Share News

వాంతులు, విరేచనాలతో 80 మందికి అస్వస్థత

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:55 AM

శ్రీకాకుళం మండలం సింగుపురంలో ఫుడ్‌ పాయిజన్‌ అయింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. రెండ్రోజుల క్రితం గ్రామంలో జాతర జరిగింది. ఆ గ్రామంతోపాటు..

వాంతులు, విరేచనాలతో 80 మందికి అస్వస్థత

  • శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామంలో రెండ్రోజుల క్రితం జాతర

  • రూ.10కే బాదం పాలు విక్రయం.. తాగినవారు ఆస్పత్రిపాలు

  • అదుపులోనే పరిస్థితి: మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం రూరల్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం మండలం సింగుపురంలో ఫుడ్‌ పాయిజన్‌ అయింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. రెండ్రోజుల క్రితం గ్రామంలో జాతర జరిగింది. ఆ గ్రామంతోపాటు.. పక్కన ఉన్న మామిడివలస గ్రామానికి చెందిన ప్రజలు జాతరలో పాల్గొన్నారు. జాతరలో బళ్లపై బాదం పాలు రూ.30 చొప్పున విక్రయించిన వారు... ఆ తర్వాత రూ.10కే ఇచ్చారు. ధర తగ్గిండంతో ఎక్కువమంది బాదంపాలు తాగారు. ఇలా తాగినవాళ్ల్లందరికీ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు తీవ్ర జ్వరం, ఆపై వాంతులు, విరేచనాలు అవుతుండటంతో సింగుపురంలో ఉన్న నాలుగు ప్రైవేట్‌ క్లినిక్‌లను ఆశ్రయించారు. కొన్ని గంటల వ్యవధిలోనే క్లినిక్‌లకు రోగుల తాకిడి పెరిగింది. ఒక్కో క్లినిక్‌కు 20మంది వరకు వెళ్లి చికిత్స పొందారు. అటు మామిడివలస గ్రామంలో ఇవే లక్షణాలతో 15 మంది క్లినిక్‌లను ఆశ్రయించారు. దీంతో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్థానికంగా కొనసాగిస్తున్న ప్రైవేటు క్లినిక్‌లను మూసివేయించి.. సింగుపురం ప్రాథమిక ఆసుపత్రికి రోగులను తరలించారు. అప్పటికే ఇంటివద్ద చికిత్స పొందుతున్నవారు ఆసుపత్రికి వెళ్లలేదు. శుక్రవారం ఉదయం ఆరుగురు, రాత్రి మరో పది మంది పీహెచ్‌సీలో చికిత్స పొందారు. మామిడివలసలో నలుగురికి డీహైడ్రేషన్‌ కారణంగా పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రెండు గ్రామాల్లో మొత్తం 80 మంది వరకు బాధితులు ఉన్నట్టు చెబుతున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌.. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని సింగుపురం పీహెచ్‌సీలో అదనపు వైద్యులు, సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు.


ఆందోళన అవసరం లేదు: మంత్రి అచ్చెన్న

సింగుపురంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అప్రమత్తమయ్యారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో శుక్రవారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముందుగా అతిసారం అని భావించామని.. కానీ ఇది ఫుడ్‌ పాయిజన్‌ అని మంత్రికి కలెక్టర్‌ వివరించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రత్యేక ప్రకటన ద్వారా మంత్రి ప్రజలకు భరోసా ఇచ్చారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమైతే ప్రత్యేక వైద్య బృందాలను గ్రామానికి పంపాలని అధికారులను ఆదేశించారు. పుడ్‌ పాయిజన్‌కు కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.

Updated Date - Apr 04 , 2026 | 03:57 AM