Tirumala: ముందస్తు చర్యలతో లక్ష మందికి అదనంగా వైకుంఠ ద్వార దర్శనాలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:05 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో గత ఏడాది కంటే ఈసారి లక్ష మంది భక్తులు అదనంగా వైకుంఠ ద్వార దర్శనాలు...
పది రోజుల్లో 7.83 లక్షల మందికి శ్రీవారి దర్శనం
రూ.41.14 కోట్ల హుండీ ఆదాయం: టీటీడీ చైర్మన్
తిరుపతి(భవానీనగర్), జనవరి 9(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో గత ఏడాది కంటే ఈసారి లక్ష మంది భక్తులు అదనంగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతేడాది పది రోజుల్లో 6.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోగా, ఈ ఏడాది 7.83 లక్షల మంది దర్శించుకున్నారని వెల్లడించారు. జనవరి 2న శుక్రవారం ఒక్క రోజే 83 వేల మంది, మరుసటి రోజు శనివారం రికార్డు స్థాయిలో 89 వేల మంది దర్శనం చేసుకున్నారని వివరించారు.
రూ.41 కోట్లు దాటిన హుండీ ఆదాయం
వైకుంఠ ద్వార దర్శనాల పది రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.41.14 కోట్లు వచ్చిందని చైర్మన్ తెలిపారు. 44 లక్షల లడ్డూలను విక్రయించామని, గత ఏడాదితో పోలిస్తే ఇది 10 లక్షలు అదనమని చెప్పారు. అలాగే 2.06 లక్షల మంది తలనీలాలు సమర్పించారన్నారు. 33 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలను అందించామంటూ, గత ఏడాదితో పోలిస్తే ఇది 39 శాతం అధికమని వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో పది రోజులపాటు 50 టన్నుల పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్‌తో ఏర్పాటు చేసిన అలంకరణలతో వైకుంఠాన్ని తలపించిందన్నారు. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా గతంలో కంటే అధికంగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు.