Share News

‘సర్వే’లో అధికార కల్లోలం

ABN , Publish Date - Mar 09 , 2026 | 05:43 AM

గత వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌వో), గ్రామ సర్వేయర్‌(వీఎస్‌) సహా లక్షకుపైగా ఉద్యోగ నియామకాలు జరిపారు.

‘సర్వే’లో అధికార కల్లోలం

  • ఒక్కరోజే 56 మంది గ్రామ సర్వేయర్లను సస్పెండ్‌ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వారంతా గ్రామ సర్వేయర్ల సంఘంలో జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. గ్రామ సచివాలయంలోని సహఉద్యోగులతో సమానంగా వేతనాలు, పదోన్నతులు కల్పించాలని కోరడమే వారి పాపమైంది.

  • ఒక్కరోజే 56 మంది సర్వేయర్ల సస్పెన్షన్‌

  • చిరుద్యోగులపై ఉన్నతాధికారుల బలప్రదర్శన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌వో), గ్రామ సర్వేయర్‌(వీఎస్‌) సహా లక్షకుపైగా ఉద్యోగ నియామకాలు జరిపారు. నియామకాల సమయంలో గ్రామ కార్యదర్శులు, వీఆర్‌వోలు, ఇతర విభాగాల పోస్టులను గ్రేడ్‌-2 కేటగిరీలో భర్తీ చేశారు. నియామక పత్రాలు, వేతన ఖరారు అదే ప్రాతిపదికన జరిగింది. కానీ గ్రామ సర్వేయర్ల విషయంలో నాటి సర్వే ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వక తప్పులకు పాల్పడినట్లుగా కనిపిస్తోంది. వీరికి గ్రేడ్‌-2కు బదులుగా గ్రేడ్‌-3 ఫిక్స్‌ చేశా రు. దీనిపైనే అప్పట్లో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ అభ్యంతరాలు తెలిపారు. సరి చేస్తామని ప్రభుత్వానికి నివేదించినా, అ తర్వాత అధికారులు చేసిందేమీ లేదు.

ఏమిటీ సమస్య?

గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వీఆర్‌వోలు గ్రేడ్‌-2 కేటగిరీ నుంచి గ్రేడ్‌-1కు సులువుగా పదోన్నతి పొందగలుగుతున్నారు. కానీ, గ్రామ సర్వేయర్లకు మాత్రం పరీక్షల్లో పాస్‌ అయితేనే పదోన్నతులు అంటూ షరతులు పెట్టారు. ఆ పరీక్షల్లో కేవలం ఐదారు వేల మందే పాస్‌ అవుతున్నారు. దీం తో తమకు పరీక్షా విధానం తొలగించాలని సర్వేయర్లు కోరుతున్నారు. గ్రామ సచివాలయంలో మిగతా పోస్టు ల మాదిరిగానే తమకు కూడా పదోన్నతులు కల్పించే లా వెంటనే గ్రేడ్‌-1కు అప్‌గ్రేడ్‌ చేయాలని కోరుతున్నా రు. గ్రామ పంచాయతీలోని ఇతర ఉద్యోగులతో సమానంగా ‘బేసిక్‌ పే’ ను రూ.30 వేలకు పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో రీ సర్వే జరుగుతున్నందున.. రెవెన్యూ, సర్వే పనులు తప్ప మరొకటి అప్పగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ల్యాప్‌టా్‌పలు, రోవర్లు, ఇతర సామగ్రి అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. బకాయిలను చెల్లించాలని కోరుతున్నారు.


పరిష్కారం బదులు బలప్రదర్శన

గ్రామ సర్వేయర్ల డిమాండ్లలో ఏ ఒక్కటీ గొంతెమ్మ కోరిక లేదు. గతంలో సర్వే ఉన్నతాధికారి చేసిన తప్పుల వల్లే వాళ్లకు గ్రేడ్‌-2కు బదులు గ్రేడ్‌-3 వచ్చిం ది. దాన్ని సరి చేయమంటున్నా రు. రూల్‌ పొజిషన్‌, ఇతరుల ప్రయోజనాలను గుర్తించి, సమస్యను పరిష్కరించే వీలుంది. దీని కి ఉన్నతస్థాయి అధికారులు అంటే, సీసీఎల్‌ఏ, సర్వే డైరెక్టర్లు దృష్టి సారించాలి. గతంలో సర్వే ఉన్నతాధికారి చేసిన గ్రేడ్‌ ఫిక్సేషన్‌ను సరిదిద్దడం బ్రహ్మ పదార్థం కానేకాదు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలకు ఇప్పటికే ఇస్తున్నారు. అధికారులు శ్రద్ధపెట్టి పరిష్కరించే అంశాలే ఇవన్నీ. కానీ, అధికారులు సమ్మె చేయడానికి, ఆందోళనలు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. మాట వినని వారిని సస్పెండ్‌ చేయండి.. అంటూ సర్వే డైరెక్టర్‌తో జిల్లాల సర్వే, సెటిల్‌మెంట్‌ అధికారులకు ఆదేశాలు ఇప్పించారు. వారు జిల్లాల వారీగా గ్రామ సర్వేయర్‌ల అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇలా.. 28 జిల్లాల పరిధిలో 56 మంది గ్రామ సర్వేయర్లను విధుల నుం చి సస్పెండ్‌ చేస్తూ శనివారం ఆదేశాలు ఇచ్చారు. సర్వేయర్ల సస్పెన్షన్లపై నిర్ణయం తీసుకోవడానికి ముందు సీసీఎల్‌ఏ, సర్వే డైరెక్టర్‌లు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను ఈ ప్రక్రియలో భాగస్వామిని చేయా లి. కానీ, మంత్రికి తెలియకుండానే సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన మంత్రి సర్వేయర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడారు. సస్పెన్షన్‌ల విషయం తెలిసి మంత్రి అవాక్కయ్యారు. దీనిపై శనివారం సాయంత్రం రెవెన్యూ, సర్వే అధికారులతో మంత్రి మాట్లాడారు. తనకు తెలియకుండా సస్పెన్షన్‌ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ వారి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే విషయమై మంత్రి అనగాని సర్వే ఉద్యోగులతో మాట్లాడినట్లు తెలిసింది. జరిగిన దానిపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. సస్పెన్షన్లు ఎత్తి వేస్తామని, సోమవారం అంతా విధులకు హాజరు కావాలని కోరినట్లు తెలిసింది. ‘‘మంగళవారం సర్వే అసోసియేషన్‌ ప్రతినిధులు విజయవాడకు రండి. నేనే స్వయంగా చర్చలు జరుపుతా. మీ సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకుంటా’’ అని మంత్రి అనగాని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Updated Date - Mar 09 , 2026 | 05:43 AM