Share News

ఆధార్‌.. సామాన్యునికి చిక్కు!

ABN , Publish Date - May 18 , 2026 | 05:24 AM

75 ఏళ్ల ఈ పెద్దావిడ పేరు వి.శేషగిరి. ఆధార్‌ కార్డు కోసం ఏడేళ్లుగా కార్యాలయాల చుట్టూరా తిరుగుతున్నారు. 15 ఏళ్ల కిందట గ్రామగ్రామాన ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సందర్భంలోనే ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో..

ఆధార్‌.. సామాన్యునికి చిక్కు!

  • పొరపాట్లు సవరించుకునేందుకు తంటాలు

  • ఎన్‌రోల్‌మెంట్‌ సమయంలోనే తప్పులు

  • కనీస వివరాలు నమోదు చేయని సిబ్బంది

  • పత్రాలన్నీ అందజేసినా అప్‌లోడ్‌ ఉండదు

  • ఇబ్బందులు పడుతున్న పౌరులు

  • రీజినల్‌ కార్యాలయానికి వెళ్లాలని సలహాలు

  • రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే రీజినల్‌ ఆఫీస్‌

  • సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు..

  • టోకెన్లు అందక రోజుల తరబడి పడిగాపులు

ఈ బాలుడి పేరు ధనుష్‌(10). ఏపీలోని ఏలూరు జిల్లా ధర్మాజిగూడెం. నాలుగేళ్ల క్రితం బాలుడు, అతని చెల్లెలు జాహ్నవికి ఆధార్‌ కోసం ఎన్‌రోల్‌ చేయించారు. కొన్ని రోజులకు ఇద్దరికీ కార్డులు వచ్చాయి. ధనుష్‌ ఫొటోతో ఉన్న కార్డులో అతడి చెల్లెలు వివరాలు.. జాహ్నవి ఆధార్‌ కార్డులో ధనుష్‌ వివరాలున్నాయి. బాలుడిని బాలికగా, బాలికను బాలుడిగా పేర్కొంటూ ఆధార్‌ కార్డులు రావడంతో.. వాటిని సవరించి సరైన వివరాలతో ఆధార్‌ కార్డు పొందడానికి నాలుగేళ్లుగా తిరుగుతున్నారు. స్థానికంగా బాలిక ఆధార్‌ కార్డులో సవరణలు చేసి కొత్త కార్డు తీసుకున్నారు. బాలుడి ఆధార్‌లో మాత్రం సవరణలు కావట్లేదు. హైదరాబాద్‌లోని రీజినల్‌ కార్యాలయానికి కూడా ఇప్పటివరకు బంధువులు ఆరుసార్లు బాలుడిని తీసుకొచ్చారు. అయినా.. ఆధార్‌ కార్డులో తప్పులను సవరించ లేదు. కొత్త ఆధార్‌ కార్డు జారీ చేయడం లేదు.

75 ఏళ్ల ఈ పెద్దావిడ పేరు వి.శేషగిరి. ఆధార్‌ కార్డు కోసం ఏడేళ్లుగా కార్యాలయాల చుట్టూరా తిరుగుతున్నారు. 15 ఏళ్ల కిందట గ్రామగ్రామాన ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సందర్భంలోనే ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో తన పేరు, వివరాలు నమోదు చేసుకున్నారు. అప్పట్లో ఆధార్‌ కార్డు వచ్చింది. అయితే ఏడేళ్ల కిందట ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకున్నారు. కానీ, ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ కాకపోగా.. ఏకంగా ఆధార్‌ను రద్దు చేశారు. ఆ తర్వాత ఆధార్‌ సెంటర్‌ల వద్ద పలుమార్లు అప్‌డేట్‌ చేయించారు. రీజినల్‌ కార్యాలయానికి వచ్చి వివరాలు నమోదు చేయించారు.


కానీ, రద్దు చేసిన ఆధార్‌ పునరుద్ధరణ జరగలేదు. ఆఽధార్‌ లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్‌ను ఆపేశారు. అసలు ఆధార్‌ కార్డును రద్దు చేయడానికి కారణాలు తెలుసుకునేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తే నెల రోజుల క్రితం అసలు విషయం తెలిసింది. అదేమిటంటే.. ఎన్‌రోల్‌మెంట్‌ సందర్భంలో కేవలం వేలిముద్రలు నమోదైన వివరాలే ఉన్నాయి. ఐరిష్‌ నమోదు చేయలేదు. కానీ, అప్‌డేట్‌ కోసం వెళ్లిన సందర్భంలో వేలిముద్రలతోపాటు ఐరిష్‌ నమోదు చేశారు. దీంతో గతంలో లేని ఐరిష్‌ను ఇప్పుడెలా అప్‌డేట్‌ చేశారంటూ ఏకంగా ఆధార్‌ కార్డును రద్దు చేశారు. హైదరాబాద్‌లోని రీజినల్‌ కార్యాలయం వద్దకు వచ్చి.. మరోసారి ఎన్‌రోల్‌ చేసుకుంటే కొత్తకార్డు జారీ చేస్తామన్నారు. దీంతో శేషగిరి తన అడ్రస్‌ ప్రూఫ్‌ కోసం పాస్‌పోర్టును, స్థానికంగా తహశీల్దార్‌ ఇచ్చిన ధ్రువపత్రాన్ని సైతం అందజేశారు. అయితే తహశీల్దార్‌ జారీ చేసే రఽధువపత్రంలో ఉండే పోటోపై గ్రీన్‌పెన్నుతో సంతకం చేసినా.. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌లో అంగీకరించడం లేదు. అన్నిరకాల అర్హత పత్రాలను అందించి ఆధార్‌ కార్డును ఎన్‌రోల్‌ చేసుకున్నారు. ఇక వెరిఫికేషన్‌ పూర్తి చేసేది ఎన్నడో.. ఆధార్‌ కార్డు వచ్చేదెన్నడో సందిగ్ధం నెలకొంది. హైదరాబాద్‌లోని ఆధార్‌ రీజినల్‌ కార్యాలయానికి వచ్చేవారిది ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. ఆధార్‌ కార్డులో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆధార్‌ రీజినల్‌ కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉండడంతో.. ఇరు రాష్ట్రాలకు చెందిన వారంతా ఇక్కడికి వస్తున్నారు. ఆధార్‌ కార్డు లేకపోవడం, అప్‌డేట్‌ సందర్భంలో సమస్యలు తలెత్తుతుండడం ఇబ్బందికరంగా మారింది. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నుంచి అప్‌డేట్‌ చేసే ప్రక్రియను మండలాలు, వివిధ ప్రాంతాల వారీగా ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. వారు ఇష్టానుసారంగా వివరాలను నమోదు చేస్తున్నారు. ఫింగర్‌ ఫ్రింట్స్‌ పూర్తిగా వచ్చే వరకు తీసుకోవాలి. కళ్ల నుంచి ఐరిష్‌ను పూర్తిస్థాయిలో తీసుకోవాలి. జతపరిచిన పత్రాలను పూర్తిస్థాయిలో అప్‌లోడ్‌ చేయాలి. కానీ, ఇవేమీ సరిగా చేయకుండా అప్పటికప్పుడు పని పూర్తి చేయడంపైనే దృష్టి పెడుతున్నారు. అన్నిరకాల పత్రాలను అప్‌లోడ్‌ చేసిన తర్వాత కూడా పలు పత్రాలు మిస్సయ్యాయంటూ ఆధార్‌ కార్డును రద్దు చేస్తున్నారు.


రెండు రాష్ట్రాలకు ఒకే రీజినల్‌ కేంద్రం..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధార్‌కు ఏకైక రీజినల్‌ కార్యాలయం హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లోని ఆరో అంతస్తులో ఉంది. ఆధార్‌లో సందేహాలు, ఫిర్యాదుల విషయంలో మెయిల్‌ చేయాలని, లేకుంటే ఆధార్‌ కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేయాలని చెబుతున్నారు తప్ప.. ఫోన్‌ చేస్తే సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. దాంతో ఆధార్‌ రద్దు చేసినా, నిలిపివేసినా, కార్డు రాకపోయినా రెండు రాష్ట్రాలవారు రీజినల్‌ కార్యాలయానికే పరుగులు తీస్తున్నారు. రీజినల్‌ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఎన్‌రోల్‌మెంట్‌ చేసేందుకు వ్యవస్థ ఏర్పాటు చేశారు. శని, ఆదివారాల్లో మినహా మిగతా పని దినాల్లో రోజుకు 200 టోకెన్లు ఉదయం 9గంటల నుంచి జారీ చేస్తారు. ఈ టోకెన్లు పొందడానికి కొందరూ ఒకరోజు ముందే వస్తుండగా.. మరికొందరు తెల్లవారుజామున చేరుకుంటున్నారు. టోకెన్‌ కోసం బారులు తీరుతున్నారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తే టోకెన్‌ దొరక్కపోతే మరుసటి రోజుకు ఎదురుచూస్తున్నారు. సుదూర ప్రాంత ప్రజలు పనులు మానుకొని మరీ ఆధార్‌ కార్డులో తలేత్తిన సమస్య పరిష్కారం కోసం వస్తున్నారు.

- హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి)

Updated Date - May 18 , 2026 | 06:20 AM