Share News

ఏసీ పేలి రిటైర్డ్‌ ఉద్యోగి సజీవ దహనం

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:04 AM

ఏసీ పేలి రిటైర్డ్‌ ఉద్యోగి సజీవ దహనమయ్యారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిందీ ఘటన. పట్టణ ఎస్‌ఐ సంతోష్ కుమార్‌ కథనం ప్రకారం..

ఏసీ పేలి రిటైర్డ్‌ ఉద్యోగి సజీవ దహనం

  • విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే కారణమన్న అగ్నిమాపక అధికారులు

అనకాపల్లి టౌన్‌, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఏసీ పేలి రిటైర్డ్‌ ఉద్యోగి సజీవ దహనమయ్యారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిందీ ఘటన. పట్టణ ఎస్‌ఐ సంతోష్ కుమార్‌ కథనం ప్రకారం.. నీటిపారుదల శాఖలో పనిచేసిన రేబాక రామారావు (71) పట్టణంలోని లక్ష్మీదేవిపేటలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి రామారావు ఒక గదిలో, భార్య, కుమారుడు మరో గదిలో నిద్రకు ఉపక్రమించారు. ఉక్కపోతగా ఉండడంతో రామారావు గదిలో ఏసీ ఆన్‌ చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలు దాటిన తరువాత ఏసీ పెద్ద శబ్దంతో పేలిపోయి ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. దీంతో వేరే గదిలో ఉన్న భార్య, కుమారుడు మేల్కొని రామారావు ఉన్న గది వద్దకు వెళ్లారు. అప్పటికే మంటలు చుట్టుపక్కలకు వ్యాపిస్తుండడంతో దగ్గరికి వెళ్లలేక బయటకొచ్చేశారు. ఏసీ పేలుడు శబ్దంతో ఇరుగుపొరుగు సైతం ఇళ్ల నుంచి బయటికి వచ్చేశారు. అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌ చేయడంతో కొద్దిసేపటికి సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. లోపలికి వెళ్లి చూడగా రామారావు శరీరం పూర్తిగా కాలిపోయి కనిపించింది. క్లూస్‌ బృందం ఆధారాలు సేకరించింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏసీ పేలిందని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Mar 31 , 2026 | 05:04 AM