Share News

ఒకే పోస్టులో ఆరేళ్లు పనిచేస్తే ఏఏఎస్‌: కార్యదర్శి

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:18 AM

ఐటీ, స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు శాఖల కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ మాట్లాడుతూ.. సుమారు 1.14 లక్షల మంది అర్హత కలిగిన ఉద్యోగులకు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌(ఏఏఎస్‌) ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు.

ఒకే పోస్టులో ఆరేళ్లు పనిచేస్తే ఏఏఎస్‌: కార్యదర్శి
bhasker

ఐటీ, స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు శాఖల కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ మాట్లాడుతూ.. సుమారు 1.14 లక్షల మంది అర్హత కలిగిన ఉద్యోగులకు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌(ఏఏఎస్‌) ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ‘ఒకే పోస్టులో ఆరేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి ఈ నెల 2న జీవో 7ను జారీచేశాం. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ క్యాడర్లకు మూడు వారాల్లోగా పదోన్నతి మార్గదర్శకాలు సిద్ధమవుతాయి. ఉద్యోగులు సెలవులు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆటోమేటిక్‌ క్యాజువల్‌ లీవ్‌ అప్రూవల్‌ ఫెసిలిటీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సెలవు దరఖాస్తుపై కాంపిటెంట్‌ అథారిటీ 24 గంటల్లోగా చర్యలు తీసుకోకుంటే.. ఆ క్యాజువల్‌ లీవ్‌ దరఖాస్తును స్వయంచాలకంగా ఆమోదించినట్లు పరిగణనలోకి తీసుకుంటాం. పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతి జిల్లాలో కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేశాం. గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశాం. అత్యవసర సందర్భాల్లో తప్ప మిగతా సెలవు రోజుల్లో ఉద్యోగులకు విధులు కేటాయించవద్దని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డుల ఉద్యోగులకు కూడా మరణ ప్రయోజనాలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 121 మందికి కారుణ్య నియామకాలు అమలు చేశాం’ అని వివరించారు. స్టయిపెండ్‌ కాలానికి నోషనల్‌ ఇంక్రిమెంట్స్‌ మంజూరుచేయడానికి ప్రస్తుతం స్పష్టమైన నిబంధన లేనప్పటికీ.. తగిన ఉత్తర్వుల జారీకి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. స్వర్ణగ్రామ/స్వర్ణవార్డుల ఉద్యోగులను రికార్డ్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌తో సమానంగా నియమించినప్పటికీ.. ఏఏఎస్‌ మంజూరైన తర్వాత వారు జూనియర్‌ అసిస్టెంట్‌ స్కేలుకు చేరుకున్నందున జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ కోసం డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. 20 క్యాడర్ల ఉద్యోగులందరినీ జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌కు అప్‌గ్రేడ్‌ చేయడానికి ఎలాంటి నిబంధనా లేదన్నారు. ఇది అన్ని శాఖలనూ ప్రభావితం చేస్తుందని, నిబంధనలకు విరుద్ధమని స్పష్టంచేశారు. అన్యాయమైన ఈ డిమాండ్‌కు వ్యతిరేకంగా ఇతర శాఖల ఉద్యోగులందరూ తిరుగుబాటు చేసే అవకాశం ఉందని భాస్కర్‌ చెప్పారు. సమావేశంలో స్వర్ణగ్రామం, స్వర్ణవార్డుల శాఖ డైరెక్టర్‌ శివప్రసాద్‌ కూడా పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 06:20 AM