Share News

ఏంటో ఆ పన్ను..గడ?

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:42 AM

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ఇదో పెను సంచలనం. ఓ కంపెనీ తన విదేశీ ఎగుమతులకు సంబంధించిన పన్నులను భారీగా ఎగవేసిన వ్యవహారం జగన్‌ ప్రభుత్వంలో..

ఏంటో ఆ పన్ను..గడ?

  • 952 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఉన్నతాధికారుల వింత పోకడ

  • ముక్కుపిండి వసూలు చేయాల్సిందిపోయి.. ఆ పని చేయబోయిన అధికారి పవర్స్‌ కట్‌

  • జగన్‌ హయాంలో మొదలైన వ్యవహారం.. కూటమి వచ్చినా మారని ఉన్నతాధికారుల తీరు

  • కౌంటరు వేయకుండా నాలుగేళ్లుగా సాగదీత.. అనుమానం వచ్చి కమిషనర్‌కు జీపీ లేఖ

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ఇదో పెను సంచలనం. ఓ కంపెనీ తన విదేశీ ఎగుమతులకు సంబంధించిన పన్నులను భారీగా ఎగవేసిన వ్యవహారం జగన్‌ ప్రభుత్వంలో 2022లో చోటుచేసుకుంది. ఇదేం చిన్న ఎగవేత కాదు. దాదాపు రూ. 952 కోట్ల వ్యవహారం. కంపెనీ ముక్కుపిండి ఆ డబ్బులు వసూలు చేయాల్సిన ఉన్నతాధికారులు.. దానికి భిన్నంగా ఇందుకు ప్రయత్నించిన అధికారి ‘పవర్‌’నే కత్తిరించివేశారు. కోర్టుతోనూ దాగుడు మూతలాడారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో కూడా, ఉన్నతాధికారుల తీరులో మార్పు లేదు. కంపెనీ ఎగవేసిన పన్నులను తిరిగి రాబట్టుకునేందుకు ఆసక్తి చూపని వారి ప్రవర్తన ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉత్తరాంధ్రలో ఫెర్రో అల్లాయ్‌కు సంబంధించిన ఓ కంపెనీ విదేశీ ఎగుమతుల విషయంలో పన్నులు సరిగ్గా చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2022లో సెంట్రల్‌ ట్యాక్స్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ నుంచి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు సమాచారం అందింది. ఇదే విషయమై విజయవాడలోని చీఫ్‌ కమిషనర్‌ ఆఫీసులోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నుంచి కూడా మరో నివేదిక వచ్చింది. వీటి ఆధారంగా అనకాపల్లికి చెందిన కమర్షియల్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ) ఆ కంపెనీ విదేశీ ఎగుమతుల చిట్టాను పరిశీలించారు. పన్నుల తీరును పరిశీలించారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని గుర్తించి, తనకున్న చట్టబద్ధమైన అధికారంతో మొత్తం రూ.952.17 కోట్ల డిమాండ్‌ నోటీసును 2022 జూలై 18న జారీ చేశారు.


ఇదంతా కూడా 2017 నవంబరు నుంచి 2021 ఆగస్టు నాటికి చేసిన పన్ను మదింపునకు సంబంధించిందనేది డిమాండ్‌ నోటీసులో స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం, ఆ కంపెనీ నోటీసుతో విబేధిస్తే పై అధికారి అంటే జాయింట్‌ కమిషనర్‌ లేదా అదనపు కమిషనర్‌ వద్ద అప్పీల్‌ చేసుకోవచ్చు. కానీ, ఆ నోటీసు విడుదలయ్యే సమయంలో కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నతాధికారులు కంపెనీకి అనుకూలంగా స్పందించారు. ఏసీకి డిమాండ్‌ నోటీసు ఇచ్చే అధికారం లేదని, కేంద్ర చట్టం ప్రకారం ఉన్నతస్థాయి అధికారికే ఆ వెసులుబాటు ఉందంటూ రాసుకొచ్చారు. ఇక ఆ కంపెనీ దీన్ని పట్టుకొని, తమకు ఇచ్చిన డిమాండ్‌ నోటీసు అక్రమం అని, అసె్‌సమెంట్‌ చేసే అధికారం ఏసీకి లేనేలేదని, వెంటనే దాన్ని కొట్టివేయాలంటూ 2022 అక్టోబరు 17న హైకోర్టును ఆశ్రయించింది. వెళ్లి అప్పిలేట్‌ అథారిటీలో అప్పీల్‌ చేసుకోవాలని హైకోర్టు ఆ మరుసటి రోజే అంటే, 18న ఆదేశించింది. ఇందుకు భిన్నంగా ఆ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసె్‌సమెంట్‌ చేసే అధికారం లేకుండా ఓ అధికారి తమకు ఇచ్చిన డిమాండ్‌ నోటీసును రద్దుచేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వెళ్లి ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలని 2023 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసును త్వరగా తేల్చాలని కూడా హైకోర్టును ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు విచారణ చేపట్టగా అధికారులు అసలు విన్యాసాలు బయటకొచ్చాయి. అసిస్టెంట్‌ కమిషనర్‌కు అసె్‌సమెంట్‌ చేసే అధికారం ఉందని శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తిరిగి తీసుకొచ్చారు. కానీ, ఏసీకి అసె్‌సమెంట్‌ చేసే అధికారం ఉందో లేదో తేల్చాలని కోర్టు అనేక మార్లు ఆదేశించినా కౌంటర్‌ మాత్రం దాఖలు చేయలేదు. ఈ పని ఎందుకు చేయడం లేదంటారా?...చేసిన తప్పు తెలిసిపోతుంది. ఏసీకి అసె్‌సమెంట్‌ అధికారం ఉందని కౌంటర్‌ వేస్తే, వెబ్‌సైట్‌లో ఏసీకి అధికారం లేదని ఎలా రాశారని కోర్టు ప్రశ్నిస్తుంది. అప్పుడు అసలు గుట్టు బయటకొస్తుంది.


జీపీకి అనుమానం..

కేసు విచారణకు వచ్చినప్పుడల్లా ఉన్నతాధికారులు కౌంటర్‌ వేయలేదు. కాబట్టి ప్రభుత్వ జీపీ కేసును వాయిదా వేయాలని పదేపదే కోరారు. 2024లో కూటమి సర్కారు వచ్చినతర్వాత కూడా ఉన్నతాధికారుల తీరులో ఇసుమంతైనా మార్పురాలేదు. ఈ దశలో శాఖ తరపున కోర్టులో వాదనలు వినిపిస్తోన్న జీపీకి అనుమానాలు వచ్చాయి. మొత్తం పరిణామాలపై సీఐడీతో విచారణ చేయాలని కమర్షియల్‌ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. ‘‘వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కంపెనీతో కుమ్మక్కయి ప్రభుత్వ ప్రయోజనాలు, దానికి వచ్చే ఆదాయం విషయంలో రాజీపడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా, ఈ రోజుదాకా కౌంటర్‌ దాఖలు చేయలేదు. కాబట్టి జరుగుతున్న పరిణామాలు, అధికారుల చర్యలు ఉద్దేశ్యపూర్వకంగానే ఆ కంపెనీకి మేలుచేసేలా ఉన్నాయని నమ్ముతున్నాను. కాబట్టి, ఈ విషయంలో వాణిజ్యపన్నుల శాఖ అంతర్గత విచారణ జరిపించాలి. ఈ విషయంలో సీఐడీకి ఫిర్యాదు చేసి స్వతంత్ర విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలి’’ అని జీపీ ఆలేఖలో కోరారు.


అయినా గప్‌చుప్‌...

సీఐడీతో విచారణ చేయించాలని జీపీ లేఖరాసి ఇప్పటికీ 33 నెలలవుతోంది. అయినా చర్యలు శూన్యం. ఎందుకిలా? ఆ శాఖలో ఏం జరుగుతోంది? అన్నవే అసలు ప్రశ్నలు. శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు పన్ను మదింపుచేసి డిమాండ్‌ నోటీసు ఇచ్చే అధికారం ఉందన్న విషయాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి తీసేయ్యడం వల్లే ఆ కంపెనీ కోర్టుకు వెళ్లింది. కేసు విచారణ అంతా ఆ కోణంలోనే సాగుతోంది. సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఏసీకి అసె్‌సమెంట్‌ అధికారం ఉందని మళ్లీ వెబ్‌సైట్‌లో ఎలా పొందుపరిచారు? వీటిపై శాఖాపరమైన విచారణ జరగాలని జీపీ ఇచ్చిన లేఖను ఎందుకు తొక్కిపెట్టారు? జగన్‌ ప్రభుత్వంలో జరిగిన అంశంపై కూటమి సర్కారులోని అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ మౌనం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆగిపోయింది. అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారు? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.


టెక్నికల్‌గా జరిగిన పొరపాటు: అహ్మద్‌బాబు

అసిస్టెంట్‌ కమిషనర్‌కు అసె్‌సమెంట్‌ చేసే అధికారం లేదని వెబ్‌సైట్‌లో నుంచి తొలగించడం అనేది సాంకేతికంగా జరిగిన చిన్న పొరపాటని వాణిజ్య పన్నుల చీఫ్‌ కమిషనర్‌ అహ్మద్‌బాబు చెప్పారు. ఈ అంశంపై ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఫోన్‌లో సంప్రదించగా, అహ్మద్‌బాబు మాట్లాడారు. ‘‘చిన్న సాంకేతిక సమస్యను పెద్దదిగా చూడటం సరికాదు. టెక్నికల్‌గా జరిగిన తప్పును సరిదిద్దాం. ఇక జీపీ కోరినట్లుగా సీఐడీ విచారణ చేయాల్సిన అవసరం లేదు. విచారణల పేరిట కంపెనీలను వేధించడం సరికాదు. కేంద్రం కూడా ఇదే విషయం చెబుతోంది.’’ అని వివరించారు.

Updated Date - Aug 23 , 2026 | 04:46 AM