గాడితప్పిన పాలన!
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:51 AM
జిల్లా క్షయవ్యాధి నివారణ విభాగంలో ఇష్టారాజ్యంగా పాలన సాగుతోంది. అవసరం లేకపోయినా ఉద్యోగులను జిల్లా కేంద్రానికి డెప్యుటేషన్‌పై వేస్తున్నారు. ఇక్కడే నివాసం ఉంటూ పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు పొరుగు జిల్లాలో ఉంటూ విధులను గాలికి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. అవగాహన సదస్సుల ఏర్పాటు, వాహన వినియోగం పేరుతో గుట్టుగా బిల్లులు చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
- జిల్లా క్షయవ్యాధి నివారణ విభాగంలో ఇష్టారాజ్యం
- ఇబ్బడి, ముబ్బడిగా ఉద్యోగులకు డెప్యుటేషన్‌లు!
- మచిలీపట్నంలో ఖాళీగా ఉంటున్న పలువురు ఉద్యోగులు!
- జిల్లాలో నివాసం ఉండని ముఖ్య అధికారి
- అవగాహనా సదస్సులు నిర్వహించకుండానే బిల్లులు!
- వాహనం వినియోగంలోనూ మాయాజాలం!
జిల్లా క్షయవ్యాధి నివారణ విభాగంలో ఇష్టారాజ్యంగా పాలన సాగుతోంది. అవసరం లేకపోయినా ఉద్యోగులను జిల్లా కేంద్రానికి డెప్యుటేషన్‌పై వేస్తున్నారు. ఇక్కడే నివాసం ఉంటూ పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు పొరుగు జిల్లాలో ఉంటూ విధులను గాలికి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. అవగాహన సదస్సుల ఏర్పాటు, వాహన వినియోగం పేరుతో గుట్టుగా బిల్లులు చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లా క్షయవ్యాధి నివారణ విభాగంలో పాలన గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షయ, హెచ్‌ఐవీ, లెప్రసీ బారిన పడిన వారికి సకాలంలో వైద్యసేవలు అందించాల్సిన అధికారులు, సిబ్బంది తమ చిత్తానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యాధిగ్రస్థులకు పాటించాల్సిన నియమాలపై స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అవగాహనా సదస్సులను టీబీ విభాగం ద్వారానే నిర్వహిస్తున్నట్లుగా చూపి బిల్లులు చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతో సంబంధిత విభాగం అధికారి తనదైన శైలిలో పరిపాలన కొనసాగిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెప్పుకుంటున్నారు.
విధులు ఇక్కడ.. నివాసం పొరుగు జిల్లాలో..
జిల్లాలోని టీబీ రోగులు, హెచ్‌ఐవీ బాధితులు, లెప్రసీతో బాధపడేవారికి సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే అంశంపై టీబీ విభాగం జిల్లా వైద్యాధికారి నిత్యం పర్యవేక్షణ చేయాలి. కొన్ని సమయాల్లో నేరుగా రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుని రోగులకు మందులు వాడే విధానం, వ్యాధుల నివారణ అంశాలపై అవగాహన కల్పించాలి. ఇందుకోసం ఆయన జిల్లాలోనే నివాసం ఉండాలి. కానీ గత మూడు సంవత్సరాలుగా ఈ అధికారి ఉమ్మడి కృష్ణాజిల్లాలో కాకుండా, పొరుగున ఉన్న జిల్లాలో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే విధులకు హాజరవుతున్నారు. ఒక్కోసారి కార్యాలయానికి అసలు రావడంలేదు. అదేమని ఎవరైనా అడి గితే డాక్టర్ క్యాంపులో ఉన్నారంటూ అక్కడి సిబ్బంది చెబుతుంటారు. కలెక్టర్ సైతం మచిలీపట్నంలోనే నివాసం ఉంటుండగా, టీబీ ఆస్పత్రి వైద్యాధికారి మాత్రం గత మూడేళ్లుగా 76 కిలోమీటర్ల దూరంలోని పొరుగు జిల్లాలో నివాసం ఉంటూ విధులకు హాజరవుతుండటం గమనార్హం.
సొంత వాహనమే అద్దె వాహనంగా చూపి..
టీబీ ఆస్పత్రిలో విధుల నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం ఇచ్చిన వాహనం లేదా అద్దెకు తీసుకున్న వాహనాన్ని ఉపయోగించాలి. ఈ అధికారి తన సొంత వాహనాన్నే అద్దె వాహనంగా చూపి నెలనెలా బిల్లులు చేసుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విభాగంలో పరిపాలన ఏ విధంగా కొనసాగుతుందోననే అంశంపై ఉన్నతాధికారులు అంతగా దృష్టి సారించకపోవడాన్ని అలుసుగా తీసుకుని ఈ వైద్యాధికారి తనదైన శైలిలో వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి.
ఇష్టారాజ్యంగా డెప్యుటేషన్‌లు
జిల్లా టీబీ ఆస్పత్రి పరిధిలోని వివిధ విభాగాల్లో 80మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో టీబీ విభాగానికి సంబంధించి 58 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగుల్లో కొంతమందిని అవసరం లేకున్నా సంబంధిత వైద్యాధికారి మచిలీపట్నంలోని కార్యాలయంలో డెప్యుటేషన్ వేసి, ఇక్కడ ఖాళీగా కూర్చోబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చల్లపల్లి, బంటుమిల్లి తదితర ప్రాంతాల నుంచి తనకు అనుకూలంగా ఉన్న ఉద్యోగులను జిల్లా కేంద్ర కార్యాలయంలోనే ఉంచడంతో వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో టీబీ, హెచ్‌ఐవీ, లెప్రసీ బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందకుండా పోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. టీబీ వ్యాధిగ్రస్థులు, హెచ్‌ఐవీ, లెప్రసీ బాధితులతో వైద్యసిబ్బంది తరచూ మాట్లాడి, వారు సకాలంలో మందులు వాడుతున్నారా లేదా అనే అంశంపై సిబ్బంది పర్యవేక్షణ చేయాలి. కానీ 10 మందికి పైగా సిబ్బందిని అవసరం లేకున్నా డెప్యుటేషన్ పేరుతో జిల్లా కార్యాలయంలోనే ఉంచడంతో ఈ మండలాల్లో ఈ తరహా సేవలు కుంటుపడ్డాయని వైద్యశాఖ అధికారులు చెప్పుకుంటున్నారు. కొన్ని మండలాల్లో టీబీ బాధితులకు సకాలంలో వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉండటం లేదని నివేదికలు వస్తున్నా, ఈ అఽధికారి పట్టించుకోవడం లేదని ఆ శాఖ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.
స్వచ్ఛంద సంస్థల పనులూ తమ ఖాతాలోనే..
హెచ్‌ఐవీ, లెప్రసీ, టీబీ బారినపడిన వారికి స్వచ్ఛంద సంస్థలు తరచూ అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాయి. హెచ్‌ఐవీ బారిన పడినవారు ఆహారపు అలవాట్లు, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు వాడే విధానం, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాయి. కానీ ఈ తరహా సదస్సులు టీబీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించాలి. కానీ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన అవగాహన సదస్సులను టీబీ విభాగం ద్వారానే నిర్వహించినట్లుగా చూపి, గుట్టుచప్పుడు కాకుండా బిల్లులు చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా బిల్లులు చేసేందుకు చల్లపల్లి నుంచి ఒక ఉద్యోగిని ప్రత్యేకంగా టీబీ ఆస్పత్రిలో డెప్యుటేషన్‌పై నియమించుకున్నారని విమర్శలు వస్తున్నాయి.