చిట్టి తల్లిని కాపాడరూ!
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:08 AM
కూలికెళ్తే కాని కుండ కాలని దైన్యం. భర్త అనారోగ్యంతో చనిపోయినా, ఇద్దరు ఆడబిడ్డలనూ రెక్కల కష్టంతో పోషించుకుంటూ వస్తున్న ఆ తల్లికి తట్టుకోలేని కష్టమొచ్చింది.
పవన్, లోకేశ్‌లకు ఓ తల్లి వేడుకోలు
చిన్నారిని కబళిస్తున్న అంతుచిక్కని వ్యాధి
స్తోమత లేక ఆసుపత్రులకు వెళ్లని వైనం
ములకలచెరువు, జూలై 3(ఆంధ్రజ్యోతి): కూలికెళ్తే కాని కుండ కాలని దైన్యం. భర్త అనారోగ్యంతో చనిపోయినా, ఇద్దరు ఆడబిడ్డలనూ రెక్కల కష్టంతో పోషించుకుంటూ వస్తున్న ఆ తల్లికి తట్టుకోలేని కష్టమొచ్చింది. ఐదేళ్ల చిన్నారిని కబళిస్తున్న రోగమేంటో తెలియక, వైద్యం ఎలా చేయించాలో అర్థంకాక అల్లాడిపోతోంది. సాయం కోసం దీనంగా వేడుకుంటోంది. ససాని విజయమ్మది అన్నమయ్య జిల్లా ములకలచెరువు, రాజీవ్ కాలనీ. భర్త ఆంజనేయులు... 11 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలు... ఏడేళ్ల చిట్టి, ఐదేళ్ల చంద్రిక. ఏడాది వయస్సు వచ్చే వరకూ బానే ఉన్న చంద్రికను రెండో ఏడు నుంచే అంతుచిక్కని అనారోగ్యం వేధిస్తోంది. ఒళ్లంతా నల్లటి మచ్చలు. ఎడమ కంటిపై పెద్ద పుండు. మెల్లగా చూపు చీకటయ్యింది. విలవిలలాడుతున్న చంద్రకను చూస్తూ ఆ కన్నతల్లి కన్నీరుమున్నీరవుతోంది. ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక, ఏం చేయాలో పాలుపోక ‘నా బిడ్డను రక్షించండయ్యా’ అంటూ వేడుకుంటోంది. చిన్నారి పరిస్థితి రోజు రోజుకూ క్షీణిస్తుండడంతో కూలి పనులకూ వెళ్లలేని దుస్థితి. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ చొరవ చూపాలని, చిట్టి తల్లి చంద్రికను రక్షించాలని ఆతల్లి అర్థిస్తోంది.