‘దాడి’ వెనుక భారీ కుట్ర, స్వార్థం
ABN , Publish Date - May 21 , 2026 | 04:34 AM
భరోసా’ పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ ‘హత్యాయత్నం డ్రామా’ వెనుక భారీ కుట్ర, స్వార్థం ఉందని పోలీసుల విచారణలో వెల్లడైంది.
అభినయ్ దర్శన్ హత్యాయత్నం డ్రామాలో సంచలన విషయాలు వెలుగులోకి
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం
క్రైస్తవుల మద్దతుతో విరాళాలకు వ్యూహం
తొలుత సినిమాల్లో నటన..తర్వాత క్రైస్తవ మత ప్రచారకుడిగా
ప్రవీణ్ పగడాల మరణాన్ని వాడుకుని
క్రైస్తవ నాయకుడిగా ఎదిగేందుకు యత్నం
ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు సోషల్ మీడియా వేదికగా తాజా కుట్ర
ఎత్తుగడలను చిత్తు చేసిన పోలీసులు
దాడి ఘటన కేవలం డ్రామా: అల్లూరి ఎస్పీ
దర్శన్, మరో ఏడుగురి అరెస్టు.. రిమాండ్
విశాఖపట్నం/చింతపల్లి/పాడేరు, మే 20 (ఆంధ్రజ్యోతి): ‘భరోసా’ పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ ‘హత్యాయత్నం డ్రామా’ వెనుక భారీ కుట్ర, స్వార్థం ఉందని పోలీసుల విచారణలో వెల్లడైంది. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం.. ధర్నాలు, ఆందోళనలు చేయించడం.. తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవుల మద్దతు కూడగట్టుకుని భారీస్థాయిలో విరాళాలు సేకరించడం కోసం పథకం వేసినట్టు తేలింది. క్రైస్తవులకు మద్దతుగా గిరిజన గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న తనపై హత్యాయత్నం జరిగిందని, రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ లేదనే సంకేతాలను సమాజంలోకి పంపించి ఆందోళనలు, ధర్నాలు చేయించాలని దర్శన్ ‘దాడి’ వ్యూహం రచించాడు. దర్శన్ ఎత్తుగడలను పోలీసులు చిత్తు చేయడంతో అతని బండారం బయటపడింది. కడప ప్రకాశ్‌నగర్‌కు చెందిన దర్శన్ కొన్ని సినిమాల్లో నటించాడు. అనంతరం క్రైస్తవ మత ప్రచారకుడి అవతారమెత్తాడు. ప్రవీణ్ పగడాల మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ నేతగా, క్రైస్తవ నాయకుడిగా ఎదగాలనుకున్నాడు. కొంతమంది పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులతో సన్నిహిత సంబంధాలను పెంచుకున్నాడు. ప్రవీణ్ పగడాల తొలివర్ధంతిని పురస్కరించుకుని మార్చి 26న కాకినాడలో క్రైస్తవులు, పాస్టర్లతో కలిసి భరోసా పార్టీని స్థాపించినట్టు ప్రకటించాడు. పార్టీ ఆవిర్భావ సభలో దర్శన్ మాట్లాడుతూ.. తాను సినిమాల ద్వారా విలాసవంతమైన జీవితాన్ని సాగించానని చెప్పుకొచ్చాడు. తాను ప్రారంభించిన పాదయాత్రకు రోజుకు రూ.7వేలు ఖర్చవుతుందని, వచ్చే ఎన్నికల వరకు ప్రజల మధ్య ఉంటూ సామాన్య వ్యక్తిగా జీవితాన్ని సాగిస్తానన్నాడు. క్రైస్తవులే తనను ముందుకు నడిపిస్తారని చెప్పాడు. దర్శన్ ప్రసంగానికి ఆకర్షితులైన కొంతమంది క్రైస్తవులు విరాళాలు అందజేశారు. ప్రస్తుతం విరాళాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో క్రైస్తవ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు విరాళాలను సేకరించేందుకు తనపై తానే దాడికి రూపకల్పన చేసుకున్నాడు. సోషల్ మీడియాలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, పాడేరు విడిచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారని ప్రచారం చేసుకున్నాడు.
అతడి మాటలు నిజమేనని నమ్మిన కొంతమంది క్రైస్తవులు సానుభూతి వ్యక్తం చేయడంతో పాటు తోచినంత విరాళాలు పంపించారు. రాత్రికి రాత్రి సంచలనం సృష్టించి, క్రైస్తవుల ఆదరణ పొందాలని తనపై తానే హత్యాయత్నం సీన్ సృష్టించుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
ప్రవీణ్ పగడాలతో పోలిక
ఏడాది క్రితం ప్రవీణ్ పగడాల మరణాన్ని హత్యగా భావించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు చేశారు. ఈ నేపథ్యంలో అభినయ్ దర్శన్ తనపై దాడి జరిగిందని ప్రచారం చేసుకుంటే తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవులు మళ్లీ ఆందోళనలు చేస్తారని భావించాడని పోలీసులు చెబుతున్నారు.
ఆదివాసీల అమాయకత్వం ఆసరాగా..
ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎదగాలని దర్శన్ భావించాడు. పాడేరు నియోజకవర్గంలో క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే పాదయాత్రకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. తాను పర్యటించిన ప్రాంతంలో క్రైస్తవులు, పాస్టర్లతో సన్నిహిత సంబంధాలను పెంచుకున్నాడు. క్రైస్తవుల గృహాలు, చర్చిల వద్ద బస చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నట్టు నటించాడు. క్రైస్తవులు నాయకులుగా, పాలకులుగా ఎదగాలని చెప్పేవాడు. ఈ మాటలను నమ్మి ఆదివాసీలు ఆశ్రయం కల్పిస్తూ వచ్చారు. దర్శన్ నిజస్వరూపాన్ని పోలీసులు బట్టబయలు చేయడంతో అతని వల్ల క్రైస్తవ సమాజానికి మాయని మచ్చ వచ్చిందని పాస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దర్శన్‌పై దాడి ఓ డ్రామా
అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్
అల్లూరి జిల్లాలోని గూడెంకొత్తవీధి మండలం నీరుతోటపాలెం ప్రాంతంలో ఈ నెల 18న అభినయ్ దర్శన్‌పై దాడి ఘటన కేవలం డ్రామా అని, మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగానే ఆయన ఈ చర్యకు పాల్పడ్డారని ఎస్పీ అమిత్‌బర్దార్ పేర్కొన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. దర్శన్ స్వస్థలం కడప. సత్తెనపల్లికి చెందిన బిల్లా కిరణ్, ఏలూరుకు చెందిన కె.బెన్‌హర్, భానుప్రసాద్ కలిసి ఒక బృందంగా ఏర్పడి ‘భరోసా’ పార్టీ కార్యక్రమాల పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో పర్యటిస్తున్నారు. క్రైస్తవుల నుంచి మద్దతు లభిస్తుందనే ఆలోచనతో స్థానికులైన తాంగుల వసంత్‌కుమార్, కుమడ ప్రేమ్‌కుమార్, తాంగుల సత్యరాజు, కిండంగి ఇంద్ర కుమార్‌ను ఉపయోగించుకున్నాడు. పథకం ప్రకారం తనపై తానే దాడి చేయించుకుని, సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. దాడిపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు అభినయ్‌దర్శన్‌తో పాటు మరో ఏడుగురిపై కేసు పెట్టారు. దర్శన్‌తో పాటు అతడి అనుచరులు మరో ఏడుగురిని జీకే వీధి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో బిల్లా కిరణ్ అలియాస్ కిరణ్ జార్జి (ఏ2), దర్శన్ వ్యక్తిగత సహాయకుడు కె.బెన్‌హర్(ఏ3), తాంగుల వసంత్‌కుమార్, కుమడ ప్రేమ్‌కుమార్, తాంగు ల సత్యరాజు, కిండంగి ఇంద్రకుమార్, మరో బాలుడు ఉన్నారు. నిందితులకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.