నా కట్టె ఇక్కడే కాలాలి!
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:44 AM
అమెరికా పౌరసత్వం కోసం అందరూ ఎగబడుతున్న వేళ.. మాతృభూమిలోనే తుదిశ్వాస విడిచిపెట్టాలనుకుంటోంది ప్రవాసాంధ్ర వృద్ధురాలు. తన కట్టె ఇక్కడే కాలానిని, తాను పుట్టిన ఈ మట్టిలోనే కలిసిపోవాలన్నది..
భారత పౌరసత్వం కోసం 94 ఏళ్ల వృద్ధురాలి దరఖాస్తు
భారత చట్టాలకు లోబడి ఉంటానని కలెక్టర్ ఎదుట ప్రమాణం
బాపట్ల, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): అమెరికా పౌరసత్వం కోసం అందరూ ఎగబడుతున్న వేళ.. మాతృభూమిలోనే తుదిశ్వాస విడిచిపెట్టాలనుకుంటోంది ప్రవాసాంధ్ర వృద్ధురాలు. తన కట్టె ఇక్కడే కాలానిని, తాను పుట్టిన ఈ మట్టిలోనే కలిసిపోవాలన్నది ఆమె అంతిమ కోరిక!. 94 ఏళ్ల వయసులో తన జన్మభూమిలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని పుట్టిన గడ్డపై మమకారం చాటుకుంది. వివరాలివీ.. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ కుటుంబం 1993లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. 2000 లో మహాలక్ష్మమ్మతో సహా కుటుంబ సభ్యులకు అమెరికా పౌరసత్వం లభించింది. 2018లో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చేసింది. కుమారుడు బుచ్చయ్య గుంటూరులోని ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాల డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామానికి వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తుండగా భారతీయ పౌరురాలిగా గుర్తింపు పొందడం కోసం ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టింది. చట్టబద్ధంగా తనకు భారతీయ పౌరసత్వం కల్పించాలని గతంలోనే రాష్ట్రస్థాయిలోని సచివాలయంలో మహాలక్ష్మమ్మ ఆన్‌లైన్‌లో అర్జీ పెట్టుకుంది. దానిలో సాంకేతిక తప్పిదాలు ఉండడంతో మళ్లీ సవరించి దరఖాస్తు చేసుకోగా సచివాలయంలోని సదరు విభాగం స్పందించి ఆమె అర్జీని బాపట్ల జిల్లా కలెక్టర్‌కు పంపించింది. పౌరసత్వం ఇవ్వడానికి అవలంబించే ప్రక్రియలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ మంగళవారం ఆ వృద్ధురాలితో తన కార్యాలయంలో ప్రమాణం చేయించారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు ఇక్కడి చట్టాలకు లోబడి ఉంటాననేది ఆ ప్రమాణం (ఓత్) సారాంశం!. ప్రమాణ ప్రతితో పాటు విచారణ నివేదికను కేంద్రహోం శాఖకు నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. అక్కడినుంచి అమెరికా ఎంబసీకి పంపిస్తారని, అమెరికా పౌరసత్వం రద్దు కాగానే ఇక్కడి పౌరురాలిగా హోదా దక్కుతుందని ఆయన వివరించారు.