బీసీ సంక్షేమాధికారి నివాసాల్లో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Mar 03 , 2026 | 05:08 AM
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి (ఏబీసీడబ్ల్యూవో) గడ్డి బాల ముకుందరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు జరిపారు.
రూ.1.10 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
శ్రీకాకుళం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి (ఏబీసీడబ్ల్యూవో) గడ్డి బాల ముకుందరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు జరిపారు. ఈ సోదాల్లో సుమారు రూ.1.10 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. నరసన్నపేట ఏబీసీడబ్ల్యూవోగా పనిచేస్తున్న బాలముకుందరావు ఇదే జిల్లాలోని సోంపేట విభాగానికి కూడా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వసతిగృహాలకు సంబంధించి మెస్ బిల్లులు మంజూరు చేసినందుకు, ఆయన ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున వార్డెన్ల నుంచి మాముళ్ల వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులందాయి. దీంతో ఈఏడాది జనవరి 28న శ్రీకాకుళం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సోదాల్లో బాల ముకుందరావుతో పాటు ఆయన కార్యాలయ సహాయకుడు గుడ్ల రామకృష్ణ వద్ద లెక్క చూపని రూ.1,84,070 నగదును అధికారులు గుర్తించారు. దాన్ని లంచం డబ్బుగా నిర్ధారించి స్వాధీనం చేసుకున్న అధికారులు.. కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో గల బాల ముకుందరావు రెండు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు చేపట్టారు. రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్‌రిజస్ట్రార్ కార్యాలయాల పరిఽధిలో 4 స్థిరాస్తులు, 322 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.75 కిలోల వెండి, కొంత నగదు, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.10 కోట్లుగా ఉంటుందని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.