Share News

పంచాయతీరాజ్‌లో 77 జడ్పీ సీఈవో పోస్టులు

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:00 AM

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో 77 మంది డివిజనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్లకు జడ్పీ సీఈ వో హోదా కల్పిస్తూ డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) ఆమోదం తెలిపింది.

పంచాయతీరాజ్‌లో 77 జడ్పీ సీఈవో పోస్టులు

  • డీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ డీపీసీ ఆమోదం

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో 77 మంది డివిజనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్లకు జడ్పీ సీఈ వో హోదా కల్పిస్తూ డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) ఆమోదం తెలిపింది. ఈ పదోన్నతులు పంచాయతీరాజ్‌ చరిత్రలో ఒక మైలురాయిగా పేర్కొంటున్నారు. ఈ శాఖ ప్రారంభమైనప్పటి నుంచీ ఇతర శాఖల అధికారులే జడ్పీ సీఈవోలుగా విధులు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా 77 మంది పంచాయతీరాజ్‌ అధికారులకు ఈ హోదా కల్పించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుంచి ఎంపీడీవోల వరకూ ఒక్కో కేడర్‌కు పదోన్నతులు ఇచ్చిన ఈ శాఖ తాజాగా డీడీవోలకు జడ్పీ సీఈవోలుగా పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 1999లో గ్రూప్‌-1 కేడర్‌లో నియమితులైన ఎంపీడీవోలు మూడు దశాబ్దాల పాటు పదోన్నతులు లేకుండా అదే హోదాలో కొనసాగారు. కొంతమంది అదే పోస్టులో రిటైరయ్యారు. కూటమి సర్కారు వచ్చాక 10వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి రికార్డు సృష్టించిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌లో స్వాతంత్ర్యానంతరం ఎప్పుడు తీసుకోని సంస్కరణలు కూటమి ప్రభుత్వంలో తీసుకున్నారు. దీంతో వివిధ కేడర్లలో ఉన్న ఉద్యోగులందరికీ పదోన్నతుల భాగ్యం దక్కింది. కూటమి ప్రభుత్వం మొదటి విడతలో 53 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించి డీఎల్‌డీవోలుగా నియమించింది. సీనియర్‌ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, ఈవోపీఆర్‌ అండ్‌ ఆర్డీలకు పదోన్నతులు కల్పించి 300 మందిని ఎంపీడీవోలుగా నియమించారు. గ్రేడ్‌-1 నుంచి గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులు సుమారు 3 వేల మందికి, సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్‌-5, గ్రేడ్‌-6 కార్యదర్శులు 2వేల మందికి పైగా ప్రమోషన్లు లభించాయి. మొదటిసారి తమ శాఖతో పాటు ఇతర శాఖలకు కూడా వీరు అధికారులుగా వెళ్లే అవకాశం లభించింది. దీనిపై సీఎం, ఉపముఖ్యమంత్రి, ప్రత్యేక సీఎస్‌ శశిభూషణ్‌కుమార్‌, కమిషనర్‌ కృష్ణతేజకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సంఘం నేతలు కేఎస్‌ వరప్రసాద్‌, కేఎన్‌వీ ప్రసాద్‌, డి.వెంకట్రావు, బుజ్జి, సూర్యనారాయణ తదితులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 30 , 2026 | 05:00 AM