రూ.16 కోట్ల ఆలయ భూమికి స్కెచ్!
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:28 AM
ఉప్పులూరులో దేవదాయశాఖకు చెందిన రూ.16 కోట్ల విలువైన రెండు ఎకరాల భూమిని కొట్టేసేందుకు కొందరు స్కెచ్ వేశారు. గన్నవరం-కంకిపాడు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న భూమి తీసుకుని ఉప్పులూరు - మంతెన గ్రామాల మధ్యలో భూమి ఇవ్వడానికి మధ్యవర్తులతో కథ నడుపుతున్నారు. ఆ భూమి పరిశీలించేందుకు ఆర్‌జేసీ రావడంతో విషయం బయటకు వచ్చింది. ఆలయం కోసం దాతలు ఇచ్చిన భూమి అన్యాక్రాంతం కానుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ఉప్పులూరులో గ్రూపు దేవాలయాలకు 2 ఎకరాల భూమి
- వేలంలో దక్కించుకుని గోదాముగా వినియోగించుకుంటున్న నిర్వాహకులు
- విలువైన ఈ భూమి స్వాధీనం చేసుకుని మరో చోట భూమి ఇచ్చేందుకు ప్రతిపాదన!
- భూమిని పరిశీలించిన దేవదాయ శాఖ ఆర్‌జేసీ
- దాతల భూమి అన్యాక్రాంతంపై స్థానికుల ఆగ్రహం
ఉప్పులూరులో దేవదాయశాఖకు చెందిన రూ.16 కోట్ల విలువైన రెండు ఎకరాల భూమిని కొట్టేసేందుకు కొందరు స్కెచ్ వేశారు. గన్నవరం-కంకిపాడు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న భూమి తీసుకుని ఉప్పులూరు - మంతెన గ్రామాల మధ్యలో భూమి ఇవ్వడానికి మధ్యవర్తులతో కథ నడుపుతున్నారు. ఆ భూమి పరిశీలించేందుకు ఆర్‌జేసీ రావడంతో విషయం బయటకు వచ్చింది. ఆలయం కోసం దాతలు ఇచ్చిన భూమి అన్యాక్రాంతం కానుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కంకిపాడు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని ఉప్పులూరు గ్రామంలో గ్రూపు దేవాలయాలకు సంబంధించిన రెండు ఎకరాల భూమి రైల్వే గేటు సమీపంలో ఉంది. ఈ భూమిని దశాబ్దాల క్రితం దాతలు దేవాలయాల ఉత్సవాల నిర్వహణకు ఇచ్చారు. అయితే ఈ భూమిని ఓ గోదాము నిర్వాహకులు వేలంలో దక్కించుకొని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో గన్నవరం- కంకిపాడు ప్రధాన రహదారి వెంబడి గ్రామంలో ఉన్న రెండు ఎకరాల భూమిని సొంతం చేసుకునేందుకు గోదాము నిర్వాహకులు పావులు కదుపుతున్నారు. ఈ రెండు ఎకరాల భూమి విలువ సుమారు రూ.16 కోట్లు పలుకుతుంది. ఈ భూమి స్థానంలో ఉప్పులూరు - మంతెన గ్రామాల మధ్యలో ఎక్కడో రెండు లేదా మూడు ఎకరాల భూమిని దేవదాయ శాఖకు అప్పగించే విధంగా ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఆలయ అధికారుల వద్దకు పంపినట్టు తెలిసింది. దీనిపై దేవదాయ శాఖ ఆర్‌జేసీ త్రినిధరావు సోమవారం సంబంధిత భూమిని పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ అవసరాల కోసం దాతలు ఇచ్చిన భూమిని గోదాము నిర్వాహకులు అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నించటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రూపు దేవాలయాల ఈవో భవానీని వివరణ కోరగా భూమి మార్పునకు సంబంధించి వచ్చిన అర్జీపై ఆర్‌జేసీ త్రినిధరావు ఆలయ భూమిని పరిశీలించి వెళ్లారని చెప్పారు. తాను ఇటీవలనే బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియదని వివరించారు.