ఆధార్, రేషన్‌కార్డులే అడ్రస్ ప్రూఫ్‌లు
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:41 AM
తహశీల్దార్ ఆఫీసులకెళ్లి నివాస ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటూ ఈనెల 16న జారీ చేసిన ఆదేశాలను రెవెన్యూశాఖ సవరించింది. ఇందుకు సంబంధించి జీవో 592లో మౌలికమైన సవరణ చేసింది.
గిరిజనుల కోసమే నివాస ధ్రువీకరణ పత్రాలు
జీవో 592ను సవరించిన రెవెన్యూ శాఖ
అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తహశీల్దార్ ఆఫీసులకెళ్లి నివాస ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటూ ఈనెల 16న జారీ చేసిన ఆదేశాలను రెవెన్యూశాఖ సవరించింది. ఇందుకు సంబంధించి జీవో 592లో మౌలికమైన సవరణ చేసింది. ప్రజల వద్ద ఉన్న ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లోని అడ్ర్‌సనే నివాస ధ్రువీకరణ పత్రంగా (అడ్రస్ ప్రూఫ్‌గా) పరిగణించాలని, అవి ఉన్నవారు మళ్లీ ప్రత్యేకంగా ఆ పత్రం తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. కేవలం గిరిజనులు తమ ఆధార్ నమోదు కోసం, ఇతర డాక్యుమెంటేషన్ కోసమే స్థానిక తహశీల్దార్ నుంచి నివాస ధ్రువీకరణ తీసుకుంటే సరిపోతుందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సవరణ ఉత్తర్వును జారీ చేశారు. గిరిజనులు తమ ఆధార్‌లో నివాసాన్ని అప్‌డేట్ చేసుకోవడానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగాలు, ఆర్మీలో పోస్టుల కోసం స్థానిక తహశీల్దార్ నుంచి ధ్రువీకరణలు తీసుకోవాలని వివరణ ఇచ్చారు.
రెవెన్యూశాఖ ఈనెల 16వ తేదీన ప్రజలందరికీ వర్తించేలా జీఓ 592 జారీ చేస్తూ తహశీల్దార్ ఆఫీసుల నుంచి నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని ఆదేశించింది. ఆధార్, రేషన్ కార్డులే అసలైన నివాస ధ్రువీకరణలంటూ, కొత్తగా రెసిడెన్స్ సర్టిఫికెట్‌లు అవసరం లేదంటూ 2015లో జారీ చేసిన జీవో 581 అమలును కూడా నిలిపివేసింది. దీన్ని తిరోగమన చర్యగా పేర్కొంటూ ‘ఆంధ్రజ్యోతి’ 17వ తేదీన ‘ఆవిధంగా వెనక్కి...’’ శీర్షికతో ప్రధాన వార్తను ప్రచురించింది. ఈ వార్తపై రెవెన్యూశాఖ స్పందించింది.