Share News

కైలాసగిరిపై 65 అడుగుల త్రిశూలం!

ABN , Publish Date - May 03 , 2026 | 05:14 AM

విశాఖపట్నానికి ‘కైలాసగిరి’ ప్రత్యేక పర్యాటక ఆకర్షణ. ఆ పరమశివుడి ఆయుధమైన త్రిశూలాన్ని ఢమరుకంతో సహా ఏర్పాటుచేసి దానికి మరింత ఆధ్యాత్మికత జోడించింది విశాఖ మహా నగర పాలక సంస్థ.

కైలాసగిరిపై 65 అడుగుల త్రిశూలం!

  • దానికి 18 అడుగుల వెడల్పైన ఢమరుకం

  • 2.5 కోట్ల వ్యయంతో వీఎంఆర్‌డీఏ నిర్మాణం

  • రాత్రిళ్లు కనిపించేలా ఎల్‌ఈడీ లైట్ల అమరిక

విశాఖపట్నం, మే 2(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి ‘కైలాసగిరి’ ప్రత్యేక పర్యాటక ఆకర్షణ. ఆ పరమశివుడి ఆయుధమైన త్రిశూలాన్ని ఢమరుకంతో సహా ఏర్పాటుచేసి దానికి మరింత ఆధ్యాత్మికత జోడించింది విశాఖ మహా నగర పాలక సంస్థ. కైలాసగిరిపై పర్యాటకులకు మరిన్ని వింతలు, విశేషాలు, ఆకర్షణలు కల్పించాలని సీఎం చంద్రబాబు చేసిన సూచన మేరకు ‘త్రిశూలం’ ప్రాజెక్టుకు వీఎంఆర్‌డీఏ శ్రీకారం చుట్టింది. హనుమంతవాక వైపు స్పష్టంగా కనిపించేలా, తెలుగు మ్యూజియానికి దగ్గరగా భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేసింది. దీనివల్ల ఆ మ్యూజియానికి కూడా సందర్శకులు పెరుగుతారని అధికారుల ఆలోచన. ఈ ప్రాజెక్టుకు రూ.2.5 కోట్లు వ్యయం చేశారు. పగలే కాకుండా రాత్రిపూట కూడా త్రిశూలం ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం వరకు కనిపించేలా అందులో ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. దాదాపు 65 అడుగుల ఎత్తున త్రిశూలం, దానికి 18 అడుగుల వెడల్పున ఢమరుకాన్ని నిర్మించారు. 300 కి.మీ. వేగంతో గాలులు వీచినా ఈ రెండూ చెక్కు చెదరకుండా ఉండేందుకు కింద రూ.1.75 కోట్లతో గట్టి పునాదులు వేసి, పర్యాటకులు కూర్చొనేందుకు వీలుగా వేదిక నిర్మించారు. ఇది సముద్ర మట్టానికి 365 అడుగుల ఎత్తులో ఉంది. గతేడాది ఆగస్టు 18న పనులు ప్రారంభించి ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తిచేశారు. పర్యాటకుల కోసం సెల్ఫీ పాయింట్లు కూడా పెట్టారు. దీనిని త్వరలోనే ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తామని వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ తెలిపారు.

Updated Date - May 03 , 2026 | 05:15 AM