Share News

Liquor Scam: లిక్కర్‌ గ్యాంగ్‌కు 16 వరకు రిమాండ్‌

ABN , Publish Date - Jan 03 , 2026 | 06:37 AM

మద్యం కుంభకోణంలో వివిధ జైళ్లలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి...

Liquor Scam: లిక్కర్‌ గ్యాంగ్‌కు 16 వరకు రిమాండ్‌

  • ఆ రోజు సెలవైతే 19న కోర్టుకు

విజయవాడ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో వివిధ జైళ్లలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌ నాయుడు, బూనేటి చాణక్య, అనిల్‌ చోక్రా, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నవీన్‌ కృష్ణ, బాలాజీ కుమార్‌ యాదవ్‌, రోణక్‌ కుమార్‌ను పోలీసులు ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. వారికి 16వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. సంక్రాంతి నేపథ్యంలో రిమాండ్‌ పొడిగింపుపై కొద్దిసేపు చర్చ జరిగింది. తొలుత 12వ తేదీ వరకు రిమాండ్‌ విధించాలని భావించారు. ఆ తేదీకి పది రోజుల మాత్రమే వస్తున్నాయని ప్రాసిక్యూషన్‌ అభ్యంతరం తెలిపింది. దర్యాప్తు అధికారి శ్రీహరిబాబు మాత్రం 14వ తేదీకి వాయిదా వేయాలని కోరారు. ఆ రోజు సెలవు వచ్చే అవకాశం ఉందని డిఫెన్స్‌ న్యాయవాదులు తెలిపారు. సంక్రాంతి సెలవులు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేనందున 16 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ 16వ తేదీన సెలవు అయితే 19న నిందితులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. నిందితుడు బూనేటి చాణక్య తరఫున న్యాయవాది సుందర్‌ వాదనలు వినిపించారు. రిమాండ్‌ పొడిగింపు రిపోర్టులో నిందితులందరికి కలిపి ఒకే విషయాన్ని రాస్తున్నారని తెలిపారు. చాణక్య రిపోర్టులో సిట్‌ రాసిన ఐదో పేరాతో అతనికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ రిపోర్టు చాణక్యకు వర్తించదని పేర్కొన్నారు. దీనికి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ విజయలక్ష్మి నిందితుల రిపోర్టు అంతా ఒకేలా ఉంటుందన్నారు. దీన్ని రికార్డు చేయాలని సుందర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో బెయిల్‌ పొందిన కృష్ణ మోహన్‌రెడ్డి, ధనంజయ్‌రెడ్డి, పైలా దిలీప్‌ కోర్టుకు హాజరయ్యారు. ఎంపీ మిథున్‌ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వాయిదాకు హాజరుకాలేమని ఆబ్‌సెంట్‌ పిటిషన్‌ వేశారు.


న్యాయాధికారికి విజ్ఞాపనలు

రిమాండ్‌ పొడిగింపు పూర్తయిన తర్వాత బూనేటి చాణక్య భోజనం గురించి న్యాయాధికారితో మాట్లాడారు. జైల్లో పెడుతున్న భోజనం బాగోవడం లేదని, ఇంటి నుంచి తెప్పించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించిన పిటిషన్‌ కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. అనిల్‌ చోక్రా ఆస్తమాతో బాధపడుతున్నాడని, తాగడానికి వేడినీళ్లు ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనిపై మోమో దాఖలు చేయాలని న్యాయాధికారి ఆదేశించారు.

‘సిట్‌’ కస్టడీకి జోగి బ్రదర్స్‌

నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రామును ములకలచెరువు ఎక్సైజ్‌ పోలీసులు శుక్రవారం కస్టడీకి తీసుకున్నారు. వారం రోజులపాటు వారిని కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌ పోలీసులు విజయవాడలోని ఆరో అదనపు ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జోగి బ్రదర్స్‌ను శుక్రవారం నుంచి ఆదివారం వరకు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ములకలచెరువు ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి విజయవాడ జైలు నుంచి రమేశ్‌, రామును కస్టడీలోకి తీసుకున్నారు. వారికి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత గురునానక్‌ కాలనీలో ఎక్సైజ్‌ తూర్పు పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని వేర్వేరుగా విచారించారు.

Updated Date - Jan 03 , 2026 | 06:37 AM