అవినీతిపరులపై ఏసీబీ పంజా!
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:11 AM
అవినీతి నిరోధక శాఖ గురువారం రాష్ట్రంలోని పలు చోట్ల దాడులు నిర్వహించింది. పంచాయతీరాజ్ రిటైర్డు ఎస్‌ఈ కల్లేపల్లి శ్రీనివాసరావు రూ.30 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించింది.
విశాఖలో పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్‌ఈ అరెస్టు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
అవినీతి నిరోధక శాఖ గురువారం రాష్ట్రంలోని పలు చోట్ల దాడులు నిర్వహించింది. పంచాయతీరాజ్ రిటైర్డు ఎస్‌ఈ కల్లేపల్లి శ్రీనివాసరావు రూ.30 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించింది. విశాఖ, సాలూరుతో పాటు హైదరాబాద్‌లలో శ్రీనివాస్, ఆయనకు చెందిన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఐదు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయనపై ఆదాయానికి మించిన కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. వీఎల్‌టీ మంజూరుకు రూ.20వేలు లంచం తీసుకుంటున్న నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.రమే్‌షబాబును, భోజనం బిల్లులు మంజూరుకు రూ.15 వేలు లంచం తీసుకున్న శ్రీసత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి బాలాజీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
భారీస్థాయిలో ఆస్తుల గుర్తింపు
పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ)గా పనిచేసిన కె.శ్రీనివాసరావు గత డిసెంబరు 31న రిటైర య్యారు. ఆయన ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో విశాఖ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో గురువారం ఉదయం దాడులు చేశారు. విశాఖలో ఎంవీవీ సిటీలోని శ్రీనివాసరావు నివాసంతోపాటు మురళీనగర్‌లోని అతని స్నేహితుడైన పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఈఈ గౌరీశంకర్ ఇళ్లు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని శ్రీనివాసరావు, అతని సమీప బంధువు నివాసాలు, హైదరాబాద్‌లో కుమార్తె ఇంటిలో సోదాలు నిర్వహించారు. విశాఖలో మూడు చోట్ల ఇళ్ల స్థలాలు, రెండు ఫ్లాట్‌లు, ఒక ఇల్లు, సాలూరులో కుమార్తె పేరిట 18.57 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. సాలూరులోని బావమరిది ఇంట్లో రూ.30 లక్షలు నగదు, హైదరాబాద్‌లోని కుమార్తె ఇంట్లో రూ.25 లక్షలు, ఎంవీవీ సిటీలోని శ్రీనివాసరావు ఇంట్లో రూ.లక్ష, 2.5 కిలోల బంగారం, 20.3 కిలోల వెండి, హుండాయ్ కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విలువ రూ.30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
రూ.20 వేలు లంచం తీసుకుంటూ..
నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.రమేష్ బాబును కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అవసరమైన ఖాళీ స్థలానికి పన్ను (వీఎల్‌టీ) మంజూరుకు ఆయన రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో... మున్సిపల్ కమిషనర్ బిల్ కలెక్టర్ భాస్కర్ ద్వారా రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ఏసీబీ వలలో ఏబీసీడబ్ల్యూవో
బీసీ హాస్టళ్ల భోజనం బిల్లులు మంజూరు చేసేందుకు రూ.15వేలు లంచం తీసుకుంటూ శ్రీసత్యసాయి జిల్లా కదిరి డివిజన్ బీసీ సంక్షేమశాఖ సహాయ అధికారి పురం బాలాజీ పట్టుబడ్డారు. 2023-24కి సంబంధించిన భోజనం బిల్లుల మంజూరుకు వార్డెన్ లక్ష్మీనారాయణను రూ.18వేలు లంచం అడిగారు. వార్డెన్ రూ.15 వేలు ఇస్తానని ఒప్పుకొని, ఏసీబీని ఆశ్రయించారు. కదిరిలోని బాలాజీ ఇంటికెళ్లి డబ్బులు ఇచ్చి బయటకు వచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు దాడులు చేసి, బాలాజీని పట్టుకున్నారు. బాలాజీ సొంతూరు అన్నమయ్య జిల్లా రాయచోటిలో చేసిన సోదాల్లో పెద్దఎత్తున బంగారం, వెండి, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.