గోదావరి పుష్కరాలకు రూ.580 కోట్లు
ABN , Publish Date - Jul 05 , 2026 | 04:59 AM
రానున్న గోదావరి పుష్కరాలకు రూ.580 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు.
తొలి దశ నిధులు విడుదల
నదీ కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యం: మంత్రి నారాయణ
రాజమహేంద్రవరం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రానున్న గోదావరి పుష్కరాలకు రూ.580 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో శనివారం ఆయన పుష్కరాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరంలో అభివృద్ధి పనులకు తొలి దశ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధులు విడుదల చేశామన్నారు. పుష్కరాలకు వచ్చే నిధులతో శాశ్వత ప్రాతిపాదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. తొలి దశ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు ఇస్తోందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనులను ప్రతిపాదిస్తే ఈ నెల 11న మరోసారి వచ్చి వాటిని పరిశీలించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. గోదావరి నది కాలుష్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని నారాయణ తెలిపారు. నగరంలో రూ.140 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ నిర్మిస్తే నదీ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చనే ఆలోచన చేస్తున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నా పుష్కరాలకు అవసరమైన నిధుల సమీకరణలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎంపీ పురందేశ్వరి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు రాబట్టడానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.