Share News

పెద్దిరెడ్డి అనుచరులకు చెక్‌

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:03 AM

చిత్తూరు నగర సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చెరబట్టిన విలువైన ప్రభుత్వ భూముల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పెద్దిరెడ్డి అనుచరులకు చెక్‌

  • 7.15 ఎకరాల భూమి స్వాధీనం

  • వైసీపీ హయాంలో అక్రమంగా ఆన్‌లైన్‌

  • ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

  • ఇద్దరిపై చర్యలకు కలెక్టర్‌ సిఫారసు

చిత్తూరు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగర సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చెరబట్టిన విలువైన ప్రభుత్వ భూముల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సిఫారసు చేశారు. యాదమరి మండలం జంగాలపల్లెలో సుమారు 7.15ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి అనుచరులు అక్రమంగా ఆన్‌లైన్‌ చేసుకున్నారు. రీ సర్వే సమయంలో 2022లో ఆ మండలంలో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్‌, పెద్దిరెడ్డి అనుచరుడు ప్రేమ్‌కుమార్‌, జంగాలపల్లె సర్వేయర్‌ వినోద్‌కుమార్‌ ఈ భూమిని నలుగురి పేర్లతో నమోదు చేయించారు. ప్రేమ్‌కుమార్‌, వినోద్‌కుమార్‌ తమ కుటుంబ సభ్యుల పేర్లతో 4.71 ఎకరాల్ని రాయించుకోగా, పెద్దిరెడ్డి గన్‌మన్‌ భాస్కర్‌రెడ్డి భార్య కుమారి పేరుతో 2.44 ఎకరాల్ని ఆన్‌లైన్‌ చేశారు. ఈ భూముల మొత్తం విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అక్రమాల్ని తాజాగా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, జేసీ ఆదర్శ రాజేంద్రన్‌ గుర్తించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం సంచికలో ‘పెద్దిరెడ్డి అనుచరుల చేతివాటం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఆన్‌లైన్‌లో నలుగురి పేర్లను తొలిగించి ఆ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చాలని జేసీ ఆదర్శ రాజేంద్రన్‌ బుధవారం ఆదేశాలిచ్చారు. ఈ అక్రమాలకు కారకులైన కమ్యూనిటీ సర్వేయర్‌ ప్రేమ్‌కుమార్‌, సచివాలయ సర్వేయర్‌ వినోద్‌కుమార్‌పై కేసు నమోదుకు సిఫారసు చేసినట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


ఉదయం బదిలీ..సాయంత్రానికి అదే పోస్టులోకి..

2022 రీసర్వే సమయంలో యాదమరి మండలంలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్లతో ఆన్‌లైన్‌ చేశారనే విషయం తాజాగా గుప్పుమంది. అప్పట్లో తహసీల్దార్‌ చిట్టిబాబు, వైసీపీ మండల ప్రజాప్రతినిధి అండతో రికార్డులు మార్చారని ప్రచారం ఉంది. ఆ ప్రజాప్రతినిధి బినామీ పేర్లతో పీఈఎస్‌ స్కూల్‌ సమీపంలో వంద ఎకరాలు ఆన్‌లైన్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. తహసీల్దార్‌ను అప్పటి ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు బదిలీ చేయిస్తే, ఆ మండల ప్రజాప్రతినిధి పెద్దిరెడ్డి సహకారంతో అదేరోజు సాయంత్రానికి మళ్లీ అక్కడికే పోస్టింగ్‌ తెప్పించారు. దీన్నిబట్టి ప్రజాప్రతినిధి-తహసీల్దార్‌ బంధం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.

తహసీల్దార్‌పై చర్యలేవీ..?

7.15ఎకరాల విషయంలో తహసీల్దార్‌ చిట్టిబాబు పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో అక్రమంగా ఆన్‌లైన్‌ చేసింది ఆయనే. అయినా, చిట్టిబాబుకు వ్యతిరేకంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. కనీసం సిఫారసు కూడా చేయలేదు. ఆయన ఇప్పుడు సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ కేంద్రంలో తహసీల్దార్‌గా పనిచేస్తుండడం విశేషం.

Updated Date - Mar 26 , 2026 | 04:03 AM