ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ‘తుఫాన్’
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:55 AM
ఒకే ఊరికి చెందిన బంధువులు.. ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. బంధువు అంత్య క్రియల్లో పాల్గొనేందుకు 14 మంది స్వగ్రామానికి బయలుదేరారు.
నలుగురి ప్రాణాలు బలిగొన్న డ్రైవర్ నిద్రమత్తు
మృతులు ప్రకాశం వాసులు.. డ్రైవర్ సహా 11 మందికి గాయాలు
మాచర్ల రూరల్, కనిగిరి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఒకే ఊరికి చెందిన బంధువులు.. ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. బంధువు అంత్య క్రియల్లో పాల్గొనేందుకు 14 మంది స్వగ్రామానికి బయలుదేరారు. వాహన డ్రైవర్ నిర్లక్ష్యానికి అందులో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా వెనిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన దగ్గరి బంధువులు కొందరు హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లో వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. స్వగ్రామం నాగిరెడ్డిపల్లెలో వారి బంధువు అనారోగ్యంతో గురువారం రాత్రి మృతిచెందటంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తుఫాన్ వాహనంలో గురువారం రాత్రి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మాచర్ల పట్టణానికి చేరుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తును గమనించి.. కొద్దిసేపు వాహనాన్ని నిలపమని కోరారు. డ్రైవర్.. ‘ఫర్వాలేదు’ అంటూ వాహనాన్ని నిలపకుం డా అతి వేగంగా నడిపాడు. పట్టణ శివారులోని నగరవనం సమీపంలో ఆగివున్న లారీని ఢీకొట్టాడు. ఈ సంఘటనలో నాగిరెడ్డిపల్లెకు చెందిన కదిరి వెంకటేశ్వర్లు (50), శారద (48) దంపతులతోపాటు, పిడుగు సత్యనారాయణ (55), సీఎస్‌పురం మండలం శీలంవారిపల్లికి చెందిన పోతంశెట్టి నాగలక్ష్మి(46) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎక్స్‌కవేటర్ సాయంతో బయటకు తీశారు. 11 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.