Share News

వీటికి బదులేది?

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:57 AM

అక్రమాస్తుల కేసులో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతి కస్టడీ గురువారంతో ముగిసింది. రెండు రోజులు ఆమెను విజయవాడ గొల్లపూడి కార్యాలయంలో ప్రశ్నించినా ఏసీబీ అధికారులకు ఆశించిన సమాధానాలు లభించలేదు.

వీటికి బదులేది?

  • శాంతి కేసులో సమాధానం దొరకని అంశాలెన్నో

  • అక్రమాస్తులపై ప్రశ్నలకు కస్టడీలో దబాయింపు

  • ఆది నుంచీ ఆమెపై చర్యలకు వెనుకడుగే

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

అక్రమాస్తుల కేసులో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతి కస్టడీ గురువారంతో ముగిసింది. రెండు రోజులు ఆమెను విజయవాడ గొల్లపూడి కార్యాలయంలో ప్రశ్నించినా ఏసీబీ అధికారులకు ఆశించిన సమాధానాలు లభించలేదు. ఆదాయానికి మించిన ఆస్తులు ఎలా సంపాదించారనే ప్రశ్నకు ఆమె జవాబు ఇవ్వలేదు. ఉద్యోగంలో చేరిన రెండో ఏడాదిలోనే, 2021 సెప్టెంబరులో విశాఖ ఎండాడలో రూ.70 లక్షలకు పైచిలుకు విలువ చేసే ఫ్లాట్‌ శాంతి కొన్నారు. వడ్డాణం, కాసులపేరు, నెక్లస్‌ సెట్‌ వంటి ఏడువారాల నగలు చేయించుకుని ఆలయా లకు వెళ్లేవారు. ఐస్‌క్రీమ్‌ కంపెనీకి లంకెలపాలెంలో ఎకరా భూమిని 11 ఏళ్ల లీజుకు ఇవ్వడానికి రూ.లక్షల్లో ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నా యి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కుంచనపల్లి బ్రూక్‌ ఫీల్డ్‌లో రూ.4 కోట్ల విల్లా కొన్నారు. దీనికోసం వైసీపీ నేత ఒకరు విశాఖలో బిల్డర్‌తో రూ.కోటి నగదు ఇప్పించారు. అదేవిధంగా హైదరాబాద్‌లో తన ఇంటి నుంచి మరో రూ.60 లక్షలు ఇచ్చారు. ఏసీబీ దర్యాప్తు క్రమంలో విజయవాడలోని ఓ బ్యాంకు లాకరులో చిన్నపిల్లలకు చెందిన బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. రెండు స్థిరాస్థులు కొంటున్నట్లు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా, నిధులు ఎక్కడి నుంచి సమీకరించారనేది చెప్పలేదు. ఆమె తన కుమార్తెను ఊటీ స్కూల్‌లో చేర్పించారని సమాచారం. ఏడాదికి రూ.18 లక్షల ఫీజు అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారాలన్నింటికీ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది బయటపడాల్సి ఉంది.

Updated Date - Apr 17 , 2026 | 04:57 AM