Share News

Abhyudayam Cycle Rally: గంజాయి రహిత రాష్ట్రమే లక్ష్యం

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:13 AM

గంజాయి రహిత రాష్ట్రమే సీఎం చంద్రబాబు లక్ష్యం. దీనిలో భాగంగానే గతేడాది నవంబరు 13న ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావు పేట నుంచి ఇచ్ఛాపురం వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో......

Abhyudayam Cycle Rally: గంజాయి రహిత రాష్ట్రమే లక్ష్యం

  • డ్రగ్స్‌ నిర్మూలనకు ఇచ్ఛాపురం నాంది పలకాలి: హోం మంత్రి అనిత

  • వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి అడ్డాగా మార్చింది: కేంద్ర మంత్రి రామ్మోహన్‌

  • ముగిసిన ‘అభ్యుదయం సైకిల్‌యాత్ర’

  • 53 రోజుల్లో 1,300 కి.మీ. సాగిన యాత్ర

ఇచ్ఛాపురం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ‘‘గంజాయి రహిత రాష్ట్రమే సీఎం చంద్రబాబు లక్ష్యం. దీనిలో భాగంగానే గతేడాది నవంబరు 13న ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావు పేట నుంచి ఇచ్ఛాపురం వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘అభ్యుదయం సైకిల్‌ యాత్ర’కు శ్రీకారం చుట్టాం.’’ అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇచ్ఛాపురంలోని సురంగిరాజా మైదానంలో శనివారం ‘అభ్యుదయం సైకిల్‌ యాత్ర’ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. డ్రగ్స్‌ నిర్మూలనకు ఇచ్ఛాపురం నాంది పలకాలన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి కేపిటల్‌గా మార్చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో డ్రగ్స్‌ నిర్మూలనకు కృషి చేస్తోందని అన్నారు.

‘అభ్యుదయం’ సాగిందిలా..

పోలీస్‌ శాఖ నిర్వహించిన అభ్యుదయం సైకిల్‌యాత్ర నాలుగు జిల్లాల పరిధిలో 53 రోజులపాటు నిర్విరామంగా 1,300 కిలోమీటర్ల మేర సాగింది. గతేడాది నవంబరు 21న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రారంభమైన యాత్ర.. శనివారం ఇచ్ఛాపురంలో ముగిసింది. విశాఖ రేంజ్‌ డీఐజీ గోపినాథ్‌ జెట్టీతోపాటు ఐదు జిల్లాల ఎస్పీల పర్యవేక్షణలో యాత్ర సాగింది. శ్రీకాకుళం జిల్లాలో గత ఏడాది డిసెంబరు 15న ఈ సైకిల్‌ యాత్ర ప్రవేశించింది. దారి పొడవునా గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాల రవాణా, వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై కళారూపాలతో అవగాహన కల్పించారు.

Updated Date - Jan 04 , 2026 | 04:13 AM