Share News

సార్‌... సోదాలకు వస్తున్నాం!

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:26 AM

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ చిక్కితే ఆయన ఇంట్లో వెంటనే ఏసీబీ సోదాలు చేస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తులున్న వారి కేసుల్లో బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తారు.

సార్‌... సోదాలకు వస్తున్నాం!

  • ఐపీఎస్‌ సంజయ్‌పై ఏసీబీ ‘ప్రేమ’

  • తనిఖీల సమాచారం ముందుగానే లీక్‌

  • ఆపై మూడు రోజుల తర్వాత సోదాలు

  • ఈలోపే మొత్తం ఫర్నిచర్‌ తరలింపు

  • తనిఖీల్లో ఏమీ దొరకలేదంటూ నివేదిక

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ చిక్కితే ఆయన ఇంట్లో వెంటనే ఏసీబీ సోదాలు చేస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తులున్న వారి కేసుల్లో బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తారు. ఇవన్నీ వెంటవెంటనే జరిగిపోతాయి. కానీ, ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌ విషయంలో ఏసీబీ మమకారాన్ని చూపించుకుంది. ఆయన ఇళ్లలో ఉన్న సామగ్రిని మొత్తం మాయం చేసిన తర్వాత, తీరిగ్గా వెళ్లి సోదాలు చేసి... ‘అక్కడ ఏమీ లేవు’ అని నివేదికలో రాసింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక శాఖలో యాప్‌ రూపకల్పనకు సంబంధించి సుమారు 1.05 కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సంజయ్‌ ప్రధాన నిందితుడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన కోర్టులో లొంగిపోయి, తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. నిజానికి... కేసు నమోదు చేసిన వెంటనే సంజయ్‌కి సంబంధించిన ఇళ్లలో సోదాలు జరపాల్సింది. కానీ... అలా చేయలేదు. ఆయనకు ఎక్కడెక్కడ ఇళ్లున్నాయో ఏసీబీ అధికారులకు స్పష్టంగా తెలుసు. సంజయ్‌కి హైదరాబాద్‌ బేగంపేటలోని కుందన్‌బాగ్‌లో ఉన్న కంట్రీ క్లబ్‌ అపార్టుమెంట్‌లో ఒక ఫ్లాట్‌ ఉంది. గుంటూరులోనూ ఒక ఫ్లాట్‌ ఉంది. ఈ రెండు కాకుండా కుందన్‌బాగ్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారుల క్వార్టర్స్‌లో ఉంటున్నట్టు సమాచారం. సంజయ్‌ సీఐడీ చీఫ్‌గా, అగ్నిమాపక శాఖ ఏడీజీగా పనిచేసిన సమయంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల నుంచి ముడుపులను వస్తురూపంలో తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కంట్రీక్లబ్‌ అపార్టుమెంట్‌లో ఖరీదైన సామగ్రిని పెట్టించారు.


ముందే ఉప్పందించి...: ఈ నెల 19న సంజయ్‌ ఇళ్లలో చేసే సోదాలు జరపాలని నిర్ణయించారు. అప్పుడైనా యుద్ధ ప్రాతిపదికన సోదాలు జరిపారా అంటే అదీ లేదు. తీరిగ్గా... ఈనెల 23న ఆ పని చేశారు. కానీ, 20వ తేదీనే ‘సోదాల సమాచారం’ సంజయ్‌కి చేరింది. దీంతో ఆయన కంట్రీక్లబ్‌ ఫ్లాట్‌లో ఉన్న సామగ్రిని మరో చోటికి తరలించేశారు. అదే ఫ్లాట్‌లో తాను ఏర్పాటు చేసుకున్న ఖరీదైన స్విచ్‌ బోర్డులను సైతం మార్చేశారు. కుందన్‌బాగ్‌లో ఉన్న క్వార్టర్స్‌, గుంటూరులోని అపార్టుమెంట్‌లో ఉన్న సామగ్రిని మొత్తం స్నేహితులు, బంధువుల ఇళ్లకు తరలించేశారు. ఇదంతా పూర్తయిన తర్వాత... ఏసీబీ అధికారులు తీరిగ్గా సోదాలకు బయలుదేరారు. ఈ నెల 23న మూడు ఇళ్లలో సోదాలు చేశారు. అక్కడ రూ.3-4 లక్షల నగదు మినహా ఇతరత్రా ఏమీ లభించలేదని నివేదిక రాసి అధికారులకు సమర్పించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సోదాలపై లీకులు ఇచ్చేసి... ఆ తర్వాత మూడు రోజులకు వెళితే ఇంకేముంటుంది!

Updated Date - Feb 26 , 2026 | 03:28 AM