Share News

New Year Celebrations: 500 కోట్ల కిక్కు

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:23 AM

గతంలో రాష్ట్రంలో న్యూ ఇయర్‌ వేడుకల సమయంలో రోజుకు రూ.150 కోట్ల లోపే అమ్మకాలు జరిగాయి.

New Year Celebrations: 500  కోట్ల కిక్కు

  • న్యూ ఇయర్‌కు భారీగా తాగేశారు

  • డిసెంబరు 31-జనవరి 1 మధ్యలో అసాధారణంగా మద్యం విక్రయాలు

  • 6.73 లక్షల కేసుల లిక్కర్‌, 2.95 లక్షల కేసుల బీర్‌ అమ్మకాలు

  • ఫుల్‌గా తాగి ఊగిన మందుబాబులు

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. డిసెంబరు 29 నుంచి మూడు రోజుల్లో రూ.543 కోట్ల విలువైన మద్యాన్ని షాపులు, బార్ల లైసెన్సీలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. అందులో అత్యధిక భాగం డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో విక్రయించినట్లు ఎక్సైజ్‌ శాఖ అంచనా వేసింది.

అమరావతి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): గతంలో రాష్ట్రంలో న్యూ ఇయర్‌ వేడుకల సమయంలో రోజుకు రూ.150 కోట్ల లోపే అమ్మకాలు జరిగాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా రోజుకు సగటున రూ.180 కోట్ల మద్యం అమ్మకాలు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రతిరోజూ సగటున రూ.85కోట్ల అమ్మకాలు జరుగుతాయి. నూతన సంవత్సరం సందర్భంగా దీనికి రెట్టింపు కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. 6.73 లక్షల కేసుల లిక్కర్‌, 2.95 లక్షల కేసుల బీర్‌ను మందుబాబులు తాగేశారు. కాగా గతేడాది నూతన సంవత్సరం సమయంలో రూ.331 కోట్ల అమ్మకాలే జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) మొదటి మూడు త్రైమాసికాల్లో రూ.2,2983 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024-25తో పోలిస్తే ఇది 1.79శాతం ఎక్కువ. మద్యం షాపుల విక్రయాల్లో లిక్కర్‌ 277 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, బార్లలోని అమ్మకాల్లో 69 శాతం అమ్మకాలు పడిపోయాయి. బీర్‌ అమ్మకాలు షాపుల్లో 521 శాతం పెరగ్గా, బార్లలో 60 శాతం తగ్గాయి.


అమ్మకాలు పెరిగినా... పరిమాణం పరంగా అమ్మకాలు పెరిగినా, విలువ పరంగా పెద్దగా వృద్ధి కనిపించడం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించింది. అలాగే రూ.99 బ్రాండ్లు ప్రవేశపెట్టింది. మొత్తం అమ్మకాల్లో రూ.99 బ్రాండ్ల మద్యం అమ్మకాలు 20 శాతంగా ఉన్నాయి. ఫలితంగా అమ్మకాలు పెరిగినా విలువలో వృద్ధి కనిపించలేదు. కాగా డిసెంబరు నెలలో అమ్మకాలు భారీగా పెరిగాయి. 2024తో పోలిస్తే ఆ నెలలో విలువ పరంగా చూసినా 7.75 శాతం అమ్మకాలు పెరిగాయి. ఈ ఏడాది తీసుకొచ్చిన నూతన బార్‌ పాలసీ విఫలం కావడంతో బార్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. పాలసీ లాభదాయకంగా లేదని భావించిన వ్యాపారులు లైసెన్స్‌లు తీసుకునేందుకు కూడా ముందుకు రాలేదు. దీంతో 299 బార్లు ఎవరూ తీసుకోకుండా మిగిలిపోయాయి. ఆ ప్రభావం అమ్మకాలపై పడింది.

Updated Date - Jan 02 , 2026 | 04:25 AM