5న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాలుగో మహాసభలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:27 AM
ఈ నెల 5న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఏపీ జేఏసీ అమరావతి నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జేఏసీ నేతలు ఉద్యోగ, పెన్షనర్లకు పిలుపునిచ్చారు.
విజయవాడ (గాంధీనగర్), ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఈ నెల 5న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఏపీ జేఏసీ అమరావతి నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జేఏసీ నేతలు ఉద్యోగ, పెన్షనర్లకు పిలుపునిచ్చారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో మహాసభల పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడారు. ఉదయం 9 గంటలకు లెనిన్ సెంటర్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలో జేఏసీ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక ఉంటుందని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉప సంఘ సభ్యులైన మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని వెల్లడించారు. 2017లో తిరుపతిలో 17 శాఖల ఉద్యోగ సంఘాలతో ఆవిర్భవించిన జేఏసీ ప్రస్తుతం 96 శాఖల సంఘాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద జేఏసీగా ఎదిగిందని తెలిపారు. ఈ మహాసభలకు హాజరయ్యేందుకు వీలుగా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసిన కూటమి ప్రభుత్వానికి నేతలు కృతజ్ఞతలు తెలిపారు.