కొనసాగుతున్న ఉగ్ర వేట!
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:30 AM
ఏపీ సహా దేశంలోని పలు ఇతర రాష్ట్రాలకు విస్తరించిన ఉగ్రవాద నెట్‌వర్క్ మూలాలపై విజయవాడ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. తాజాగా ‘బెనెక్స్ కామ్ గ్రూపు’నకు మరో ఆరుగురు ఉగ్ర సానుభూతిపరులను...
దేశవ్యాప్త నెట్‌వర్క్‌లో మరో ఆరుగురు అరెస్టు
పలు రాష్ట్రాల్లో అదుపులోకి.. విజయవాడకు తరలింపు
కోర్టుకు హాజరు.. రిమాండ్
12కు చేరిన ఉగ్రవాద సానుభూతిపరుల అరెస్టులు
విజయవాడ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఏపీ సహా దేశంలోని పలు ఇతర రాష్ట్రాలకు విస్తరించిన ఉగ్రవాద నెట్‌వర్క్ మూలాలపై విజయవాడ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. తాజాగా ‘బెనెక్స్ కామ్ గ్రూపు’నకు మరో ఆరుగురు ఉగ్ర సానుభూతిపరులను వివిధ రాష్ట్రాల్లో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై ఇక్కడకు తీసుకొచ్చారు. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నారు. ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్ (ఏ7), రాజస్థాన్‌కు చెందిన జిషాన్ (ఏ9), పశ్చిమ బెంగాల్‌కు చెందిన మీరా ఆసిఫ్ అలీ (ఏ10)తో పాటు మహారాష్ట్రలో అరెస్టు చేసిన షారుక్ ఖాన్ (ఏ12), షేక్ ఫిజర్(ఏ13)లను శుక్రవారం స్థానిక చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి బి.రాధారాణి ముందు హాజరుపరచగా.. ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. వారితోపాటు అరెస్టు చేసిన బిహార్‌లోని పట్నాకు చెందిన ఓ బాలుడి ప్రిన్సిపల్ జువనైల్ బోర్డు న్యాయాధికారి రాధిక ముందు హాజరుపరిచారు. ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 12కి చేరింది.
వివిధ పేర్లతో సోషల్ మీడియా ఖాతాలు
నిందితులు ఒక్కొక్కరు వివిధ పేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ విజయ్‌విహార్ ఫేజ్ 1కి చెందిన లక్కీ అహ్మద్ బెనెక్స్ గ్రూపునకు వారియర్‌గా ప్రకటించుకున్నాడు. బెనెక్స్ వారియర్, ఉస్మాన్ అహ్మద్ అలియాస్ పాండ, అల్ ఒమర్ అహ్మద్ అల్ హిందీ, అల్ ఒమర్, బడే లాగ్, డీఆర్‌ఎక్స్‌ఎన్ వారియర్, ఇస్లామిక్.స్టేట్.ఏఎఫ్ పేరుతో ఇన్‌స్టా అకౌంట్లు నిర్వహిస్తున్నాడు. బిహార్‌కు చెందిన 16ఏళ్ల బాలుడు ఐదు పేర్లతో ఖాతాలు నడుపుతున్నాడు. జోధ్‌పూర్‌కు చెందిన జిషాన్ అబ్దుల్ మాజిద్ తన అసలు పేరుతో అకౌంట్ నిర్వహిస్తున్నాడు. పుణెకు చెందిన షారూక్ ఖాన్... ఖలీద్ ఖాన్, డీఆర్‌ఎక్స్‌ఎన్.ఖలీద్, ఖలీద్ ఖాన్ అల్ హిందీ పేర్లతో పోస్టింగ్‌లు చేస్తున్నాడు. మరో నిందితుడు మాలిక్, జిహాదీ జాన్, ఫయాజ్ అల్ పేర్లతో సోషల్ అనే ఖాతాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ..
నిందితుల్లోని షారూక్ ఖాన్ బిహార్ వాసి. తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. వారి కుటుంబంలోనే ఉన్నత విద్య పూర్తి చేసిన షారుక్‌ఖాన్.. మహారాష్ట్రలోని పుణెలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోపక్క సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. షారూక్ అరెస్టు తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు విజయవాడకు చేరుకున్నారు.
పోస్టింగ్ పెడితే ‘ఉపా’ పెడతారా?
ఉగ్ర సంస్థలకు ప్రచారం చేస్తున్న యువకులు చట్టాలపైనా అవగాహన పెంచుకుంటున్నట్టు తెలుస్తోంది. వారిని అరెస్టు చేసినప్పుడు పోలీసులకే రివర్స్ ప్రశ్నలు వేసినట్టు సమాచారం. నిందితుల్లో కొంతమంది ఉన్నత కుటుంబాలకు చెందిన వారూ ఉన్నారు. బిహార్‌కు చెందిన దిల్క్‌షను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా.. అతను తల్లిదండ్రులకు నీట్ కోచింగ్ తీసుకుంటున్నట్టు చెబుతూ పట్నాలో ఉగ్ర ప్రచారం చేస్తున్నాడని తెలిసింది. బిహార్‌లోని దర్భంగాకు చెందిన దిల్కష్ తల్లీదండ్రులు ఉపాధ్యాయులు. వారికి ఒక్కడే కుమారుడైన దిల్కష్.. ఇంటర్మీడియట్ తర్వాత నీట్ పరీక్ష రాశాడు. ర్యాంకు రాకపోవడంతో కోచింగ్ కోసం అంటూ పట్నా వెళ్లాడు. అయితే అక్కడ ఓ గది అద్దెకు తీసుకుని.. కోచింగ్‌కు వెళ్లకుండా సామాజిక మాధ్యమాల్లో పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థల నేతల ప్రసంగాల వీడియోలను పోస్టు చేస్తున్నాడు. అతడి గదిలో ఉగ్రవాద సాహిత్య పుస్తకాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారని తెలిసింది. పోలీసులు అరెస్టు చేసినట్టు నోటీసు ఇవ్వగానే.. తాను సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెడితే ఉపా చట్టం కింద కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించినట్టు తెలిసింది. ఐటీ చట్టం కింద నమోదు చేయాల్సిన కేసుకు ఉపా చట్టాన్ని ఎలా వర్తింపజేస్తారు అని అడిగినట్టు సమాచారం.