ముంబైలో శిశువుల విక్రయ ముఠా!
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:39 AM
శిశువుల విక్రయం కేసు దర్యాప్తుతో ముఠాల డొంక కదులుతోంది. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న నిందితులు ఒక్కొక్కరిని పోలీసులు బయటకు లాక్కొస్తున్నారు. తెలుగు రాషా్ట్రల్లో శిశువుల విక్రయాల్లో కీలక భూమిక పోషించిన విజయవాడకు చెందిన బలగం సరోజని చేతుల్లో శిశువులను పెట్టిన ఇద్దరు నిందితులను ముంబైలో మంగళవారం అరెస్టు చేశారు. ఆ ఇద్దరిలో ఒక నిందితుడు ఇప్పటికే జైల్లో ఉన్నాడు.
ఇద్దరు నిందితుల అరెస్టు
మహిళా నిందితురాలిని కోర్టులో హాజరుపరిచిన సీటీఎఫ్
ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలింపు
జైల్లో ఉన్న నిందితుడిపై విజయవాడ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు
శిశువుల విక్రయం కేసు దర్యాప్తుతో ముఠాల డొంక కదులుతోంది. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న నిందితులు ఒక్కొక్కరిని పోలీసులు బయటకు లాక్కొస్తున్నారు. తెలుగు రాషా్ట్రల్లో శిశువుల విక్రయాల్లో కీలక భూమిక పోషించిన విజయవాడకు చెందిన బలగం సరోజని చేతుల్లో శిశువులను పెట్టిన ఇద్దరు నిందితులను ముంబైలో మంగళవారం అరెస్టు చేశారు. ఆ ఇద్దరిలో ఒక నిందితుడు ఇప్పటికే జైల్లో ఉన్నాడు.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
విజయవాడలో సంచలనం సృష్టించిన శిశువుల విక్రయం కేసులో ముంబై నుంచి ఇద్దరు, ఢిల్లీ నుంచి ముగ్గురు శిశువులను రెండు ముఠాలు తీసుకొచ్చి నగరంలోని సరోజనికి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, బర్తీని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. గత నెల 18వ తేదీన బలగం సరోజని గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. తాజాగా సరోజని, బర్తీని భవానీపురం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. బర్తీని విచారించి తిరిగి జైలుకు అప్పగించారు. సరోజని విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ ఇద్దరి నుంచి రాబట్టిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ బృందాలు ఢిల్లీ, ముంబై వెళ్లాయి. ముంబైకి చెందిన కవిత ప్రతాప్ జాదవ్, నూర్, సతీష్ బాబా కైర్ కలిసి ఇద్దరు పిల్లలను సరోజనికి అప్పగించారు. ఇందులో కవిత ప్రతాప్ జాదవ్‌ను థానేలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆమెను అక్కడి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొస్తున్నారు. ఈ ముఠాలో ఉన్న మరో ఇద్దరు సతీష్ బాబా కైర్, నూర్ చిక్కాల్సి ఉంది. థానేకు 70 కిలోమీటర్ల దూరంలో నూర్ ఉన్నట్టు గుర్తించారు. సతీష్ బాబా కైర్ మాత్రం గుజరాతలోని అహ్మదాబాద్‌కు సమీపంలో ఉన్నట్టు పోలీస్ బృందాలకు సమాచారం అందింది.
ఒక కేసు కోసం వెళ్తే..
ఢిల్లీకి చెందిన కిరణ్‌శర్మ, బర్తీతోపాటు ముఠాలో కొంతమంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా రెండు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రియాంక, కాజల్ ఢిల్లీ ముఠాలో ఉన్నట్టు తెలుస్తోంది. కాజల్‌ను కిరణ్‌శర్మకు ప్రియాంక పరిచయం చేసినట్టు సమాచారం. ఇప్పటికే కిరణ్‌శర్మ, బర్తీ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నందున మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బలగం సరోజనికి కిరణ్‌శర్మ పిల్లలను అందజేసినట్టుగానే కాజల్ ఆమెకు పిల్లలను అందజేసిందని పోలీసులు సమాచారం సేకరించారు. కవిత, నూర్, సతీష్ కోసం ముంబై వెళ్లిన పోలీసులకు మరో నిందితుడి సమాచారం తెలిసింది. విజయవాడ పోలీసులు గడచిన ఏడాది మార్చి నెలలో సరోజని ముఠాను శిశువులను విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఆ కేసులోనే కిరణ్‌శర్మ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ రోజున కిరణ్‌శర్మకు సహకరించిన అనిల్ బాబా కైర్ గురించి ముంబై వెళ్లిన బృందానికి సమాచారం వచ్చింది. గుజరాతలోని అహ్మదాబాద్‌కు చెందిన అనిల్ ముంబైలో ఉంటున్నాడు. ముంబైలో 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆమె తల్లిదండ్రుల నుంచి రూ.12లక్షలు డిమాండ్ చేశాడు. దీనిపై కుల్గావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అనిల్ అక్కడి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తులు సమర్పించకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ మహిళా పోలీస్‌స్టేషన్ అధికారులు వెంటనే అనిల్‌పై ఆరో అదనపు జ్యుడిషియల్ మేజిసే్ట్రట్ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతి ఇవ్వడంతో అనిల్ కుమార్‌ను తీసుకురావడానికి పోలీసులు బయలుదేరి వెళ్లారు.
ఢిల్లీలో మేనమామ.. ముంబైలో మేనల్లుడు
శిశువుల విక్రయం కేసులో లోతులకు వెళ్లే కొద్దీ కొత్త విషయాలతోపాటు నిందితుల మధ్య ఉన్న బంధుత్వాలు బయటకు వస్తున్నాయి. ఢిల్లీలో కిరణ్‌శర్మకు సహకరించిన అనిల్, ముంబై ముఠాలో ఉన్న సతీష్ బంధువులు. ఇద్దరూ అహ్మదాబాద్‌లోని సబర్‌కాంత జిల్లాకు చెందిన వారే. సతీష్‌కు అనిల్ వరుసకు మేనమామ అవుతాడు. అనిల్ భార్య అహ్మదాబాద్‌లో ప్రభుత్వ పాఠశాలలో అవుట్ సోర్సింగ్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. కుల్గావ్ పోలీసులకు చిక్కడానికి ముందు అనిల్ తన బంధువైన సతీష్, కవితతోపాటు మరో యువతితో ఫోన్లలో మాట్లాడాడు. సాంకేతికంగా ఆ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.