ఆడారు..అవినీతి ఆట!
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:19 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘‘ఆడుదాం.. ఆంధ్రా’’ అంటూ రాష్ట్రంలో సాగిన అవినీతి ఆటపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది.
రోజా, బైరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టండి
‘ఆడుదాం ఆంధ్రా’పై ముగిసిన విజిలెన్స్ విచారణ
రాష్ట్ర ప్రభుత్వానికి 30 వేల పేజీల నివేదిక
అమరావతి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘‘ఆడుదాం.. ఆంధ్రా’’ అంటూ రాష్ట్రంలో సాగిన అవినీతి ఆటపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలంపాటు లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు.. అవినీతిలో అప్పటి క్రీడాశాఖ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వీరిద్దరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వీరితో పాటు అప్పటి శాప్ ఇన్‌చార్జి ఎండీ హర్షవర్ధన్‌పైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేశ్‌కుమార్, మరో ఐఏఎస్ అధికారి ధ్యాన్‌చంద్‌తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వాణీమోహన్‌పైనా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. శాప్‌లోని ఐటీ విభాగంలో పనిచేసే వారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించారని, వారిపైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓట్ల కోసం ఆటలు..
ఎన్నికలకు ముందు ఓట్లాటకు తెరలేపిన వైసీపీ నేతలు ఆడుదాం.. ఆంధ్రా పేరిట యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ.. ఇందులోనూ అనేక అవకతవకలకు పాల్పడ్డారు. నిధులు పక్కదారి పట్టించి జేబులు నింపుకొన్నారు. శాప్ కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ క్రీడాకారులకు అన్యాయం చేసింది. సాధారణంగా శాప్... 16 ఏళ్ల లోపు వారికి సబ్-జూనియర్ విభాగం, 16-20ఏళ్లలోపు వారిని జూనియర్ విభాగం, 20ఏళ్లు పైబడిన వారిని సీనియర్ విభాగం కింద పరిగణించి పోటీలు నిర్వహిస్తుంది. అయితే జగన్ చెప్పిన ఆడుదాం అంధ్రాలో.. 17ఏళ్లు దాటిన వారినే అర్హులుగా ప్రకటించారు. మరికొన్ని రోజులు ఆగితే వారికి ఓటు హక్కు వస్తుంది.. ఆ ఓట్లన్నీ గంపగుత్తగా తమకే పడతాయన్న ఆలోచనతో ఈ నిబంధన తీసుకొచ్చారు. అలాగే.. క్రీడా పరికరాల కొనుగోలు దగ్గర నుంచి ఆటగాళ్లకు కల్పించే వసతి, భోజనాల్లోనూ భారీగా దోచేసినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది.
40 కోట్ల నిధులు దుర్వినియోగం..?
అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో క్రీడలను అస్సలు పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రం హడావుడిగా ‘ఆడుదాం.. ఆంధ్రా’ నిర్వహించింది. ఎన్నికల కోసమే ఈ డ్రామాలంటూ అప్పట్లోనే విమర్శలొచ్చాయి. రూ.40 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ‘ఆడుదాం.. ఆంధ్రా’ పూర్తయ్యేసరికి రూ.100 కోట్లుపైనే ఖర్చు తేలింది. ఇంత భారీ ఖర్చుపై అప్పట్లోనే అనేక అనుమానాలు తలెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఫిర్యాదులతో స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణలో విజిలెన్స్ అధికారులు 600కి పైగా ప్రాంతాల్లో వందలాది మందిని విచారించారు. 30వేల పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ క్రమంలో ఆడుదాం.. ఆంధ్రా పేరిట మొత్తం రూ.40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించినట్టు తెలిసింది. కొన్ని జిల్లాల్లో గ్రామస్థాయిలో క్రీడలకు రూ.10 వేలు కేటాయిస్తే.. తమ సొంత నిధులు మరో రూ.10వేలు ఖర్చయ్యాయంటూ మొత్తం రూ.20 వేలు ఖర్చు చూపించారు. ఇలా ప్రతిస్థాయిలోనూ కేటాయింపుల కంటే రెండింతలు ఖర్చు చేసినట్లు చూపించారు. చివరకు కలెక్టర్లపై కూడా ఒత్తిడి తెచ్చి అదనంగా ఖర్చు చేయించారు. ఆడుదాం.. ఆంధ్రా ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్ స్టిక్కర్లు వేశారు. క్రీడాకారులకు నాసికరం కిట్లు సరఫరా చేసి భారీగానే నొక్కేశారు. విజేతలంతా వైసీపీ కార్యకర్తలే అని విజిలెన్స్ విచారణలో తేలింది. విజిలెన్స్ నివేదిక అందిన తరుణంలో ఏసీబీ లేదా సీఐడీ ద్వారా విచారణ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.