అక్రమాల పరంపర!
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:46 AM
జిల్లా గృహనిర్మాణ సంస్థలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు మెటీరియల్ కోసం వెళితే.. గతంలోనే ఇచ్చారు కదా, మళ్లీ ఇప్పుడేంటనే ప్రశ్నలు అధికారుల నుంచి వస్తున్నాయి. ఈ విషయంపై తీగలాగితే డొంక కదులుతోంది. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల మండలంలోని గోడౌన్, శ్రీకాకుళం గ్రామంలో ఆప్షన్-3లో ఎంపిక చేసిన ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై అధికారులు విచారణ చేసిన సమయంలో పలు అక్రమాలు వెలుగు చూశాయి. పెడన మండలంలో 36 మంది లబ్ధిదారులు గృహాలకు పునాదులు వేయకుండానే మెటీరియల్ ఇచ్చినట్లుగా చూపినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు విశ్వసనీయ సమాచారం.
- వైసీపీ హయాంలో బరితెగించిన హౌసింగ్ అధికారులు
- శ్రీకాకుళంలో ఆప్షన్-3లో 85 గృహాల మెటీరియల్ హాంఫట్!
- ఘంటసాల గోడౌన్‌లో 54 టన్నుల ఇనుము, 300 బస్తాల సిమెంట్ మాయం
- పెడన మండలంలో 36 గృహాలకు మెటీరియల్ ఇచ్చినట్లు తప్పులు లెక్కలు
- కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న మోసాలు
- ఘంటసాల మండలంపై ఎమ్మెల్యే మండలి దృష్టి
- గృహనిర్మాణశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు
జిల్లా గృహనిర్మాణ సంస్థలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు మెటీరియల్ కోసం వెళితే.. గతంలోనే ఇచ్చారు కదా, మళ్లీ ఇప్పుడేంటనే ప్రశ్నలు అధికారుల నుంచి వస్తున్నాయి. ఈ విషయంపై తీగలాగితే డొంక కదులుతోంది. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల మండలంలోని గోడౌన్, శ్రీకాకుళం గ్రామంలో ఆప్షన్-3లో ఎంపిక చేసిన ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై అధికారులు విచారణ చేసిన సమయంలో పలు అక్రమాలు వెలుగు చూశాయి. పెడన మండలంలో 36 మంది లబ్ధిదారులు గృహాలకు పునాదులు వేయకుండానే మెటీరియల్ ఇచ్చినట్లుగా చూపినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు విశ్వసనీయ సమాచారం.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం:
వైసీపీ ప్రభుత్వ హయాంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో పనిచేసిన గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్‌లు, డీఈ తమ ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై అనేక ఫిర్యాదులు అందడంతో విచారణ చేయించారు. చల్లపల్లి, మోపిదేవి మండలాల ఏఈలు అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది. దీంతో కాస్త ఆలస్యంగానైనా ఈ రెండు మండలాల ఏఈలను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఇదిలా ఉంటే ఘంటసాల మండలంలోని గోడౌన్ నుంచి పెద్దఎత్తున సిమెంట్, ఇనుము మాయమైందనే అంశంపైనా ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ అంశంపై పట్టుబట్టిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ అవకతవకలపై విచారణ చేయాలని ఆదేశించారు. అధికారుల విచారణలో ఘంటసాల గోడౌన్ నుంచి 300 బస్తాల సిమెంట్, 54 టన్నుల ఇనుము మాయమైనట్లు లెక్కతేలినట్లు సమాచారం. దీంతో పాటు శ్రీకాకుళంలో లబ్ధిదారులు గృహాలు నిర్మాణం చేసుకోలేని కారణంగా గృహనిర్మాణ సంస్థ అధికారుల ద్వారానే గృహాలు నిర్మాణం చేసేలా ఆప్షన్-3లో ఈ గ్రామాన్ని చేర్చి గృహాలు నిర్మాణాలు చేసేలా గతంలో ప్రణాళికను రూపొందించారు. ఈ అంశాన్ని సాకుగా చూపి 85 మంది లబ్ధిదారులకు సంబంధించిన గృహాలకు అసలు పునాదులు కూడా వేయకుండానే మెటీరియల్ ఇచ్చినట్లుగా లెక్కలు రాసినట్లు అధికారులు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. పునాదులు వేసేందుకు ఒక్కో గృహానికి 342 కిలోల ఇనుము, 40 బ్యాగుల సిమెంటు ఇచ్చినట్లుగా లెక్కలు చూపినా, గృహాలకు సంబంధించిన పునాదులు మాత్రం నిర్మాణం చేయలేదని అధికారులు నివేదికను తయారు చేసినట్లు సమాచారం. ఈ నివేదికను తనకు అందజేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గృహ నిర్మాణసంస్థ అధికారులను కోరినట్టు గృహ నిర్మాణ సంస్థ అఽధికారులు చెప్పుకుంటున్నారు. కోడూరు మండలంలో గృహ నిర్మాణ సంస్థ ఇన్‌చార్జి ఏఈ ఒకరు గృహనిర్మాణాలు చేయకుండానే రూ.40లక్షల వరకు బిల్లులు చేసిన అంశంపై ఫిర్యాదులు అందాయి. దీంతో గృహనిర్మాణసంస్థ ఎండీ కార్యాలయ విజిలెన్స్ అధికారులు విచారణ చేసి రూ.40లక్షల మేర అక్రమాలు జరిగినట్లుగా తేల్చారు. కానీ సదరు ఏఈ నుంచి నగదు రికవరీ చేయడం లేదని గృహనిర్మాణసంస్థ అధికారులు చెప్పుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అవనిగడ్డ నియోజకవర్గంలో గృహ నిర్మాణ సంస్థలో జరిగిన అక్రమాలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రానున్న రోజుల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించేందుకు సమాయత్తమవుతున్నారని గృహనిర్మాణ సంస్థ అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.
పెడన మండలంలో ఇలా..
పెడన మండలంలో గృహనిర్మాణసంస్థలో గతంలో పని చేసిన ఏఈ ఒకరు అక్రమాలకు పాల్పడిన అంశంపై ఫిర్యాదులు అందాయి. బల్లిపర్రు గ్రామానికి సాయిరేవతి అనే లబ్ధిదారురాలు గృహ నిర్మాణం ప్రారంభించకున్నా, రూ.22వేల విలువైన ఇనుము ఇచ్చినట్లుగా, చెన్నూరులో సీతారావమ్మ, వీరమ్మ పేరుతో 40 బస్తాల సిమెంట్ ఇచ్చినట్లుగా చూపారు. కానీ వాస్తంగా ఇంటికి పునాదులు వేయలేదు. వీరమ్మ పేరుతో రూ. 24వేల విలువైన ఇనుము ఇచ్చినట్లుగా చూపారని అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. చేవెండ్ర గ్రామానికి చెందిన వరలక్ష్మి పేరున 40 బస్తాల సిమెంట్ ఇచ్చినట్లుగా, నాగలక్ష్మి అనే లబ్ధిదారురాలి పేరున రూ.19వేల విలువైన ఇనుము ఇచ్చినట్లుగా చూపినట్లు సమాచారు. మండలంలోని చేవెండ్ర, కాకర్లమూడి, శేరిఉత్తర్లపల్లి, నేలకొండపల్లి, ఉరివి, నందమూరు, లంకలకలవగుంట, కూడూరు, కొప్పల్లె, కమలాపురం కొంగంచర్ల, కొంకేపూడి గ్రామాల్లో 36 మంది లబ్ధిదారులకు మెటీరియల్ ఇచ్చినట్లుగా చూపారు. కానీ లబ్ధిదారులకు సంబంధించిన గృహాలకు పునాదులు కూడా నిర్మాణం చేయలేదు. ఈ విషయంపై అధికారులు ప్రాథమికంగా విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపకుండా, వివిధ కారణాలతో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గృహ నిర్మాణ సంస్థ అధికారులతో కలెక్టర్ బాలాజీ సమీక్షా సమావేశం నిర్వహించిన సమయంలో పెడన మండలంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం గమనార్హం.