ఇక ప్రత్యేక పాలన!
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:33 AM
పురపాలక సంఘాల్లో పాలకవర్గాల పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. ప్రత్యేక అధికారుల పాలన బుధవారం నుంచి అమలులోకి రానుంది. ఏప్రిల్ మూడో తేదీ నుంచి జిల్లాలోని అన్ని పంచాయతీల్లోనూ పాలకవర్గాల పదవీకాలం ముగుస్తుంది. దీంతో వీటిలోనూ ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది. సెప్టెంబరు నెలలో మండల పరిషత, జిల్లాపరిషత పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. రానున్న ఆరు నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికారపక్ష నాయకులు ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు
- నేటితో ముగియనున్న మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం
- రేపటి నుంచి పురపాలికల్లో ప్రత్యేక అధికారుల పాలన
- మళ్లీ ఎన్నికలు జరిగే వరకు బాధ్యతలు
- ఏప్రిల్ 3వ తేదీతో ముగియనున్న పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం
- సెప్టెంబరుతో ముగియనున్న జిల్లా పరిషత, మండల పరిషత పాలకవర్గాల పదవీకాలం
- 2024 జూన్ నుంచి కూటమి హవా
పురపాలక సంఘాల్లో పాలకవర్గాల పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. ప్రత్యేక అధికారుల పాలన బుధవారం నుంచి అమలులోకి రానుంది. ఏప్రిల్ మూడో తేదీ నుంచి జిల్లాలోని అన్ని పంచాయతీల్లోనూ పాలకవర్గాల పదవీకాలం ముగుస్తుంది. దీంతో వీటిలోనూ ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది. సెప్టెంబరు నెలలో మండల పరిషత, జిల్లాపరిషత పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. రానున్న ఆరు నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికారపక్ష నాయకులు ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు పెడన, ఉయ్యూరు పురపాలక సంఘాల పాలకవర్గాల పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. బుధవారం నుంచి పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది. మచిలీపట్నం కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాలాజీ, పెడన మున్సిపాల్టీ ప్రత్యేక అధికారిగా మచిలీపట్నం ఆర్డీవో సాంబశివరావు, ఉయ్యూరు మున్సిపాల్టీ ప్రత్యేక అధికారిగా ముడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవిశంకర్‌ను ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. గుడివాడ, తాడిగడప పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో అవి ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి.
మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లో 50 డివిజన్‌లు ఉండగా 45 డివిజన్‌లలో వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. నలుగురు టీడీపీ, జనసేన తరఫున ఒక కార్పొరేటరు ఉన్నారు. ఇక్కడ వైసీపీ హవానే కొనసాగింది. తొలి విడతగా మోకా వెంకటేశ్వరమ్మ మేయర్‌గా రెండున్నర సంవత్సరాలు పనిచేయగా, చిటికెన వెంటేశ్వరమ్మ మరో రెండున్నర ఏళ్లపాటు మేయర్‌గా కొనసాగారు. కార్పొరేషన్‌లో మేయర్‌లు ఉన్నా వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు పెత్తనమే మునిసిపల్ కార్పొరేషన్‌లో కొనసాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమికి చెందిన నాయకుల కనుసన్నల్లోకి పరిపాలన వెళ్లిపోయి, వైసీపీ కార్పొరేటర్ల హవాకు బ్రేక్ పడింది.
పెడన పురపాలక సంఘంలోనూ ఇద్దరు చైర్మన్‌లు
పెడన పురపాలక సంఘంలో 23 వార్డులు ఉన్నాయి. వైసీపీ 21 చోట్ల, టీడీపీ, జనసేన ఒక్కో చోట గెలిచారు. దీంతో వైసీపీ పాలకవర్గం ఇక్కడ కొనసాగింది. తొలివిడత చైర్మన్‌గా బళ్లా జ్యోత్నరాణి 26 నెలల పాటు చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత రెండో విడత చైర్మన్‌గా కటకం నాగకుమారి కొనసాగారు. అప్పటి పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ మునిసిపల్ చైర్మన్ మార్పు విషయంలో తనదైన శైలిలో రాజకీయాలు నడపడంతో కటకం నాగకుమారి వర్గీయులు తాము వైసీపీని వీడతామని తెగేసీ చెప్పడంతో, ఎట్టకేలకు నాగకుమారికి చైర్మన్ పదవిని ఇచ్చారు. దీంతో ఇక్కడ ఇద్దరు చైర్మన్‌లు పనిచేశారు.
ఉయ్యూరులో వైసీపీ నుంచి టీడీపీలోకి..
ఉయ్యూరు పురపాలక సంఘంలో 20 వార్డులు ఉన్నాయి. 16 వార్డుల్లో వైసీపీ గెలిచింది. నాలుగు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అప్పటి పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరడంతో ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణతో పాటు 10 మంది కౌన్సిలర్‌లు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 14 చేరింది. టీడీపీ పాలకవర్గమే కొనసాగింది.
ఎన్నికలకు దూరంగా గుడివాడ, తాడిగడప
గుడివాడ పురపాలక సంఘంలో వార్డుల విభజన, పురపాలక సంఘంలో గ్రామాల విలీనం ప్రక్రియ సక్రమంగా జరగలేదనే కారణంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 2021లో గుడివాడ పురపాలక సంఘం ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ మున్సిపాల్టీలో గత ఐదు సంవత్సరాలుగా ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. కోర్టులో ఈ అంశం తేలితేనే మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. పెనమలూరు నియోజకవర్గంలోని తాడిగడపను మున్సిపాల్టీగా మార్చినా ఎన్నికలు జరపలేదు. పరిపాలన మాత్రం మున్సిపాల్టీగానే పరిగణించి కొనసాగిస్తున్నారు.
వచ్చే నెలలో ముగియనున్న పంచాయతీలు
ఏప్రిల్ 3వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. దీంతో పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది సెప్టెంబరుతో జిల్లా పరిషత, మండల పరిషత పాలకవర్గాల పదవీకాలం కూడా ముగియనుంది. జిల్లాల విభజన జరిగిన తర్వాత జిల్లా పరిషతను రెండుగా విభజించే అంశంపైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి అభ్యర్థులను స్థానికసంస్థల ఎన్నికల్లో గెలిపించేందుకు ఇప్పటినుంచే శాసనసభ్యులు, నాయకులు వ్యూహ రచన చేస్తున్నారు.