Share News

హాజరు ఫొటో కోసం వెళితే ప్రాణాలే పోయాయి

ABN , Publish Date - May 17 , 2026 | 04:17 AM

శనివారం ఉదయం ఆరు గంటల సమయం. సుమారు 20 మంది ఉపాధి కూలీలు కాకినాడ సమీప చీడిగ 216 బైపాస్‌ రోడ్డులోని కొవ్వూరు బ్రిడ్జి పైనుంచి కిందికి దిగుతున్నారు.

హాజరు ఫొటో కోసం వెళితే ప్రాణాలే పోయాయి

  • పని ప్రదేశంలో సిగ్నల్స్‌ లేక వంతెన పైకి!

  • అక్కడి నుంచి కిందికి దిగుతుండగా ఢీకొన్న టిప్పర్‌

  • నలుగురు మహిళా ‘ఉపాధి’ కూలీలు దుర్మరణం

  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

  • కాకినాడ జిల్లా చీడిగలోని 216 బైపాస్‌ రోడ్డులో ఘటన

కాకినాడ, మే 16(ఆంధ్రజ్యోతి): శనివారం ఉదయం ఆరు గంటల సమయం. సుమారు 20 మంది ఉపాధి కూలీలు కాకినాడ సమీప చీడిగ 216 బైపాస్‌ రోడ్డులోని కొవ్వూరు బ్రిడ్జి పైనుంచి కిందికి దిగుతున్నారు. అదే సమయంలో వెనక వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ నడిచి వెళుతున్న కూలీలను ఢీకొంది. ఆరుగురు మహిళలను ఢీకొని.. బ్రిడ్జి కుడివైపున ఉన్న రెయిలింగ్‌ను రాసుకుంటూ.. కూలీలను ఈడ్చుకుంటూ వెళ్లింది. రోడ్డంతా రక్తసిక్తమయ్యింది. నలుగురు మహిళా కూలీల శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కాకినాడ జిల్లా.. కాకినాడ రూరల్‌ మండలం చీడిగలోని 216 బైపాస్‌ రోడ్డులో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీడిగ గ్రామానికి చెందిన కొందరు ఉపాధి కూలీలు శనివారం ఉదయమే ఐదు గంటలకు తమ ఊరి సమీపంలోని కొవ్వూరు బ్రిడ్జి వద్ద గల పంట కాలువలో మట్టి తవ్వకాలు, పూడికతీత పనులకు వెళ్లారు. ఇటీవల ప్రభుత్వం.. ఉపాధి కూలీలకు లైవ్‌ లొకేషన్‌లో ముఖ ఆధారిత ఫొటో తీసుకునే విధానాన్ని తీసుకువచ్చింది. పనిని ప్రారంభించే ముందు.. పని ప్రాంతంలో కూలీల ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అయితే వాళ్లు పని చేసే ప్రదేశంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సర్వర్‌ సమస్యలు ఉండడంతో, ఫొటో తీసుకునేందుకు 20 మంది కూలీలు ఎత్తుగా ఉన్న 216 బైపాస్‌ రోడ్డులోని కొవ్వూరు బ్రిడ్జిపైకి చేరుకున్నారు.


అక్కడ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ముఖ ఆధారిత ఫొటో తీశాక, కూలీలు బ్రిడ్జి కుడివైపు నుంచి కిందకు దిగుతున్న సమయంలో తూరంగి నుంచి చీడిగ వైపు వస్తున్న టిప్పర్‌ లారీ వెనుక నుంచి అతి వేగంగా వచ్చి, ఆరుగురు మహిళలను ఢీకొంది. ఈ ప్రమాదంలో వాసంశెట్టి సత్యవతి (60), పాలిక కృష్ణవేణి(45), కాదా చిట్టెమ్మ (65), చెల్లూరి అన్నవరం(51) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మట్టపర్తి అరుణకుమారి (48), పాలిక నాగమణి(55) తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు అంబులెన్సులో కాకినాడ జీజీహెచ్‌కు, అపోలో ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. డ్వామా పీడీ మధుసూధన్‌, ఎంపీడీవో పి.సతీశ్‌, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున, పీఎం సురక్ష యోజన, పీఎం జీవన్‌ జ్యోతి యోజన కింద రూ.4 లక్షలు అందిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే పంతం నానాజీ మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సొంత నిధులు అందజేశారు.

Updated Date - May 17 , 2026 | 04:20 AM