Share News

కళ్లు చెదిరే భవనాలు.. ఖరీదైన స్థలాలు

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:46 AM

రూ.2 కోట్ల విలువైన ట్రిపుల్‌ ఎక్స్‌ విల్లా. రెండు ఖరీదైన భవనాలు.. లక్షల విలువైన ఐదు స్థలాలు... వెండీ బంగారు ఆభరణాలు..

కళ్లు చెదిరే భవనాలు.. ఖరీదైన స్థలాలు

  • కోట్లకు పడగలెత్తిన నంద్యాల సబ్‌ రిజిస్ర్టార్‌

  • ఏకకాలంలో ఆరుచోట్ల ఏసీబీ తనిఖీలు

  • బంగారం, వెండి, లక్షల విలువైన గృహోపకరణాలు గుర్తింపు

నంద్యాల క్రైం/ కర్నూలు క్రైం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రూ.2 కోట్ల విలువైన ట్రిపుల్‌ ఎక్స్‌ విల్లా. రెండు ఖరీదైన భవనాలు.. లక్షల విలువైన ఐదు స్థలాలు... వెండీ బంగారు ఆభరణాలు.. గృహోపకరణాలు.. ఇవీ నంద్యాల సబ్‌ రిజిస్ర్టార్‌ ఈశ్వర గోపాల్‌ ఆస్తులు. కర్నూలు నగర శివారు పెద్దపాడు సమీపంలో ఉన్న మైత్రి హోమ్స్‌లో సబ్‌ రిజిస్ర్టార్‌ ఈశ్వర గోపాల్‌ ఇంట్లో గురువారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో సబ్‌ రిజిస్ర్టార్‌కు సంబంధించిన ఆరు చోట్ల తనిఖీలు చేశారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈశ్వర గోపాల్‌ తండ్రి ఏపీఎస్పీ బెటాలియన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తూ మృతి చెందారు. కారుణ్య నియామకం కింద ఈశ్వర గోపాల్‌కు జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం లభించింది. ఈయన ప్రస్తుతం నంద్యాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ర్టార్‌గా కొనసాగుతున్నారు. ఈయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈశ్వరగోపాల్‌ మైత్రి హోమ్స్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ట్రిపుల్‌ ఎక్స్‌ విల్లాలో ఉంటున్న ఈయన నివాసాన్ని చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయారు. ఆ విల్లా ఖరీదు రూ.2 కోట్లుపైనే ఉంటుందని అంచనా వేశారు. ఆయన ఇంట్లో 2 కిలోల వెండి ఆభరణాలు, 3 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈయనకు బాలాజీనగర్‌లో జీ ప్లస్‌ 2 భవనం, గణేష్ నగర్‌లో మరో జీ ప్లస్‌ 1 భవనం ఉన్నట్లు గుర్తించారు.


వీటికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలుగు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు సీజ్‌ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో 25 సెంట్ల ఖరీదైన స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. అతడి ఇంట్లో రూ.25 లక్షల విలువైన గృహోపకరణాలు లభ్యమయ్యాయి. ఈయనకు ఒక కారు, బుల్లెట్‌, స్కూటీ ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడే కాకుండా హైదరాబాద్‌లో ఆయన సోదరి హారికాబాయి ఇంట్లోనూ, అనంతపురంలోని ఆయన బావమరిది ఇంట్లోనూ, కర్నూలులోని ఈశ్వర గోపాల్‌ భార్య సోదరుడు వినోద్‌కుమార్‌ ఇంట్లోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈయనకు మిత్రుడు, బినామిగా బావిస్తున్న మణికంఠ హోమ్స్‌లో నివసిస్తున్న రాజాబాషా ఇంట్లోనూ తనిఖీలు చేశారు. నంద్యాల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు. తన ఇంటిని ఈశ్వరగోపాల్‌ అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దుకున్నట్లు గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ఆస్తుల విలువ రూ.2.8 కోట్లు ఉంటుందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.5 కోట్లుపైబడి ఉంటుంది.

Updated Date - Aug 07 , 2026 | 05:47 AM