Share News

ACB DG Atul Singh: నిఘా వేశాం.. పట్టుకుంటాం

ABN , Publish Date - Jan 03 , 2026 | 05:26 AM

రాష్ట్రంలో కరుడుగట్టిన అవినీతిపరులపై నిఘా పెట్టాం. వారి బినామీల డేటాను ఏఐ ద్వారా సేకరిస్తున్నాం.

ACB DG Atul Singh: నిఘా వేశాం.. పట్టుకుంటాం

  • అవినీతి తిమింగలాల ఆట కట్టిస్తాం

  • బినామీల ఆస్తుల వివరాలు సేకరిస్తున్నాం.. ఏఐ వినియోగంతో సమాచార సేకరణ

  • ఏసీబీ కేసుల్లో ‘రెవెన్యూ’ టాప్‌.. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో సోదాల్లో కీలక విషయాలు

  • ఈ ఏడాది మరో 4 శాఖలపై దృష్టి.. నిందితులకు మూడేళ్లలో శిక్ష పడేలా చర్యలు

  • 1064కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వండి.. ఏసీబీ డీజీ అతుల్‌సింగ్‌ పిలుపు

‘‘ప్రభుత్వ శాఖల్లో అవినీతి కట్టడి చేసేందుకు ఏసీబీ చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడంలేదు. ప్రజలూ సహకరిస్తేనే అవినీతి రాకాసిని అణచి వేయగలం. అవినీతికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేయండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. వ్యక్తిగత కక్షతోనో మరో కారణంతోనో కాకుండా ప్రజా ప్రయోజనాల కోణంలోనే ఫిర్యాదు ఉండాలి!’’ - అతుల్‌ సింగ్‌, ఏసీబీ డీజీ

అమరావతి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో కరుడుగట్టిన అవినీతిపరులపై నిఘా పెట్టాం. వారి బినామీల డేటాను ఏఐ ద్వారా సేకరిస్తున్నాం. ఈ ఏడాది అవినీతి తిమింగలాల పని పడతాం. అవినీతికి పాల్పడినవారిని మూడేళ్లలోనే జైలుకు పంపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని అవినీతి నిరోధక శాఖ డీజీ అతుల్‌సింగ్‌ ప్రకటించారు. గత ఏడాదిలో ఏసీబీ పనితీరును శుక్రవారం విజయవాడలోని ఎన్టీఆర్‌ పరిపాలన భవనంలో మీడియాకు వివరించారు. ‘‘అక్రమాస్తుల కేసులపై ఇప్పటికే దృష్టి పెట్టాం. పెద్ద చేపలు బినామీల పేరుతో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించాం. వాటిపై నిఘా పెట్టాం. ఐజీఆర్‌ఎ్‌సలో ఆస్తుల రిజిస్ర్టేషన్లతో పాటు బ్యాంకుల లావాదేవీలు కూడా ఏఐ ద్వారా సేకరిస్తున్నాం. అవినీతిపరుల అక్రమాస్తుల సమాచారాన్ని ఒకేచోట క్రోడీకరించేందుకు వీలుగా ఏఐని ఉపయోగిస్తాం’’ అని ఏసీబీ డీజీ తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ శాఖలో ఎక్కువ అవినీతి జరుగుతోందని, రిజిస్ట్రేషన్స్‌ కార్యాలయాలపై దాడులు చేసినప్పుడు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఈ ఏడాది మరో 4 కీలక శాఖలపై దృష్టి పెట్టామన్నారు.


2025లో 115 కేసులు నమోదు చేసి అవినీతికి పాల్పడ్డవారిని జైలుకు పంపామని, అయినా అవినీతి అదుపులోకి రాలేదని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించామని తెలిపారు. ‘‘అవినీతిపరులకు శిక్షలు పడితేనే భయం ఉంటుంది. ఆ దిశగా పనిచేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సీఎం సూచించారు. సీఎం సూచనతో టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064తో పాటు ఫిర్యాదుల నంబర్‌ 9440440057ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం’’ అని అతుల్‌ సింగ్‌ తెలిపారు. గత ఏడాది 1064కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 16 కేసులు నమోదు చేసి అవినీతిపరుల్ని జైలుకు పంపామని తెలిపారు. ఏసీబీకి మానవ వనరుల అవసరమూ ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వాట్సప్‌ గవర్నెన్స్‌లోకి ఏసీబీని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఏఐ టెక్నాలజీ అందిపుచ్చుకుని ఈ ఏడాది అవినీతి వేటలో వేగంతో పాటు నాణ్యత పెంచుతామని స్పష్టం చేశారు.


శిక్షలు పెరగాలి...

శిక్షల శాతం సంతృప్తికరంగా లేదని, గత ఏడాది కోర్టు తీర్పుల్లో 46 శాతమే శిక్షలు పడ్డాయని అతుల్‌ సింగ్‌ తెలిపారు. ప్రధానంగా 161 స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సాక్షులు ఆ తర్వాత కోర్టుల్లో మాట మార్చారని... ఇకపై 164 స్టేట్‌మెంట్‌ (కోర్టులో జడ్జి ముందు) రికార్డు చేసి, మాట మారిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేలా జాగ్రత్త పడతామని వివరించారు. ఈ ఏడాది కనీసం 75 శాతం కేసుల్లో శిక్షలు పడేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని తమ లీగల్‌ టీమ్‌ను, దర్యాప్తు అధికారులను ఏఐ టెక్నాలజీ వైపు నడిపిస్తున్నట్లు వివరించారు. అవినీతికి పాల్పడినవారికి శిక్షలు వేయించేందుకు పది, పన్నెండేళ్లు పడుతోందన్నారు. కొత్త ఏడాదిలో పాత కేసులన్నింటీలో శిక్షలు పడేలా చూడటంతో పాటు చార్జిషీట్‌ దాఖలు చేసిన మూడేళ్లలో శిక్షలు వేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అవినీతికి సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించేలా స్థానిక ఏసీబీ కోర్టులతో సమన్వయం చేసుకుని, అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరూ జైలు పాలయ్యేలా కసరత్తు చేస్తున్నామని చెప్పారు.


అవినీతి వేటలో వేగం

2025లో పాతిక వేల నుంచి పాతిక లక్షల వరకూ లంచం తీసుకున్న వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సంఖ్య పెంచాల్సి ఉందని ఏసీబీ డీజీ అన్నారు. ఈ సమావేశంలో ఏసీబీ జేడీలు సుప్రజ, అశోక్‌ కుమార్‌, సురేశ్‌ కుమార్‌, రాజశేఖర్‌, రజనితో పాటు లీగల్‌ అడ్వైజర్‌ రాంబాబు పాల్గొన్నారు.

సంచలన కేసులు

  • గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సబ్బవరపు శ్రీనివాసరావు విజయవాడలో రూ.25 లక్షలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డారు.

  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌ నారాయణస్వామి రూ.5 లక్షలు లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కారు.

  • లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ రూ.1.78 లక్షల అవినీతి సొమ్ము తీసుకుని రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు.

  • బాపట్ల జిల్లా రేపల్లె ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వి.వి.రమణ రావు రూ.1.25 లక్షలు లంచం సొమ్ముతో ఏసీబీకి బుక్కయ్యారు.

  • కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ మరో ఇద్దరితో కలిసి లక్ష రూపాయలు లంచం తీసుకొంటూ ఏసీబీకి అడ్డంగా చిక్కారు.

Updated Date - Jan 03 , 2026 | 05:27 AM