మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:44 AM
ఓడలరేవు నుంచి చేపల వేటకు వెళ్లి తిరిగిరాని ఏడుగురు మత్స్యకారుల కోసం నేవీ, కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా భారీ సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్‌ఎఆర్) ఆపరేషన్ చేపట్టాయి.
రంగంలోకి కోస్టుగార్డు నౌకలు, డార్నియర్ విమానాలు
విశాఖపట్నం, అమలాపురం, అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఓడలరేవు నుంచి చేపల వేటకు వెళ్లి తిరిగిరాని ఏడుగురు మత్స్యకారుల కోసం నేవీ, కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా భారీ సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్‌ఎఆర్) ఆపరేషన్ చేపట్టాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు సముద్రతీరం నుంచి ఈ నెల 3న కొప్పనాటి రామకృష్ణవర్మ మరో ఆరుగురితో కలిసి బోటుపై సముద్రంలోకి వెళ్లారు. పది రోజుల్లో తిరిగి వస్తామని చెప్పి వెళ్లినవారు... ఇప్పటివరకూ జాడలేరు. దీంతో కుటుంబ సభ్యులు మెరైన్ పోలీసులను ఆశ్రయించారు. రామకృష్ణవర్మ సోదరుడు భవానీశంకర్ ఫిర్యాదుతో కోస్టల్ సెక్యూరిటీ విభాగం రంగంలోకి దిగింది. కోస్టల్ సెక్యూరిటీ ఇన్‌చార్జి ఐజీ గోపీనాథ్ జట్టి ఆదేశాల మేరకు నావికాదళం, కోస్ట్‌గార్డ్ అధికారులు సమన్వయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కోస్ట్‌గార్డ్‌కు చెందిన 5 నౌకలు, 2 డార్నియర్ విమానాలు తీరం నుంచి వందల నాటికల్ మైళ్ల దూరం వరకు వెళ్లి శోధిస్తున్నాయి. నేవీకి చెందిన 3 నౌకలు, 2 విమానాలు పారాదీప్, పశ్చిమబెంగాల్ విశాఖపట్నం-ఓడలరేవు మార్గాల్లో గాలిస్తున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ మెరైన్ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది: అచ్చెన్న
మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం ఓడలరేవులోని బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం బాధితులకు పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పారాదీ్‌పకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ముత్యాలమ్మ పేరుతో పసుపు రంగు బోటును గుర్తించామని, అది ఓడలరేవుకు చెందిన మత్స్యకారులదో కాదో నిర్థారించేందుకు ప్రత్యేక బృందం పనిచేస్తోందని చెప్పారు. సముద్ర వాతావరణం అనుకూలంగా ఉండటంతో వారంతా క్షేమంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
గాలింపు చర్యలపై సీఎం ఆరా
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులతో సీఎం వర్చువల్‌గా మాట్లాడారు. గాలింపు చర్యలు ఎలా సాగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాలను మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.