7 లేదా 8
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:50 AM
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏడు లేదా ఎనిమిది వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానం పెరిగే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల పునర్విభజనలో ఉమ్మడి కృష్ణాజిల్లా కాస్తా ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలుగా విడిపోయింది. అప్పటి నుంచి పలు నియోజకవర్గాలు భౌగోళిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. గ్రేటర్ విజయవాడ అంశం కూడా తెర మీదకు రావడంతో ఈ రెండు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపునకు కేంద్రం కసరత్తుతో చేయడంతో నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
- ఉమ్మడి కృష్ణాలో పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు
- అదనంగా ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి అవకాశం
- ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నార్త్, విజయవాడ రూరల్, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం ఛాన్స్
- కృష్ణాజిల్లాలో ఉయ్యూరు, చల్లపల్లి, మొవ్వ నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం
- పార్లమెంట్ నియోజకవర్గంగా నూజివీడుకు ఎక్కువ అవకాశాలు
- దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపునకు కేంద్రం కసరత్తుతో సర్వత్రా చర్చ
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏడు లేదా ఎనిమిది వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానం పెరిగే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల పునర్విభజనలో ఉమ్మడి కృష్ణాజిల్లా కాస్తా ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలుగా విడిపోయింది. అప్పటి నుంచి పలు నియోజకవర్గాలు భౌగోళిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. గ్రేటర్ విజయవాడ అంశం కూడా తెర మీదకు రావడంతో ఈ రెండు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపునకు కేంద్రం కసరత్తుతో చేయడంతో నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో ప్రస్తుతం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో కలిశాయి. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజవర్గాలతో పాటు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు కలిపి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కృష్ణాజిల్లాలో మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ, పామర్రు, పెనమలూరు, గన్నవరం కలిపి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఏలూరు జిల్లాలో కలిసిన కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణాజిల్లాలో కలపాలని, నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న డిమాండ్ ప్రజల నుంచి తీవ్రంగా ఉంది. నూజివీడు నియోజకవర్గాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి తీసుకు వచ్చేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు ప్రస్తుత కృష్ణాజిల్లాలో ఉన్న పెనమలూరు, గన్నవరం ప్రాంతాలను గ్రేటర్ విజయవాడ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌తో పాటు ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ కూడా ప్రజల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త నియోజవర్గాల విభజన అనేది ఏ విధంగా ఉండబోతోందన్నది ఎంతో ఆసక్తిగా మారింది.
పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య
జిల్లాల పునర్విభజన ఇబ్బందులు, విజయవాడ గ్రేటర్ అంశాలను ప్రాతిపదికగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణాజిల్లాకు ఏడు నుంచి ఎనిమిది నూతన అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం కనిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, కృష్ణాజిల్లాలో మూడు అదనంగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
ఎన్టీఆర్ జిల్లాలో పెరగనున్న నియోజకవర్గాలు!
కంచికచర్ల నియోజకవర్గం కొత్తగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత నందిగామ నియోజకవర్గంలో నందిగామ పార్ట్-1, చందర్లపాడు, కంచికచర్ల వీరులపాడు మండలాలు ఉన్నాయి. అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు, వత్సవాయి, జగ్గయ్యపేట, నందిగామ పార్ట్-2 మండలాలు ఉన్నాయి. నందిగామ అతిపెద్దగా ఉండటంతో.. ఆ నియోజకవర్గాన్ని కొనసాగిస్తూనే.. కొత్తగా కంచికచర్ల నియోజకవర్గం ఏర్పాటు చేయడానికి అవకాశం కనిపిస్తోంది. గతంలో కంచికచర్ల నియోజకవర్గం ఉండేది. దాని స్థానంలో నందిగామ ఏర్పడింది. కొత్తగా కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడులతో కలిపి కంచికచర్ల నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక పోతే ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కూడా అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నం, జీ కొండూరు మండలాలతో పాటు కొండపల్లి మునిసిపాలిటీని కూడా అంతర్భాగంగా సరికొత్త నియోజకవర్గం ఆవిర్భవించడానికి అవకాశం కలుగుతోంది. నగరంలో ప్రస్తుతం తూర్పు, పశ్చిమ, సెంటల్ర్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఓటర్ల సంఖ్య ఎనిమిది లక్షల పైచిలుకు ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలో కొత్త నియోజకవర్గానికి అవకాశం ఏర్పడింది. మండలాల ప్రాతిపదికన చూస్తే తూర్పు, పశ్చిమ, సెంట్రల్, నార్త్ మండలాలు ఉన్నాయి. ఇదే ప్రాతిపదికన విజయవాడ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలతో విజయవాడ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. విజయవాడ సౌత నియోజకవర్గానికి అవకాశం లేదు. ఎందుకంటే కృష్ణానది ఉండటం వల్ల ఇది సాఽధ్యం కాదు. ఇక పోతే విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న గుణదల ప్రాంతాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కలపడానికి అవకాశం కనిపిస్తోంది. ఇది అంతర్గత సర్దుబాటుగా ఉండవచ్చు. గవర్నర్‌పేట, సూర్యారావుపేట విజయవాడ సెంట్రల్ పరిధిలో ఉన్నాయి. లబ్బీపేటలో కొంతభాగం ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది. గుణదల ప్రాంతాన్ని కాదనుకుంటే మాత్రం కృష్ణలంకను కూడా సెంట్రల్ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇలాంటపుడు విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధి తగ్గే అవకాశం ఉంది కాబట్టి పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ విజయవాడ ప్రతిపాదిత ప్రాంతాలను తూర్పు నియోజకవర్గ పరిధిలోకి తీసుకురావచ్చు. ఇలా చేయటం ద్వారా రెండు జిల్లాలో ఉన్నాయనుకుంటున్న విజయవాడ గ్రేటర్ చిక్కుముడులు కూడా వీడి పరిష్కారం లభిస్తుంది.
కొత్తగా విజయవాడ రూరల్ నియోజకవర్గం!
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో విజయవాడ రూరల్ నియోజకవర్గం ప్రత్యేకంగా ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే విజయవాడ రూరల్ మండలంలో లక్షన్నర మంది ఓటర్లు ఉన్నారు. విజయవాడ రూరల్ మండలం ప్రస్తుతం మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో చెరి సగంగా ఉంది. మైలవరం నియోజకవర్గంలో 2.88 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇబ్రహీంపట్నం, జీ కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లోని 2.30 లక్షల మంది ఓటర్లతో పాటు.. విజయవాడ రూరల్ మండలంలోని పార్ట్-1 గ్రామాలు గొల్లపూడి, రాయనపాడు, పైడూరుపాడు, రామరాజ్యనగర్, వైఎస్‌ఆర్, జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి పంచాయతీలలోని 58 వేల ఓటర్లతో కలిపి మొత్తంగా 2.88 లక్షల ఓటర్లు ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలో విజయవాడ రూరల్ మండలం పార్ట్-2లో రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, నున్న, సూరంపల్లి, పాతపాడు, ఫిర్యాది నైనవరం తదితర గ్రామాలలో లక్షకు పైగా ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఈ రెండు పార్ట్‌లను కలిపి విజయవాడ రూరల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది.
కృష్ణాజిల్లాలో పెరగనున్న నియోజకవర్గాలు!
కృష్ణాజిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గాన్ని రెండుగా విభజించే అవకాశం ఉంది. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, ఘంటసాల, చల్లపల్లి మండలాలు ఉన్నాయి. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మండలాలతో కలిపి అవనిగడ్డ నియోజకవర్గం కొనసాగుతుంది. ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాలతో చల్లపల్లి నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. పామర్రు నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం తోట్లవల్లూరు, పమిడిముక్కల, పామర్రు, పెదపారుపూడిలతో పాటు మొవ్వ మండలం కూడా ఉంది. మొవ్వ మండలంతో పాటు పెడన నియోజకవర్గం పరిధిలో ఉన్న గూడూరు మండలాన్ని కలిపి మొవ్వ నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గం అతిపెద్దగా ఉంది. యనమలకుదురు, తాడిగడప, కానూరు, పోరంకి, పెనమలూరు, గోసాల, వణుకూరు, గంగూరు తదితర ప్రాంతాలతో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా ఉంది. కొత్తగా ఉయ్యూరు నియోజకవర్గం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఉయ్యూరు నియోజకవర్గం ఉండేది. దీని స్థానంలో పెనమలూరు నియోజకవర్గం ఏర్పడింది. ఉయ్యూరు మండలంలో 70 వేల మంది ఓటర్లు ఉన్నారు. కంకిపాడు మండలంలో కూడా మరో 70 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు మండలాలతో పాటు పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలాన్ని కూడా కలిపి కొత్తగా ఉయ్యూరు నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం కనిపిస్తోంది.
పార్లమెంట్ నియోజకవర్గంగా నూజివీడు!
నూజివీడు పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం కనిపిస్తోంది. పూర్వం గుడివాడ పార్లమెంట్ స్థానం కూడా ఉండేది. ప్రస్తుతం భౌగోళిక పరిస్థితుల రీత్యా గుడివాడ పార్లమెంట్ స్థానానికి అవకాశం కనిపించడంలేదు. నూజివీడు నియోజకవర్గాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లాలో విలీనం చేయటానికి చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కాబట్టి నూజివీడు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో కలిసే అవకాశం ఉంది. ఇలాంటపుడు ఎన్టీఆర్ జిల్లాకు అదనంగా మరో పార్లమెంట్ నియోజకవర్గం కలిసే అవకాశం ఉంది. నూజివీడు పార్లమెంట్ నియోజకవర్గం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నూజివీడు, గన్నవరం, తిరువూరు, మైలవరం, విజయవాడ రూరల్ (కొత్తగా ఏర్పాటు చేస్తే) కలపవచ్చు. కృష్ణాజిల్లాలోకి కైకలూరు నియోజకవర్గం కూడా రానుంది.
మహిళలకు 33 శాతం కేటాయింపు
మహిళలకు 33శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన అసెంబ్లీ సీట్లను కేటాయించనున్నారు. మహిళలకు కేటాయించబోయే సీట్లపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, గన్నవరం, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలు మహిళలకు కేటారుస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదు. వీటికి సంబంధించి ఇప్పుడే స్పష్టత రాదు.
పెరగ నున్న ఎస్సీ నియోజకవర్గాలు
ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు, నందిగామ నియోజకవర్గాలు ఇప్పటికే ఎస్సీ రిజర్వుడుగా ఉన్నాయి. కృష్ణాజిల్లాలో పామర్రు నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడులో ఉంది. ఓటర్ల నిష్పత్తి ప్రకారం కృష్ణాజిల్లాలో కూడా పెరగనున్న నియోజకవర్గాల ప్రకారం అదనంగా ఎస్సీలకు మరో నియోజకవర్గాన్ని రిజర్వుడు చేసే అవకాశం ఉంది.