దండుకోవడానికి పక్కా వ్యూహాలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:53 AM
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో కటకటాలు లెక్కిస్తున్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగరి శాంతి అవినీతిలో పలు కోణాలు ఉన్నాయి. పనిచేసిన ప్రతిచోట ఆమె పక్కా వ్యూహంతో దండుకున్నారు.
శాంతి అవినీతిలో పలు కోణాలు
స్కూటీ ఇవ్వాల్సిందేనని ఓ అర్చకుడితో తగువు
గుడికి దేవదాయ శాఖ నుంచి మినహాయింపులోనూ భారీగా లంచాలు
లంబసింగిలో సొంత పర్యాటక ప్రాజెక్టుకు ఏర్పాట్లు
మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మొత్తం అక్రమార్జన బహిర్గతమయ్యే అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో కటకటాలు లెక్కిస్తున్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగరి శాంతి అవినీతిలో పలు కోణాలు ఉన్నాయి. పనిచేసిన ప్రతిచోట ఆమె పక్కా వ్యూహంతో దండుకున్నారు. విశాఖలో ఏసీగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆమె.. ఆలయాల్లో అర్చకులను భయపెట్టి దారికి తెచ్చుకున్నారు. విశాఖలో కలెక్టరేట్ సమీపాన బెల్లం వినాయకుడి గుడిలో ప్రతి బుధవారం భక్తులు మొక్కుబడిగా బెల్లం సమర్పిస్తారు. వాటి విక్రయాల ద్వారా అర్చకుడికి బాగా ఆదాయం వస్తోందని తొలి టార్గెట్ ఆయనకే పెట్టారు. ఆ అర్చకుడు వాడుతున్నలాంటి స్కూటీనే తనకు బహుమతిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొద్దిరోజులకే ఆమె కొత్త స్కూటీపై తిరగడం ప్రారంభించారు. అదేవిధంగా ఆదాయం అధికంగా ఉండే విశాఖలో సంపత్ వినాయకుడి ఆలయం ట్రస్టు నిర్వహణలో ఉంది. దేవదాయ శాఖ నుంచి మినహాయింపు తెచ్చుకొని వారే నిర్వహించుకుంటున్నారు. ఆ విషయం గుర్తించి తన వెనకున్న వైసీపీ నేత పవర్‌తో గుడి మినహాయింపును రద్దు చేయించారు. ఆ తరువాత మళ్లీ మినహాయింపు ఇచ్చారు. ఈ వ్యవహారంలో భారీగానే ఆమె లాభపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
లీజు పెంపునకు భారీగా ముడుపులు
పరవాడ మండలం లంకెలపాలెంలో పరదేశమ్మ ఆలయానికి 10.13 ఎకరాల భూమి ఉంది. అందులోని ఎకరా భూమి లీజుకు తీసుకుని ‘ఐస్‌క్రీమ్ ఎల్‌ఎల్‌పీ’ అనే సంస్థ నడుస్తోంది. ఆ లీజ్ రద్దు చేయిస్తానని బెదిరించారు. డీల్ కుదిరాక 11 ఏళ్లకు దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేశారు. ఈ లీజు వ్యవహారంలో భారీగా తన భార్యకు డబ్బులు ముట్టాయని శాంతి భర్త మదన్‌మోహన్ స్వయంగా వెల్లడించారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు లంబసింగిలో పర్యాటక ప్రాజెక్టు ఒకటి ఏర్పాటు చేయడానికి మూడు ఎకరాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ విషయాలు విశాఖపట్నం కేజీ ఆస్పత్రిలో పనిచేసే గైనకాలజీ డాక్టర్ ఒకరికి బాగా తెలుసు. ఆ డాక్టరే శాంతికి ఆరిలోవ అపోలో ఆస్పత్రిలో డెలివరీ చేశారు. ఆ డాక్టర్‌కు ఒంగోలుకు బదిలీ అయితే, వైసీపీ నాయకుడి అండతో ఆ బదిలీని అడ్డుకున్నారు. శాంతి మొదటి భర్త మదన్‌మోహన్‌కు దూరమైన తరువాత కవల పిల్లల్లో ఒక పిల్లను ఆయనకు ఇచ్చేశారు. ఒక పాపను తాను ఉంచుకున్నారు. అప్పట్లో పిల్లలకు ఆమె జీతం కంటే రెట్టింపు మొత్తం స్కూల్ ఫీజు కట్టేవారు. ఇప్పుడు ఉన్న కుమార్తె కోసం ఏటా రూ. 18 లక్షలు ఫీజు కట్టి ఊటీలో చదివించడానికి సిద్ధమయ్యారని తెలిసింది. ఈ ఖర్చులన్నింటికీ ఆమెకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది తెలియాల్సి ఉంది. అలాగే, ఆమె విజయవాడ వెళ్లిన తరువాత ఖరీదైన విల్లా కొనుగోలు చేశారు. ఆమె అవినీతిపై అప్పట్లో వచ్చిన పత్రిక కథనాలను దేవదాయ శాఖ పట్టించుకోలేదు. ఇప్పడికైనా ఏసీబీ అధికారులు మరింత క్షుణ్ణంగా సోదాలు చేస్తే మొత్తం అక్రమ ఆస్తులు బయటపడే అవకాశం ఉంది.
ఏసీ శాంతిని కస్టడీకి ఇవ్వండి
కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన దేవదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిని మరింత విచారించేందుకు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులు ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోదాల సమయంలో ఆమె కొన్ని వివరాలు మాత్రమే వెల్లడించారని, ఇంకా అనేక విషయాలను దాచిపెట్టారని పిటిషన్‌లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.