వసూళ్ల పర్వం!
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:48 AM
ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే అక్రమార్కులకు వరంగా మారింది. మచిలీపట్నం సౌత మండలంలోని పెదపట్నంలో ఓ వైసీపీ కార్యకర్త ఏకంగా భూమి రికార్డుల్లో అనుభవదారులుగా పేర్లు ఎక్కిస్తానంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఇతనితో జతకట్టిన టీడీపీ గ్రామ నాయకులు ఈ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. అందరూ కలిసి గ్రామంలోని 250 ఎకరాల భూములపై కన్నేశారు. గ్రామంలో జరిగిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
పెదపట్నంలో భూముల రీసర్వే మాయాజాలం
- భూమి అనుభవదారులుగా రికార్డుల్లో ఎక్కిస్తానంటూ వైసీపీ కార్యకర్త బేరం
- రెండు గ్రామాల్లో పలువురి నుంచి లక్షలాది రూపాయల వసూలు
- జతకట్టిన టీడీపీ గ్రామ నాయకులు
- గ్రామంలోని 250 ఎకరాల ప్రభుత్వ భూములపై కన్ను
- వెలుగులోకి వస్తున్న ఒక్కో మోసం
ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే అక్రమార్కులకు వరంగా మారింది. మచిలీపట్నం సౌత మండలంలోని పెదపట్నంలో ఓ వైసీపీ కార్యకర్త ఏకంగా భూమి రికార్డుల్లో అనుభవదారులుగా పేర్లు ఎక్కిస్తానంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఇతనితో జతకట్టిన టీడీపీ గ్రామ నాయకులు ఈ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. అందరూ కలిసి గ్రామంలోని 250 ఎకరాల భూములపై కన్నేశారు. గ్రామంలో జరిగిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నం సౌత మండలంలోని పెదపట్నం గ్రామంలో వందలాది ఎకరాల అసైన్డ్ భూమి, మడ అడవులు విస్తారంగా విస్తరించి ఉన్నాయి. అసైన్డ్ భూములను వివిధ కారణాలతో గతంలో చిన్నపాటి రైతులు విక్రయించేశారు. మరికొందరి వారసులు సాగు చేసుకుం టున్నారు.2023లో వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఒకరు మీ భూములను విక్రయించేసినా, మీ బంధువుల పేర్లు అడంగల్‌లో నమోదై ఉన్నాయని, మీ పేర్లను అనుభవదారులుగా చూపి పట్టాలు ఇప్పిస్తానని నమ్మించి లక్షలాది రూపాయలను వసూలు చేశాడు. ఈ విషయాన్ని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.
టీడీపీ నాయకులతో కుమ్మక్కై..
ప్రస్తుతం గ్రామంలో భూముల రీసర్వే ప్రారంభమైంది. దీంతో వైసీపీ కార్యకర్త తనదైనశైలిలో మళ్లీ వసూళ్లకు తెరతీశాడు. స్థానికంగా తన బంధువులైన టీడీపీ నాయకులను కలుపుకుని రీసర్వేలో మీపేర్లు రాయిస్తానని చెప్పి హంగామా సృష్టిస్తుండటంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తనకు నగదు చెల్లించిన వారిపేర్లను ఎలాగైనా రీసర్వేలో భూమి అనుభవదారులుగా చేరుస్తానని, రెవెన్యూ అఽధికారులు, సిబ్బంది తనమాటే వింటారని నమ్మించి మళ్లీ వసూళ్లకు పాల్పడుతుండటం గమనార్హం. పెదపట్నానికి చెందిన వారి నుంచే కాకుండా కృత్తివెన్ను మండలం ఇంతేరు, పార్వతీపురం తదితర గ్రామాలకు చెందిన వారి నుంచి గతంలో నాలుగు లక్షల రూపాయలకుపైగా నగదును వసూలు చేసినట్లు గ్రామస్థులు చెప్పుకుంటున్నారు. ఇంతేరు గ్రామానికి చెందిన ఒక మహిళ వద్ద వైసీపీ కార్యకర్త రూ.40 వేలు తీసుకుని, ఆమె తండ్రి పేరున ఉన్న పత్రాలను ఆమె పేరున మార్చకుండా, విజయవాడకు చెందిన పాలవ్యాపారికి ఈ భూములను విక్రయించేయడం గమనార్హం. ఈ అంశంపై మంత్రి కొల్లు రవీంద్ర కార్యాలయంలో ఇటీవల బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే గ్రామంలో భూముల రీసర్వే జరిగే సమయంలో హఠాత్తుగా వీఆర్వోను బదిలీ చేయించడం వెనుక అక్రమార్కుల హస్తం ఉందని గ్రామస్థులు చెప్పుకుంటున్నారు. పెదపట్నం గ్రామంలో 250 ఎకరాలకుపైగా భూములను రీసర్వేలో తారుమారు చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రిటైర్డ్ పోలీస్ అధికారి కొనుగోలు చేసిన భూమిని విక్రయించేశారు!
పెద పట్నంలోని వైసీపీ, కూటమికి చెందిన కార్యకర్తలు ఓ అడుగు ముందుకేసి ఒక రిటైర్ట్ పోలీస్ అధికారి కొనుగోలు చేసిన 2.07 ఎకరాల భూమికి తప్పుడు పత్రాలు పుట్టించి ఇటీవల విక్రయించడం వివాదాస్పదమైంది. ఈ రిటైర్డ్ పోలీస్ అధికారి ఈ భూమిని వేరే వ్యక్తులకు లీజుకు ఇచ్చాడు. ఈ భూమిపై కన్నేసిన అక్రమార్కులు ఈ భూమిని తమకు అనుకూలంగా ఉన్న వక్తుల పేరున తప్పుడు పత్రాలు పుట్టించి విక్రయించేశారు. ఈ విషయంపై రిటైర్ట్ పోలీస్ అధికారి తొలుత మచిలీపట్నం తహసీల్దార్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఈ విషయం కొలిక్కిరాకపోవడంతో కలెక్టర్, ఎస్పీకి తన వద్ద ఉన్న పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో అధికార పార్టీకి చెందిన పెద్ద నాయకుల వద్ద ఈ పంచాయితీ పెట్టారు. వారు అక్రమార్కులకు చీవాట్లు పెట్టడంతో చివరకు ఈ భూమిని అక్రమంగా విక్రయించినవారు తప్పయిపోయిందని, సంబంధిత రిటైర్ట్ పోలీస్ అధికారికి రూ.6 లక్షలు ఇస్తామని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయాలని తెరవెనుక బేరం పెట్టినట్లు సమాచారం.