Share News

విశాఖలో కుప్పకూలిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి

ABN , Publish Date - Apr 27 , 2026 | 06:19 AM

నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

విశాఖలో కుప్పకూలిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి

  • ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

ఆటోనగర్‌ (విశాఖపట్నం), ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విశాఖ నగరం ఆటోనగర్‌ డి-బ్లాక్‌ తుంగ్లాం సమీపంలోని చుక్కవానిపాలెం వద్ద ఆదివారం జరిగింది. ఆటోనగర్‌ అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తల వినతి మేరకు సుమారు పదేళ్ల కిందట రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు. రైల్వే యంత్రాంగం తమ పరిధిలోని పనులను పూర్తిచేయగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సేతుబంధన్‌ ప్రాజెక్టులో భాగంగా రూ.26 కోట్ల వ్యయంతో ఆర్‌అండ్‌బీ అధికారులు రెండేళ్ల కిందట పనులు ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా డెకింగ్‌ ఏర్పాటు చేసి కాంక్రీటు వేస్తుండగా మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో పెద్ద శబ్దం రావడంతో సమీపంలో క్రికెట్‌ ఆడుకుంటున్న తుంగ్లాం గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలసి శకలాల తొలగింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Apr 27 , 2026 | 06:20 AM