86 మంది గ్రూప్-1అధికారుల బదిలీ
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:48 AM
హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం స్పందించింది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో నియమితులైన 86 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం
జాబితాలో 25 మంది చొప్పున ఆర్డీవోలు, డీఎస్పీలు
22 మంది ఎంపీడీవోలు, 8 మంది ఏఎస్ఈలు కూడా
రవాణా శాఖలో ఐదుగురు ఆర్‌టీవోల బదిలీ
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం స్పందించింది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో నియమితులైన 86 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరీలో 169 పోస్టులకు గాను 150 మంది విధుల్లో చేరారు. ఇందులో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖ సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్, ఆయా శాఖల ఉన్నతాధికారులు బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా 25 మంది ఆర్డీవోలను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశించారు. బదిలీ అయినవారిలో కొవ్వూరు, కుప్పం, రేపల్లె, నర్సరావుపేట, విజయనగరం, పత్తికొండ, జమ్మలమడుగు, పలాస, ఏలూరు, సత్తెనపల్లి, ఉయ్యూరు, కొత్తపేట, ధర్మవరం, కావలి, సుళ్లూరుపేట, నగరి, విజయవాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రాపురం, కనిగిరి, కడప, తాడేపల్లిగూడెం, ఆత్మకూరు ఆర్డీవోలు ఉన్నారు. కడప మున్సిపల్ కమిషనర్ కూడా బదిలీ జాబితాలో ఉన్నారు. తొలుత సీసీఎల్‌ఏ పీడీ సీఎంఆర్‌వో ఉన్న ఎం.వాణిని బదిలీ చేశారు. అయితే అది అప్రాధాన్యమైన పోస్టు కావడంతో ఆ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వాణి బదిలీని నిలిపివేసి, తిరిగి అక్కడే కొనసాగించాలని మరో ఉత్తర్వు ఇచ్చింది.
కాగా, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అత్యవసరంగా సమావేశమైన పోలీసు ఎస్టాబ్లి్‌షమెంట్ బోర్డు.. 25మంది డీఎస్పీలను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీరిలో విజయవాడ సిటీ, గూడూరు, రాజమండ్రి నార్త్‌జోన్, పరవాడ, కనిగిరి, ఎన్‌టీఆర్ సౌత్‌జోన్, ధర్మవరం, బొబ్బిలి, రామచంద్రాపురం, నగరి, గుంటూరు సౌత్, గుంటూరు పశ్చిమం, రపచోడవరం, గురజాల, అవనిగడ్డ, నర్సాపుర్, మచిలీపట్నం, కాశీబుగ్గ, ఆళ్లగడ్డ, గుడివాడ, విశాఖ సిటీ వెస్ట్, మదనపల్లి డీఎస్పీలున్నారు. వీరందరినీ మంగళగిరిలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 22మంది ఎంపీడీవోలను, శ్రీకాకుళం డీపీవోను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వీరిని కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. మరోవైపు అబ్కారీ శాఖలో ఏఈఎ్‌సలుగా పనిచేస్తున్న 8మందిని ఎక్సైజ్ శాఖ బదిలీ చేసింది. వారిని ప్రధాన ఎక్సైజ్ డైరెక్టరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. రవాణా శాఖ పరిధిలో ఐదుగురు ఆర్‌టీవోలను బదిలీ చేశారు. చిత్తూరు, అన్నమయ్య, ప్రొద్దుటూరు ఆర్‌టీవోలను కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.