అన్ని రంగాలకూ ఊతం
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:56 PM
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు కేటాయింపులు జరిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో జిల్లాలో అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు.
రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం
జిల్లాలో సాగునీటి వనరులకు నిధుల వరద
అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి క్లస్టర్లలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు
ఉచిత బస్సు ప్రయాణాల ప్రకటనతో 30,026 మంది దివ్యాంగులకు లబ్ధి
అనకాపల్లి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు కేటాయింపులు జరిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో జిల్లాలో అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి క్లస్టర్లలో ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. సాగునీటి వనరులకు భారీగా నిధులు కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి బడ్జెట్‌లో సముచిత స్థానం ఇవ్వడంతో పాటు గ్రామీణ నేపథ్యం ఉన్న అనకాపల్లి జిల్లాను ప్రగతి పథంలో పరుగులుపెట్టించే దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు జరపడంపై జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా 79,56,081 మంది మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన ప్రభుత్వం దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. దీంతో జిల్లాలో సుమారు 30,026 మంది దివ్యాంగులకు ఉచిత బస్సు సదుపాయం అందుబాటులోకి రానుంది. తల్లికి వందనం పథకం ద్వారా 1,80,648, దీపం పథకం కింద 3,69,851 మందికి లబ్ధి చేకూరనుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు ధ్యేయంగా జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగుతున్న భూసేకరణకు, ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి పనులకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. నక్కపల్లి, అచ్యుతాపురం, పరవాడ ఏపీఐఐసీ సెజ్‌లలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరగడంతో పారిశ్రామిక ప్రగతి జోరందుకోనుంది. విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ రూపకల్పన చేయడాన్ని జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు.
సాగునీటి వనరులకు మహర్దశ
జిల్లాలో సాగునీటి వనరులకు మహర్దశ పట్టనుంది. బడ్జెట్‌లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులకు, జలాశయాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. ప్రధానంగా జిల్లాలో లక్షలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువ ద్వారా జిల్లాకు తరలించే లక్ష్యంతో చేపట్టిన సుజల స్రవంతి పథకాన్ని గత వైసీపీ పాలకులు గాలికొదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పథకం కింద పోలవరం ఎడమ కాలువ పనులు అనుసంధానం చేస్తూ 26 గ్రామాల్లో 1,850 ఎకరాల భూములను సేకరించి, కాలువ నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.605 కోట్లు కేటాయించడంతో పోలవరం ఎడమ కాలువ పనులతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి సంబంధించి భూసేకరణ, కాలువల నిర్మాణ పనులు జోరందుకోనున్నాయి. దీంతో పాటు జిల్లాలో తాండవ, రైవాడ, కోనాం, పెద్దేరు జలాశయాలకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో కాలువల నిర్వహణకు సంబంధించిన మిగులు పనులు పూర్తికానున్నాయి. మాడుగుల నియోజకవర్గం పరిధిలోని పెద్దేరు జలాశయ పరిధిలో 29 కిలోమీటర్ల పొడవున పెద్దేరు సాగునీటి కాలువలు అధ్వానంగా మారాయి. వీటి నిర్వహణ పనుల కోసం జిల్లా జలవనరుల శాఖ రూ.70 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. తొలిదశ నిర్వహణ పనులు చేపట్టేందుకు పెద్దేరు జలాశయానికి ఈ బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించారు. రైవాడ జలాశయ పరిధిలోని 31 కిలోమీటర్ల పొడవున సాగునీటి కాలువలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో పూడిక చేరి అధ్వానంగా మారాయి. రైవాడ పంట కాలువల నిర్వహణ పనులకు జల వనరుల శాఖ ఇంజనీర్లు రూ.65 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ బడ్జెట్‌లో రైవాడ పంట కాలువల నిర్వహణ పనులకు రూ.75 లక్షలు కేటాయింపులు జరిగాయి. దీంతోపాటు తాండవ జలాశయానికి రూ.48 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో పంట కాలువల నిర్వహణ పనులు చేపట్టనున్నారు.