ఏయూలో విద్యార్థి సంఘాల ఘర్షణ
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:18 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య బుధవారం ఉదయం ఘర్షణ జరిగింది. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు...
ఏబీవీపీ, ఎస్‌ఎఫ్ఐ/ఏఐఎస్ఎఫ్ నాయకుల మధ్య వాగ్వాదం
విశాఖపట్నం, అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య బుధవారం ఉదయం ఘర్షణ జరిగింది. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘాల మధ్య కొద్దిరోజులుగా కోల్డ్‌వార్ జరుగుతోంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్‌ఎ్‌సఎస్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి లా కాలేజీ ఎదురుగా బాస్కెట్‌బాల్ మైదానంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్ఎస్ శాఖ నిర్వహిస్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించారు. ఆ తరువాత మరోసారి గొడవకు దిగే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం ఉదయం ఏబీవీపీ నాయకులు వీసీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది తెలుసుకున్న ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ కు చెందిన విద్యార్థి సంఘాల నేతలు అక్కడకు చేరుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒకరిపైకి ఒకరు దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో కొట్టుకునేంత వరకూ వెళ్లగా పోలీసులు, ఏయూ సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అదుపుచేశారు.
అంతకుముందు ఇరువర్గాలకు చెందిన విద్యార్థి సంఘ నాయకులతో రిజిస్ర్టార్ ఆచార్య కె.రాంబాబు చర్చలు జరిపారు. ఈ తరహా గొడవలకు వర్సిటీని కేంద్రంగా చేయవద్దని, మతపరమైన కార్యకలాపాలు నిర్వహించవద్దని సూచించారు.కాగా, ‘ఉనికి కోల్పోతున్న కమ్యూనిస్టులు హింసకు పాల్పడితే చూస్తూ ఊరుకోం. తగిన బుద్ది చెబుతాం’ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు హెచ్చరించారు. ‘నాలుగు దశాబ్దాలుగా ఏయూలో కార్యక్రమాలు నిర్వహిస్తోన్న స్వయం సేవక్‌లపై దాడులు చేయడం పిరికిపంద చర్య. కమ్యూనిస్టులను మేం రాజకీయ పరమైన ప్రత్యర్థులుగా చూస్తున్నాం తప్ప శత్రువులుగా చూడటం లేదు. అలా కాదని హింసను ఎంచుకుంటే వారికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని నాగోతు హెచ్చరించారు.