Share News

ప్యాకేజీల తంటా!

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:24 AM

జాతీయ రహదారులను ప్యాకేజీల ప్రాతిపదికన చేపట్టిన ఎన్‌హెచ్‌ అధికారులు ఇప్పుడు టోల్‌ప్లాజాలను కూడా అదే ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. దీంతో విజయవాడ వెస్ట్‌ బైపాస్‌పై 25 కిలోమీటర్ల దూరంలోనే రెండు టోల్‌గేట్లు వస్తున్నాయి. ప్యాకేజీ-3లో వెదురుపావులూరు, ప్యాకేజీ-4లో వెంకటపాలెం ఉంది. ఇటు ఏలూరు, అటు గుంటూరు నుంచి రాజధాని అమరావతికి వెళ్లాలంటే వీటిని దాటాల్సిందే. దీంతో ఈ టోల్‌ప్లాజాలపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌హెచ్‌ అధికారులు మాత్రం పనులు చేపట్టిన ప్యాకేజీల ప్రకారమే టోల్‌గేట్లు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి 60 కిలోమీటర్లకు ఒక టోల్‌ప్లాజా అనే నిర్ణయం ఇక్కడ అమలుకు నోచుకోవడంలేదు.

ప్యాకేజీల తంటా!

- బైపాస్‌పై పనులు చేసిన ప్యాకేజీల వారీగా టోల్‌ప్లాజాల ఏర్పాటు

- విజయవాడ వెస్ట్‌ బైపాస్‌పై 25 కిలోమీటర్ల దూరంలోనే రెండు

- ప్యాకేజీ-3లో వెదురుపావులూరు, ప్యాకేజీ-4లో వెంకటపాలెం

- ఇటు ఏలూరు, అటు గుంటూరు నుంచి అమరావతికి వెళ్లాలంటే ఇవి దాటాల్సిందే!

- టోల్‌ప్లాజాలపై అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారులు

- పనుల ప్యాకేజీల ప్రకారమే టోల్‌ప్లాజాలు అంటున్న ఎన్‌హెచ్‌ అధికారులు

- అమలుకు నోచుకోని ప్రతి 60 కిలోమీటర్లకు ఒక టోల్‌ప్లాజా నిబంధన

జాతీయ రహదారులను ప్యాకేజీల ప్రాతిపదికన చేపట్టిన ఎన్‌హెచ్‌ అధికారులు ఇప్పుడు టోల్‌ప్లాజాలను కూడా అదే ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. దీంతో విజయవాడ వెస్ట్‌ బైపాస్‌పై 25 కిలోమీటర్ల దూరంలోనే రెండు టోల్‌గేట్లు వస్తున్నాయి. ప్యాకేజీ-3లో వెదురుపావులూరు, ప్యాకేజీ-4లో వెంకటపాలెం ఉంది. ఇటు ఏలూరు, అటు గుంటూరు నుంచి రాజధాని అమరావతికి వెళ్లాలంటే వీటిని దాటాల్సిందే. దీంతో ఈ టోల్‌ప్లాజాలపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌హెచ్‌ అధికారులు మాత్రం పనులు చేపట్టిన ప్యాకేజీల ప్రకారమే టోల్‌గేట్లు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి 60 కిలోమీటర్లకు ఒక టోల్‌ప్లాజా అనే నిర్ణయం ఇక్కడ అమలుకు నోచుకోవడంలేదు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ను రెండు ప్యాకేజీలుగా నిర్మించడంతో ఆ రెండు ప్యాకేజీలకు రెండు టోల్‌గేట్లను ఏర్పాటు చేశారు. ప్యాకేజీ-3లో చిన్న అవుటపల్లి-గొల్లపూడి మార్గంలో వెదురుపావులూరు దగ్గర.. ప్యాకేజీ-4లో సూరాయపాలెం-కాజ మార్గంలో వెంకటపాలెం దగ్గర టోల్‌ప్లాజాను ఏర్పాటు చేశారు. ఈ రెండింటి మధ్య దూరం 25 కిలోమీటర్లు కూడా లేదు. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ మీదుగా రాజధాని అమరావతికి చేరుకోవాలంటే బైపాస్‌లోనే రెండు టోల్‌గేట్లను దాటాల్సి వస్తోంది. అటు గుంటూరు నుంచి రావాలన్నా రెండు టోల్‌ప్లాజాలను దాటాల్సి ఉంది. ఇటు ఏలూరు నుంచి రావాలన్నా కూడా ఒక్క విజయవాడ బైపాస్‌లోనే రెండు టోల్‌ ప్లాజాలు వస్తున్నాయి. బైపాస్‌ కాకుండా అదనంగా టోల్‌ప్లాజాలు కేంద్ర ప్రభుత్వం ప్రతి 60 కిలోమీటర్లకు ఒకటే ఉండేలా చర్యలు తీసుకుంటామని ఒక వైపు చెప్పడం జరుగుతోంది. మరోవైపు ఆచరణలో మాత్రం 30 కిలోమీటర్ల దూరంలోనే రెండు టోల్‌ప్లాజాలు ఉంటున్నాయి. ఇదేమి లెక్క అంటే.. ప్యాకేజీ ప్రాతిపదికన టోల్‌ ప్లాజాలు ఏర్పాటు జరుగుతాయని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) అధికారులు చెబుతున్నారు. ఒకే టోల్‌ ప్లాజా ఏర్పాటు చేయడం కుదరదని అంటున్నారు. రెండు టోల్‌ ప్లాజాలు ఏర్పాటు చేసినా.. ధరలు ఎక్కువుగా ఉండవని, ఆయా ప్యాకేజీలకు అయిన వ్యయం ప్రకారం టోల్‌ చార్జీల విధింపు ఉంటుందని చె బుతున్నారు. రెండు ప్యాకేజీలు కూడా మొత్తం 65 కిలోమీటర్లు ఉండకపోవచ్చు. టోల్‌ చార్జీల భారం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, భౌగోళికంగా ఇక్కడ ఉన్న సమస్య టోల్‌ చార్జీల గురించి కాదు. జంట నగరాలుగా ఉన్న గుంటూరు, విజయవాడ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలకు టోల్‌ ప్లాజాల వల్ల ఇబ్బందికరంగా ఉంటోంది. ఈ టోల్‌ ప్లాజాలు ఏవో అవుటర్‌లో ఏర్పాటు చేసుకుంటే సమస్య ఉండదన్నది ప్రజల అభిప్రాయం. ప్యాకేజీల లిమిట్‌లోనే టోల్‌ ప్లాజాలు ఉండాలే తప్ప అవుటర్‌లో ఏర్పాటు చేయడం కుదరదని జాతీయ రహదారుల సంస్థ అధికారులు అంటున్నారు.

అమరావతిలోకి వెళ్లాలంటే రెండు టోల్‌ ప్లాజాలు దాటాల్సిందే..

ఏలూరు, ఆపై నుంచి రాజధాని అమరావతికి వెళ్లే వారు చిన్న అవుటపల్లి నుంచి విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ మీదుగా రావాల్సి ఉంటుంది. బైపాస్‌లో వెదురుపావులూరు దగ్గర టోల్‌ ప్లాజా ఉంటుంది. ఈ టోల్‌ ప్లాజా దాటి గొల్లపూడి మీదుగా కృష్ణా బ్రిడ్జిని దాటుకుని ముందుకు వెళ్లగానే.. వెంకటపాలెం దగ్గర మరో టోల్‌ గేట్‌ వస్తుంది. అమరావతిలోని సచివాలయం రోడ్డుకు వెళ్లాలంటే ఈ-8 రోడ్డుకు చేరుకోవాలి. అమరావతిలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా టోల్‌ ప్లాజా దాటాల్సి ఉంది. రెండు టోల్‌ ప్లాజాలు దాటడం అన్నది ఒక రకంగా ఇబ్బందికరమైన అంశం. ఇదేదో అడ్డుగోడలు అన్న భావన వాహనదారుల్లో కలుగుతోంది. గుంటూరు నుంచి అమరావతి వచ్చే వారికి కూడా రెండు టోల్‌ప్లాజాలు తప్పడం లేదు. గుంటూరు నుంచి వచ్చే క్రమంలో కాజ దగ్గర టోల్‌ ప్లాజాను దాటాలి. ఎగువున కాజ నుంచి బైపాస్‌ రోడ్డు ఎక్కిన తర్వాత వెంకటపాలెం దగ్గర టోల్‌ప్లాజాను దాటాల్సి ఉంటుంది. సచివాలయానికి వెళ్లాలంటే టోల్‌ప్లాజా దిగువున ఈ-8 రోడ్డులోకి వెళ్లిపోవచ్చు. కానీ, మిగిలిన అమరావతి ప్రాంతంలోకి వెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా టోల్‌ప్లాజాను దాటాల్సి ఉంటుంది. అటు గుంటూరు ప్రజలకు కూడా 23 కిలోమీటర్ల దూరంలోనే రెండు టోల్‌ప్లాజాలు ఉండటం ఇబ్బందికరంగా మారింది.

వెస్ట్‌ బైపాస్‌ను మినహాయిస్తే..

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ను మినహాయిస్తే.. ఏలూరు నుంచి విజయవాడ వెలుపల నుంచి కానీ, విజయవాడ మీదుగా కానీ వెళ్లాలంటే ఎన్‌హెచ్‌-16పై ముందుగా అనేక టోల్‌ ప్లాజాలను దాటాల్సి ఉంటుంది. ఏలూరు నుంచి విజయవాడ వచ్చే క్రమంలో కలపర్రు టోల్‌ప్లాజా వస్తుంది. ఆ తర్వాత పొట్టిపాడు టోల్‌ ప్లాజా ఉంటుంది. విజయవాడ మీదుగా వెళ్లే క్రమంలో అయితే కాజ టోల్‌ప్లాజా ఉంది. మొత్తం మూడు టోల్‌ప్లాజాలను దాటాల్సి ఉంది. అదే విజయవాడ బైపాస్‌ మీదుగా అయితే పైన చెప్పుకున్నట్టుగా వెదురుపావులూరు, వెంకటపాలెం టోల్‌ప్లాజాలను కూడా అదనంగా కలిపి మొత్తం ఐదు టోల్‌ ప్లాజాలను దాటాల్సి ఉంటుంది. గుంటూరు నుంచి కూడా ఇదే విధానంలో టోల్‌ ప్లాజాలను దాటాల్సి ఉంది.

కాజ యథాతధం.. పొట్టిపాడు ఎత్తివేత!

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పొట్టిపాడు టోల్‌ప్లాజాను త్వరలో ఎత్తివేయనున్నారు. ఈ టోల్‌ప్లాజాను కలపర్రులో విలీనం చేస్తారు. నిర్ణీత 60 కిలోమీటర్ల దూరానికి ఒక టోల్‌ ప్లాజా ఉండాలన్న నియమాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారు. కానీ, విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ విషయంలో మాత్రంలో అమలు చేయటం లేదు. అదేమంటే ప్యాకేజీలు రెండు కాబట్టి తప్పటం లేదంటున్నారు. అవుటర్‌లో పెడితే.. ఈ మార్గంలో రెవెన్యూ లాస్‌ అవుతుందని ఎన్‌హెచ్‌ వర్గాలు బహిరంగంగా చెబుతున్నాయి. ఏలూరు నుంచి వచ్చే ప్రజలకు కనీసం పొట్టిపాడు టోల్‌ప్లాజాను ఎత్తివేస్తారన్న ఒక్క రిలీఫ్‌ అయినా ఉంది. గుంటూరు నుంచి వచ్చేవాళ్లకు మాత్రం ఆ రిలీఫ్‌ కూడా లేదు. కాజ టోల్‌గేట్‌ను ఎత్తివేస్తారన్న ప్రచారంలో నిజం లేదని ఎన్‌హెచ్‌ అధికార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Mar 04 , 2026 | 01:24 AM