Share News

ఏబీఎన్‌ పూర్ణ హఠాన్మరణం

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:54 AM

‘ఏబీఎన్‌ పూర్ణ’గా సుపరిచితుడైన ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’ ఏపీ బ్యూరో సీనియర్‌ రిపోర్టర్‌ కేసంనేని పూర్ణచంద్రరావు(54) గురువారం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో...

ఏబీఎన్‌ పూర్ణ హఠాన్మరణం

  • అనారోగ్యంతో నాలుగు రోజులుగా చికిత్స

  • పరిస్థితి విషమించడంతో మృతి

  • సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల సంతాపం

విజయవాడ, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ‘ఏబీఎన్‌ పూర్ణ’గా సుపరిచితుడైన ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’ ఏపీ బ్యూరో సీనియర్‌ రిపోర్టర్‌ కేసంనేని పూర్ణచంద్రరావు(54) గురువారం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నాలుగు రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు సాత్విక, కార్తీక ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన రామచంద్రరావు, విజయలక్ష్మి దంపతులకు 1972లో పూర్ణచంద్రరావు జన్మించారు. 1995లో ఈటీవీలో కెమెరామన్‌గా చేరి 12 ఏళ్లపాటు పనిచేశారు. తరువాత రెండేళ్లు ఎన్‌టీవీ రిపోర్టర్‌గా పనిచేశారు. 2009 నుంచి ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో పనిచేస్తున్నారు. పరిశోధనాత్మక జర్నలిజంపై ఎంతో మక్కువ చూపే పూర్ణ... ఎన్నో సంచలనాత్మక కథనాలను అందించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వాలు, పాలకుల దృష్టికి తేవడంలో రాజీలేని ధోరణిని అవలంబించేవారు.


చిన్న వయస్సులోనే మృతి చెందటం కలచివేస్తోంది: సీఎం

పూర్ణచంద్రరావు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే అనారోగ్యంతో దూరం కావడం కలచివేస్తోందన్నారు. ‘క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలపైనా, వర్తమాన రాజకీయలపైనా అవగాహన కలిగిన రిపోర్టర్‌ పూర్ణచంద్రరావు మరణించారని తెలిసి చింతిస్తున్నా’ అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘నాకు అత్యంత ఆత్మీయులు, ఏబీఎన్‌ పూర్ణ మృతి చాలా బాధాకరం’ అని మంత్రి లోకేశ్‌ నివాళులర్పించారు. పూర్ణ మృతిపై సమాచార మంత్రి పార్థసారథి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, పలువురు నేతలు, పాత్రికేయులు సంతాపం ప్రకటించారు.

Updated Date - Mar 20 , 2026 | 05:56 AM