ఏపీఎంసీ ఎన్నికలకు 84 నామినేషన్లు
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:17 AM
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (ఏపీఎంసీ) ఎన్నికల్లో పోటీకి 84 నామినేషన్లు వచ్చాయని కౌన్సిల్ రిజిస్ట్రార్ డా.ఐ.రమేశ్ తెలిపారు.
13 మెంబర్ పోస్టులకు వైద్యుల నుంచి భారీ పోటీ
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (ఏపీఎంసీ) ఎన్నికల్లో పోటీకి 84 నామినేషన్లు వచ్చాయని కౌన్సిల్ రిజిస్ట్రార్ డా.ఐ.రమేశ్ తెలిపారు. మంగళవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇప్పటి వరకూ వచ్చిన నామినేషన్లను అధికారులు పరిశీలించారు. 13 మెడికల్ కౌన్సిల్ మెంబర్లకు 84 మంది వైద్యులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 9న ఆన్‌లైన్‌లో ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. 54 వేల మంది వైద్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఎన్నికలాధికారి కె.వి.ఎన్.చక్రధరబాబు నేతృత్వంలో ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఓటింగ్ ప్రక్రియలో వైద్యులు జాగ్రత్తగా వ్యవహరించాలని, వైద్యులకు మెయిల్ ద్వారా వచ్చిన లింక్ 30 నిమిషాలు మాత్రమే ఉంటుందని, ఈ సమయంలోనే ఓటింగ్ ప్రక్రియను ముగించాలన్నారు. 30 నిముషాల్లో ఓటు వేయకపోతే.. ఆటోమెటిక్‌గా లింక్ క్లోజ్ అయిపోతుందన్నారు.