సందేహాలు
ఆలస్యంగా వెలుగులోకి
సంజయ్ జైలునుంచి విడుదలయ్యాక సోదాల నోటీసు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
అగ్నిమాపక శాఖలో నిధుల దుర్వినియోగం కేసులో ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం కోర్టు మెట్లెక్కలేదు. పైగా అప్పట్లో జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు, ఐపీఎస్ అధికారి సంజయ్ చేతికి చేరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వాంగ్మూలాన్ని ఏసీబీ గడప దాటించింది ఎవరన్న దానిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ ఏడీజీగా, సీఐడీ చీఫ్‌గా పనిచేసిన ఎన్.సంజయ్ సుమారు రూ.4.07 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు ఉన్నట్టు ఏసీబీ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంజయ్ విజయవాడలోని ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. కోర్టు రిమాండ్ విధించడంతో జిల్లా జైల్లో గడిపి, కొద్దిరోజుల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు.
‘ఎంత’ రహస్యం...
సంజయ్‌ను జైలుకు పంపిన తర్వాత ఏసీబీ అధికారులు ఆయన్ను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. సంజయ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రతిసారీ దర్యాప్తు కొనసాగుతోందని, కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని కోర్టులో ఏసీబీ వాదనలు వినిపించింది. ఈ క్రమంలోనే కేసులో చేర్చిన ఓ నిందితుడ్ని అధికారులు విచారించి, ఆయన ఇచ్చిన వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. కానీ సదరు వాంగ్మూలాన్ని న్యాయస్థానానికి సమర్పించలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వాంగ్మూలం ఫొటోస్టాట్ కాపీ అప్పటికే జైల్లో ఉన్న సంజయ్ బ్యారక్‌లోకి చేరింది. ఆయన బెయిల్‌పై బయటకు వచ్చేవరకూ ఆ కాపీ ఆయన వద్దే ఉంది. సంజయ్ అరెస్టు ప్రక్రియ పూర్తయిన కొన్ని రోజులకు మరో నిందితుడ్ని అరెస్టు చేశారు. ఆ తర్వాతే సదరు వాంగ్మూలం అనేక మార్పుచేర్పులతో కోర్టు ముందుకొచ్చింది. ఆ నిందితుడు ఇచ్చిన అసలు వాంగ్మూలం మాత్రం న్యాయస్థానం ముఖం చూడలేదని తెలిసింది. కోర్టు వరకు రాని వాంగ్మూలం కాపీ జైలుల్లో ఉన్న సంజయ్ చెంతకు ఎలా చేరిందన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. సంజయ్‌ను ఆయన తరఫు న్యాయవాది, కుటుంబ సభ్యులు ములాఖత్‌లో కలిసేవారు. ఏసీబీలో ఉన్న కొంతమంది అధికారులే వారి ద్వారా ఈ వాంగ్మూలం కాపీని బయటకు పంపించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు గుర్తుకొచ్చిన ‘రికవరీ’
అగ్నిమాపక శాఖలో యాప్ రూపకల్పన కోసం కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీల నుంచి వస్తువుల రూపం లో సంజయ్ తాయిలాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన కోర్టులో లొంగిపోయినప్పుడు గానీ, జైల్లో ఉన్నప్పుడు గానీ ఈ అంశంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించలేదు. ఇప్పుడు సంజయ్ బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత హడావుడి మొదలుపెట్టారు. తాయిలాలుగా తీసుకున్న వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి కొద్దిరోజుల క్రితం సంజయ్‌కు ఏసీబీ నుంచి నోటీసులు వెళ్లాయి. సోదాలకు ఎప్పుడు వస్తారో తేదీని నోటీసులో బహిర్గతం చేయడంతో సదరు వస్తువులను సంజయ్ ఇప్పటికే గడప దాటించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.