Share News

‘స్వప్న’సాకారం..!

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:54 PM

ఆదోని పురపాలక ఎన్నికల్లో ఓటరు తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. పురపాలిక వార్డు కౌన్సిలరు ఎన్నికల్లో ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులకు జైకొట్టారు.

    ‘స్వప్న’సాకారం..!

జనసేన రెబల్‌ స్వప్న నాయకర్‌కు అండగా ఓటర్లు

కౌన్సిలర్లకు ఒకలా.. చైర్మనకు మరోలా తీర్పు

టీడీపీ, వైసీపీ ఓట్లలో భారీగా కోత

పార్టీలను కాదని సామాన్యురాలికి పట్టం కట్టిన ఆదోని ఓటర్లు

స్వప్నకు కలిసొచ్చిన క్రాస్‌ ఓటింగ్‌

ఆదోని రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

కర్నూలు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆదోని పురపాలక ఎన్నికల్లో ఓటరు తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. పురపాలిక వార్డు కౌన్సిలరు ఎన్నికల్లో ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులకు జైకొట్టారు. అదే చైర్మన ఎన్నికకు వచ్చేసరికి మాత్రం లెక్కలు మారిపోయాయి. ఓటర్లు ఇరు పార్టీలను కాదని జనసేన రెబల్‌ స్వతంత్ర అభ్యర్థికి అండగా నిలిచారు. అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో తాము చెప్పిందే జరగాలనే రెండు బలమైన రాజకీయ కుటుంబాలను ఉహించని షాక్‌ ఇచ్చి ఓ సామాన్యురాలిని గెలిపించారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ఓట్లకు భారీగా గండిపడగా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన జనసేన రెబల్‌ స్వప్న నాయకర్‌ అనూహ్య విజయం సాధించారు. కౌన్సిలర్లకు పార్టీ గుర్తు చూసి ఓటేసినా.. చైర్‌పర్సన అభ్యర్థి విషయంలో వ్యక్తిగత ఆదరణ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాన పార్టీల క్రాస్‌ ఓటింగ్‌ ఎన్నో ఏళ్ల ‘స్వప్న’సాకారం చేసిందా..? ఆదోనిలో ఏ ఇద్దరు కలసినా ఇదే హాట్‌ టాపిక్‌,

ఆదోని 1865లో మున్సిపాలిటీగా ఏర్పడింది. 160 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆదోని మున్సిపాలిటీకి 1917లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో హాజీ కె. అబ్దుల్‌ రహమాన విజయం సాధించి ప్రథమ చైర్మనగా బాధ్యతలు చేపట్టారు. ఘన చరిత్రను తనలో ఇనుమడింప జేసుకున్న ఆదోని మున్సిపాలిటీకి జరిగిన తాజా ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. 52 వార్డులు ఉంటే.. అధికార కూటమి ప్రధాన పార్టీ టీడీపీ 48 వార్డుల్లో అభ్యర్థులను బరిలో దింపారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ 52 వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. కౌన్సిలర్‌ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలకు మద్దతు పలికినా.. చైర్మన ఎంపికలో మాత్రం భిన్నమైన తీర్పునిచ్చారు. ఇరు పార్టీలను కాదని.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన జనసేన రెబల్‌ స్వప్న నాయకర్‌కు పట్టం కట్టారు. ఆమె విజయం వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలపై చర్చ మొదలైంది. ఇరు పార్టీల్లో ఓట్ల చీలికే ఆమె విజయానికి కారణమా..? ఇరు పార్టీ అభ్యర్థులు, వారిని బరిలో దింపిన రాజకీయ ముఖ్య నాయకులపై వ్యతిరేకమా..? కూటమిలో కుమ్మలాలే కారణమా..? టీడీపీలో వర్గవిభేదాలు పని చేశాయా..? పట్టణ ప్రజలు మార్పు కోరుకున్నారా..? ఆదోని రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతుంది.

ఫ ఎవరీ స్వప్న:

జనసేన నియోజకవర్గం ఇనచార్జి నాయకర్‌ మల్లికార్జున ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు. ఆ ఎన్నికల్టో ఆదోని ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తే చివరి క్షణంలో చేజారి పోయింది. ఆ తరువాత కాంగ్రెస్‌, టీడీపీలోకి వెళ్లినా.. తమ ఆభిమాన కథానాయకుడు పవన కళ్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీలోకి చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా ఓటీ చేసి దాదాపు 15 వేలు పైచిలుకు ఓట్లు సాధించారు. 2024లో సీట్లు సర్దుబాటులో భాగంగా ఆదోని జనసేన టికెట్‌ ఆశిస్తే.. బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ బరిలో దింపిన డాక్టర్‌ పార్థసారథి గెలుపు కోసం పని చేశారు. తాజా మున్సిపల్‌ ఎన్నికల్లో సీట్లు సర్దుబాటులో భాగంగా ఆదోని మున్సిపల్‌ చైర్మన సీటు జనసేనకు కేటాయిస్తారని, తన భార్య స్వప్న నాయకర్‌ను కూటమి అభ్యర్థిగా బరిలో దింపాలని సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే.. చివర్లో మారిన రాజకీయ సమీకరణాల వల్ల టీడీపీకే కేటాయించారు. దీంతో జనసేన రెబల్‌గా స్వతంత్ర అభ్యర్థిగా స్వప్న నాయకర్‌ను బరిలో దింపారు. టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే కె. మీనాక్షినాయుడు మేనకోడలు టి. మణి, వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి అత్యంత సన్నిహితులైన గాజుల ప్రణతి బరిలో దిగారు. త్రిముఖ పోరులో స్వప్నకు 10-15 వేలకు మించి ఓట్లు రావని, ఆమె కూటమి ఓట్లు చీలిస్తే వైసీపీ విజయం సాధిస్తుందని అంచనాలు వేశారు. ఈ అంచనాలు తలకిందలు చేస్తూ ఆదోని ఓటర్లు స్వప్నకు పట్టం కట్టారు.

ఫ క్రాస్‌ ఓటింగా.. పార్టీలకు వ్యతిరేకంగా ప్రజా తీర్పా?:

కౌన్సిలరు ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యరులకు ఓటేసిన ఓటర్లే.. చైర్మన ఎన్నికల్లో స్వప్నకు మద్దతు పలికారు. ఈ ఎన్నికల్లో 94,683 ఓట్లు పోలయ్యాయి. 5,044 చెల్లని ఓట్లు పోగా, 89,639 ఓట్లు లెక్కించారు. 52 వార్డులు ఉంటే టీడీపీ 48 వార్డుల్లో పోటీ చేసింది. ఆ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులకు 38,929 ఓట్లు వచ్చాయి. అదే చైర్మన అభ్యర్థి టి. మణికి 30,510 ఓట్లు వచ్చాయి. అంటే.. 8,419 మంది టీడీపీ నుంచి స్వతంత్ర అభ్యర్థి స్వప్నకు క్రాస్‌ ఓటింగ్‌ చేశారు. అలాగే.. 52 వార్డుల్లో పోటీ చేసిన వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులకు 33,960 పోలైతే, ఆ పార్టీ చైర్మన అభ్యర్థి గాజుల ప్రణతికు 22,368 ఓట్లే వచ్చాయి. అంటే.. 11,592 మంది ఓటర్లు వైసీపీ నుంచి స్వప్నకు క్రాస్‌ ఓటు వేశారు. ఈ రెండు ప్రధాన పార్టీల నుంచి 20,011 ఓట్లు క్రాస్‌ అయ్యాయి. ఈ లెక్కలు పరిశీలిస్తే.. టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన చీలిక ఓట్లు కాదని ఆమెకు 12,561 మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. రెండు ప్రధాన పార్టీల్లో ఏ ఒక్క పార్టీ కూడా క్రాస్‌ ఓటింగ్‌ జరగకపోయి ఉంటే ఆ పార్టీనే చైర్మనగా విజయం సాధించేది. అయితే.. పట్టణ ఓటర్లు మార్పు కోరుకోవడం వల్లే కౌన్సిలర్లుగా ప్రధాన పార్టీలకు ఓట్లేసి, చైర్మనగా జనసేన రెబల్‌ స్వప్నకు మద్దతుగా నిలిచారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Updated Date - Nov 04 , 2026 | 11:54 PM