పండుగ వేళ పస్తులు..!
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:03 AM
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి నెల జీతం ఇప్పటికీ అందకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
50 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు నిలిచిన జీతాలు
ఆయా శాఖల అధికారులు ‘నిధి పోర్టల్’లో వివరాలు నమోదు చేయకపోవడమే కారణం
వేతనాలు రాక కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులు
ఫిబ్రవరి నెల బంద్.. మార్చి జీతమూ అనుమానమే!
(గుంటూరు సిటీ-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి నెల జీతం ఇప్పటికీ అందకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘నిధి పోర్టల్’ ద్వారా కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు కూడా నమోదు చేసి, బిల్లులు సమర్పించాలని ఆదేశించింది. అనేక శాఖల్లోని అధికారులు కాంట్రాక్టు ఉద్యోగుల పూర్తి వివరాలు, క్యాడర్ స్ర్టెంగ్త్, పోస్టుల సమాచారాన్ని ఇప్పటి వరకూ నిధి పోర్టల్‌లో నమోదు చేయలేదు. దీంతో జీతాల బిల్లులు ట్రెజరీలకు చేరకపోవడం వల్ల ఫిబ్రవరి జీతాలు ఆగిపోయాయి. ఇప్పటికే సగం నెల గడిచినా జీతం రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధి పోర్టల్‌లో వివరాలు నమోదు పూర్తి కాకుంటే.. మార్చి నెల జీతం కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది.
చాలా శాఖల్లో ప్రారంభమే కాని ప్రక్రియ
ఉద్యోగుల సేవా వివరాలు, జీతాలు, బిల్లుల నిర్వహణను డిజిటల్ విధానంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిధి పోర్టల్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఉద్యోగుల వ్యక్తిగత, నియామక వివరాలు, క్యాడర్ స్ర్టెంగ్త్, శాఖల వారీగా పోస్టుల వివరాలను పూర్తిగా నమోదు చేసి, తర్వాతే జీతాల బిల్లులు సమర్పించాలని సూచించింది. అయితే చాలా శాఖల్లో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభమే కాలేదు. అధికారులు సకాలంలో డేటా నమోదు చేయకపోవడం వల్ల వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు నిలిచిపోయాయి.
వరుస పండుగల వేళ ఇబ్బందులు
ఇప్పటికే ఫిబ్రవరి జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మార్చిలో వరుసగా పండుగలు ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. ఈ నెలలోనే ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి ప్రధాన పండుగలు ఉన్నాయి. సాధారణంగా పండుగల ముందు కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో జీతాలు లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల్లో చాలా మంది నెల జీతంపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. వేతనం ఆలస్యం కావడంతో ఇంటి అద్దెలు, పిల్లల చదువుల ఖర్చులు, బ్యాంకు ఈఎంఐలు, నిత్యావసర ఖర్చులు, ఇతర చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు చెబుతున్నారు.
వివరాలు నమోదు పూర్తి కాకపోతే..
ఇప్పటికే ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి ఆఖరు) దగ్గర పడింది. ఈ సమయంలో ప్రభుత్వ శాఖల్లో బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. నిధి పోర్టల్‌లో వివరాలు నమోదు పూర్తి కాకపోతే, ఫిబ్రవరి జీతాలతో పాటు మార్చి జీతం కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. నిధి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న వివరాలను వెంటనే నమోదు చేసి, జీతాలు విడుదల చేయాలని కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.